Cultivation : రబీ పంటలు ఆశాజనకం
ABN, Publish Date - Jan 04 , 2025 | 04:59 AM
రాష్ట్రంలో రబీ సీజన్ ఆశాజనకంగా సాగుతోంది. గత ఏడాదితో పోల్చితే సాగు చాలా మెరుగ్గా ఉంది.

సాధారణ విస్తీర్ణం 53.8 లక్షల ఎకరాలు
ఇప్పటికే 26.42 లక్షల ఎకరాలు సాగులోకి
పెరిగిన వాణిజ్య పంటల సాగు
అమరావతి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రబీ సీజన్ ఆశాజనకంగా సాగుతోంది. గత ఏడాదితో పోల్చితే సాగు చాలా మెరుగ్గా ఉంది. 53.8 లక్షల ఎకరాల రబీ సాధారణ సాగులో ఇప్పటికే 26.42 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. నిరుడు రబీలో వర్షాభావం, ఇతర సమస్యలతో సాగు బాగా తగ్గింది. గతేడాదితో పోల్చితే ఇప్పుడు 5లక్షల ఎకరాల్లో ఎక్కువగా పంటలు వేశారు. కృష్ణా, గోదావరి డెల్టాల్లో మొదటి పంట వరి కోసిన కొందరు రైతులు రెండో పంటగా జొన్న, మొక్కజొన్న, అపరాలు వేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెండో పంటగా వేసే వరి సాగు పుంజుకుంది. నిరుటి కంటే అధికంగా నాట్లు పడ్డాయి. నైరుతీ, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలో వర్షాలు ఆశాజనకంగా కురవడంతో రబీ సాగు ఆశాజనకంగా ఉంది. రైతులు రాగి, సజ్జ, ఇతర చిరుధాన్యాలతోపాటు వేరుశనగ, ఇతర నూనెగింజల పంటలు వేస్తున్నారు. అలాగే ప్రకాశం జిల్లాతోపాటు రాయలసీమలో ఉలవ సాగు గణనీయంగా పెరిగింది. ఈ సీజన్‌లో 45వేల ఎకరాల్లో వేసే ఉలవ పంట ఇప్పటికే లక్షన్నర ఎకరాలు దాటింది. ప్రకాశం, గుంటూరు జిల్లాలతోపాటు రాయలసీమతో కలిపి 10లక్షల ఎకరాలపైగా సాగవ్వాల్సిన శనగ (బెంగాళీగ్రామ్) ఇప్పటికి 6లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చింది. కంది, మినుము, పెసర పంటలు కూడా 70-80% పడ్డాయి. పొగాకు సాగు సాధారణం కంటే 60వేల ఎకరాల్లో పెరిగింది.
Updated Date - Jan 04 , 2025 | 04:59 AM