Speaker Ayanna Patra : అవి సంధి ప్రేలాపనలు!
ABN , Publish Date - Mar 06 , 2025 | 06:18 AM
ప్రతిపక్ష నేతగా గుర్తించాలన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి విన్నపాన్ని పరిశీలించడం సాధ్యపడదని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.

అన్నీ తెలిసీ జగన్ అవాకులు.. విపక్షనేత హోదా దక్కదు
నిబంధనలు, సంప్రదాయాల ప్రకారమే నిర్ణయం
పది శాతం సభ్యులు ఉండాల్సిందే.. స్పీకర్ రూలింగ్
అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష నేతగా గుర్తించాలన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి విన్నపాన్ని పరిశీలించడం సాధ్యపడదని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ప్రజలు నిరాకరించిన హోదాను స్పీకర్‌గా నేను ఎలా ఇవ్వలను? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత హోదా కోసం హైకోర్టులో జగన్ వేసిన పిటిషన్‌తోపాటు గత ఏడాది తనకు రాసిన లేఖలోని అంశాలపై పూర్తి వివరణ ఇస్తూ బుధవారం అసెంబ్లీలో ఆయన ఒక రూలింగ్ ఇచ్చారు. నిబంధనలు, సంప్రదాయాల గురించి తెలిసినప్పటికీ జగన్, ఆయన పార్టీ నేతలు నిరాధారమైన ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకరుకు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని హెచ్చరించారు. ‘‘జగన్ సాగించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలుగా పరిగణించి క్షమిస్తున్నాను. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యుల సమష్టి విజ్ఞతకు వదిలేస్తున్నాను’’ అని తెలిపారు. ఇదే సందర్భంలో... సభకు హాజరు కావాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. స్పీకర్ రూలింగ్‌లోని కీలకాంశాలు... ఆయన మాటల్లోనే!
రూలింగ్ ఎందుకంటే...
జగన్ గత ఏడాది జూన్ 24న నాకు ఒక లేఖ రాశారు. అందులో అభియోగాలు, సంధి ప్రేలాపనలు, బెదిరింపులే ఉన్నాయి. అభ్యర్థన మాత్రం లేదు. దానికితోడు తనకు విపక్ష నేత హోదాకు అర్హత ఉందంటూ అసంబద్ధ వాదనలు చేస్తున్నారు. ఈ లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ న్యాయ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చేవరకు వేచి చూద్దామనుకున్నాను. కానీ... స్పీకర్‌కు హైకోర్టు సమన్లు జారీ చేసిందని, ఉత్తర్వులు జారీ చేయాలని స్పీకరును ఆదేశించిందని జగన్ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. నిజానికి... ఆ పిటిషన్ విచారణార్హతే ఇప్పటిదాకా నిర్ధారణ కాలేదు. జగన్ తన కల్పిత వాదనలను, ఆకాంక్షలను న్యాయస్థానానికి ఆపాదించడానికీ వెనకాడలేదు. ఇదే ఆయన సహజ శైలి. అందుకే ఈ రూలింగ్‌తో తప్పుడు ప్రచారానికి తెరదించాలని నిర్ణయించుకున్నాను.
సంప్రదాయం ప్రకారమే...: గత ఏడాది జూన్ 21న శాసనసభలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చిరకాల సంప్రదాయాలను అనుసరించే నిర్వహించారు. జగన్‌ను మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రస్తుత మంత్రుల తర్వాత శాసన సభ్యునిగా ప్రమాణం చేయడానికి ఆహ్వానించారు. ‘జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా నిరాకరించడానికి ఇది సూచిక’ అని ఆయన చెప్పడంలో అర్థం లేదు. జూన్ 22న స్పీకర్ ఎన్నిక జరిగింది. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇచ్చే అధికారం స్పీకర్‌కు మాత్రమే ఉంటుంది. నిజానికి జగన్ తమ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైనట్టు జూన్ 26వ తేదీ వరకు మా కార్యాలయానికి తెలుపనే లేదు. అలాంటప్పుడు... జూన్ 26కు ముందే ముందే ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి నిర్ణయం తీసుకోవడం సాధ్యమా?
ప్రతిపక్ష హోదా దక్కేది ఇలా...
ప్రతిపక్ష నాయకుని హోదాకు ఎవరైనా అర్హులా? కాదా? అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు, కోర్టు తీర్పులు, చిరకాల సంప్రదాయాలు మాత్రమే నిర్ణయిస్తాయి. ఆంధ్రప్రదేశ్ వేతనాలు, పింఛన్ల చెల్లింపు, అనర్హతల తొలగింపు చట్టం-1953లో ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రస్తావన ఉంది. ఆ చట్టంలో సెక్షన్-12బి ప్రకారం ఎవరికైనా ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలంటే.. ఆ వ్యక్తిని ప్రతిపక్ష నాయకుడిగా సభాపతి గుర్తించాలి. ఒకవేళ అత్యధిక సంఖ్యాబలం ఉన్న ప్రతిపక్షాలు ఒకటి కన్నా ఎక్కువ ఉంటే.. ఆయా పార్టీల హోదాను దృష్టిలో ఉంచుకుని, వాటిలో ఏదో ఒక పార్టీ నాయకుడికి సభాపతి ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించవచ్చు. ఈ విషయంలో సభాపతి నిర్ణయానికి తిరుగుండదని సెక్షన్-12బి చెబుతోంది. అయినప్పటికీ పార్లమెంటులోనూ, రాష్ట్రాల చట్టసభల్లోనూ సభాపతులు ఈ అధికారాల వాడకంలో, లోక్‌సభ మొదటి స్పీకర్ జి.వి.మావలాంకర్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం నడుచుకుంటున్నారు. సభ సమావేశం కావడానికి అవసరమైన కోరంతో సమానంగా, అంటే మొత్తం సభ్యుల్లో పదింట ఒక వంతు సంఖ్యాబలం కలిగిన పార్టీనే స్పీకర్ గుర్తించాలని లోక్‌సభ డైరెక్షన్ 121 చెబుతోంది. దీనినే పార్లమెంటుతోపాటు అన్ని రాష్ట్రాల చట్టసభల్లో పాటిస్తున్నారు. గతంలో ఏపీ స్పీకర్ కూడా ఇదే తరహాలో డైరెక్షన్ నంబరు 56ను జారీ చేశారు. డైరెక్షన్‌కు మూలాలు రాజ్యాంగంలో 100 (3), 189 (3) అధికరణాల్లో నిర్దేశించారు. ఉమ్మడి ఏపీకి సంబంధించి 1972-77, 1994-99 మధ్య కాలంలో ఏ ప్రతిపక్ష పార్టీకీ కనీసం 10 శాతం సీట్లు రాలేదు. అప్పుడు ఎవరికీ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కలేదు.
