Andhra Pradesh High Court: తులసిబాబు బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

ABN, Publish Date - Mar 25 , 2025 | 04:32 AM

శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నిందితుడు తులసిబాబుకు బెయిల్‌పై హైకోర్టులో వాదనలు ముగిసిన విషయం. కోర్టు ఈ నెల 27న బెయిల్‌పై నిర్ణయం ఇవ్వనున్నట్లు తెలిపింది

 Andhra Pradesh High Court: తులసిబాబు బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
  • 27న నిర్ణయం వెల్లడిస్తామన్న హైకోర్టు

అమరావతి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నిందితుడు కామేపల్లి తులసిబాబుకు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ నెల 27న నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు ఉత్తర్వులు ఇచ్చారు. గుంటూరు నగరంపాలెం పోలీసులు నమోదు చేసిన కేసులో ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న తులసిబాబు.. బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషనర్‌ తరఫు న్యాయవాది అశ్వినీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ అరెస్టై 74 రోజులు గడిచాయని, కస్టడీలో పోలీసులు రెండుసార్లు విచారించారని తెలిపారు. తనను సీఐడీ పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారని, అందులో తులసిబాబు గురించి ప్రస్తావించలేదన్నారు. రఘురామ అరె్‌స్టలో కీలకపాత్ర పోషించిన అప్పటి దర్యాప్తు అధికారి సీఐడీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ బెయిల్‌పై విడుదలయ్యారన్నారు. కోర్టు షరతులకు కట్టుబడి ఉంటామని, బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. పోలీసుల తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. రఘురామరాజును చిత్రహింసలకు గురిచేసిన వ్యవహారంలో తులసిబాబు పాత్ర ఉందని అతని స్నేహితులే వాంగ్మూలం ఇచ్చారని, బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, ఆయన పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.

Updated Date - Mar 25 , 2025 | 04:34 AM