Share News

నేడు చదలవాడ రఘునాయక స్వామి కల్యాణం

ABN , Publish Date - Apr 13 , 2025 | 11:56 PM

నాగులుప్పలపాడు మండలంలోని చదలవాడలో ఉన్న రఘునాయక స్వామికి ఏటా చైత్ర శుద్ధదశమి మొదలుకొని చైత్ర బహుళ పంచమి వరకు అగమానుసారం బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నెల 7న ప్రారంభమైన ఉత్సవాలు 16వ తేదీతో ముగుస్తాయి.

నేడు చదలవాడ రఘునాయక స్వామి కల్యాణం

నాగులుప్పలపాడు, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని చదలవాడలో ఉన్న రఘునాయక స్వామికి ఏటా చైత్ర శుద్ధదశమి మొదలుకొని చైత్ర బహుళ పంచమి వరకు అగమానుసారం బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నెల 7న ప్రారంభమైన ఉత్సవాలు 16వ తేదీతో ముగుస్తాయి. సోమవారం స్వామికి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఉభయదాతలుగా మద్దిరాలపాడుకు చెందిన పెనుబోతు వంశీయులు శతాబ్దకాలంగా కొనసాగుతున్నారు. అదేరోజు సాయంత్రం చదలవాడ తిరునాళ్ల, రఘునాయక స్వామి రథోత్సవం జరుగుతాయి. మద్దిరాలపాడుకు చెందిన తూమాటి రాంబొట్లు చౌదరి కుటుంబీకులు ఉభయదాతలుగా వ్యవహరించి రఽధోత్సవం నిర్వహిస్తారు. కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచే సినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి దొంత అనీల్‌ చెప్పారు.

చదలవాడ రఘునాయకస్వామి ఆలయ విశిష్టతలు

పురాతన ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం.. 1450 ఏళ్ల చరిత్ర సొంతం

శ్రీరాముడు సీతాదేవి విగ్రహాలు పంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం అగస్త్య మహాముని స్థాపించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.

సీతాదేవి శ్రీరామునికి కుడివైపు ఉండటం మరో విశేషం.

గుండ్లకమ్మ నది ఈ ఆలయానికి దక్షిణంగా ప్రవహిస్తోంది.

సీతాదేవి జాడ కోసం వెళ్లిన హనుమంతుని రాక కోసం నిరీక్షిస్తున్నట్లు స్వామి దక్షిణాభిముఖంగా దర్శనమిస్తారు.

ఏడాదికొక్కసారి జరిగే స్వామి కల్యాణోత్సవానికి ఠంచన్‌గా ఓ గరుడ పక్షి ముఖ్యఅతిథిగా హాజరవడం మరో ప్రత్యేకత.

సోమవారం జరగనున్నది స్వామి వారికి 240వ కల్యాణం

ఉత్సవాల సమయంలో భద్రాచలంలోని శ్రీరాముడు, చదలవాడ రఘునాయక స్వామిలోకి ప్రవేశిస్తాడని భక్తుల విశ్వాసం.

చదలవాడకు ఆ పేరుపై రెండు కథనాలు

చదలవాడకు చతుర్వాటిక అని మరో పేరు ఉన్నట్లు స్థలపురాణం చెబుతోంది. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతను అన్వేషిస్తూ వానర సైన్యంతో చదలవాడ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ్నుంచే వానర సైన్యాన్ని నాలుగు భాగాలుగా విభజించి నాలుగు దిక్కులకు పంపారు. అందువల్ల ఈ ప్రాంతానికి చతుర్వాటిక అనే పేరు కల్గింది.

చదలవాడకు ఆ పేరు రావడం వెనుక మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఇక్కడ రఘునాయక స్వామి ఆలయంతోపాటు లింగోద్భవస్వామి ఆలయం కూడా ఉంది. పూర్వం పరమేశ్వరుడు శివలింగ రూపంలో భక్తులకు ఒక చెదలపుట్టలో దర్శనమిచ్చాడు. భక్తులు ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఆలయం నిర్మించారు. ఆలయంలోని శివలింగంపై శివుని ముఖాకృతితోపాటు, లింగోద్భవ ఘట్టాన్ని చాటిచెప్పేవిధంగా, వరాహ బొమ్మలను కూడా అద్భుతంగా చెక్కారు. పరమశివుడు లింగోద్భవస్వామిగా ఇక్కడ పూజలందుకుంటున్నారు. చెదలపుట్టలో శివలింగం లభించినందున చెదలవాడ అనే పేరు వచ్చింది. కాల క్రమంలో చదలవాడగా మారింది.

రథోత్సవంనాడు స్వామి రథాన్ని లాగితే పునీతులవుతారని వేలాది మంది పోటీపడి మరీ లాగుతారు.

ప్రముఖ గాయకుడు బొమ్మరాజు సీతారామదాసు 1942లో స్వామి కల్యాణోత్సవంలో కీర్తనలు ఆలపిస్తూ తనువు చాలించాడు. అప్పటి నుంచి ఆయన వంశీయులు ఈ ఉత్సవాల్లో తరంగ గానం చేయటం ఆనవాయితీగా మారింది.

Updated Date - Apr 13 , 2025 | 11:56 PM