సత్యదూరంగా జగన్ లేఖ
జగన్ తన లేఖలో ఉదహరించిన అనేక అంశాలు సత్యదూరాలే! ఆయన చెప్పినట్లుగా 1994లో పి.జనార్దన రెడ్డికి విపక్ష నేత గుర్తింపు దక్కలేదు. ఆయనను కాంగ్రెస్ శాసనసభా పక్షానికి నేతగా మాత్రమే గుర్తించారు. 8వ లోక్‌సభలో టీడీపీకి 10 శాతం సంఖ్యాబలం లేకపోయినా పి.ఉపేంద్రకు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు లభించిందని జగన్ అంటున్నారు. అది కూడా అవాస్తవం. ఉపేంద్రను ఆనాటి సభాపతి టీడీపీ గ్రూపు నాయకుడిగా మాత్రమే గుర్తించారు. ఈ వాస్తవాలను, సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుంటే.. 175 మంది సభ్యులున్న నేటి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం 18 మంది సభ్యులుంటే తప్ప ప్రతిపక్ష నేత హోదా రాదని అందరికీ అర్థమవుతుంది. ‘‘చంద్రబాబుకు 23 మంది శాసనసభ్యులున్నారు. ఒక ఐదుగురిని లాగేస్తే ఆయనకు 18 మంది కూడా ఉండరు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు’’ అని ఇదే జగన్ 2019 జూన్ 13న ముఖ్యమంత్రి హోదాలో సభలోనే చెప్పారు. అంటే... ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు పొందాలంటే సభలో కనీసం 10 శాతం సంఖ్యాబలం ఉండాలన్న నిబంధన గురించి ఆయనకు స్పష్టంగా తెలుసునని దీని ద్వారా స్పష్టమవుతోంది.
ఆ లేఖను బహిర్గతం చేయాలి: ఫరూక్
ప్రతిపక్ష హోదా కోసం బెదిరింపులకు పాల్పడుతూ జగన్ స్పీకర్‌కు రాసిన లేఖను ప్రజలందరికీ తెలిసేలా బహిర్గతం చేయాలని మైనారిటీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ కోరారు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ చేస్తున్న తప్పుడు ప్రచారంపై సభలో సీరియ్‌సగా చర్చించాలని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు.
సభకు రాకుండా రాద్ధాంతమా: పార్థసారథి
తన స్వలాభం కోసం 10 మంది ఎమ్మెల్యేలను సభకు దూరం చేయడం జగన్‌కు తగదని మంత్రి పార్థసారఽథి అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా స్పీకర్ గుర్తిస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తారన్న విషయం మాజీ సీఎంకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన ధ్వజమెత్తారు.
ఎవరెక్కడ ఉండాలో నిర్ణయించేది ప్రజలే: లోకేశ్
జగన్ తనకు ప్రతిపక్ష హోదా కోసం స్పీకరుపైనే వ్యక్తిగత ఆరోపణలు చేయడం తగదని, ఇది శాసనసభ పరువు ప్రతిష్ఠలకు సంబంధించిన అంశమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఎవరు ఎక్కడ ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా రాదని చట్టం చెబుతుంటే.. దానిని ఉల్లంఘించి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడం సరికాదన్నారు. జగన్ చేస్తున్న దుష్ప్రచారంపై స్పీకరు ఇచ్చిన రూలింగ్‌పై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాలని కోరారు. ఇక, అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేని జగన్ ఇంట్లో ప్రెస్‌మీట్ పెట్టి.. అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని, గతంలో లోక్‌సభలో ప్రతిపక్ష హోదాపై రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. ఏపీలో జగన్‌కూ వర్తిస్తుందని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.
సభా హక్కుల సంఘానికి పంపాలి: నాదెండ్ల
వైసీపీ ఎమ్మెల్యేలు, వారి నాయకుడు తమ బాధ్యతలను విస్మరించి శాసనసభను, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా దుష్ప్రచారం చేయడం సరికాదని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ‘‘వైసీపీ సభ్యులు చేస్తున్న దుష్ప్రచారం అంశాన్ని సభా హక్కుల సంఘానికి రిఫర్ చేయాలి’’ అని కోరారు. కాగా, ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్లమని పవన్‌కల్యాణ్ అనడంలో తప్పేముందని, సభ్యత్వం లేని పార్టీకి జీవిత కాలం అధ్యక్షుడిగా ప్రకటించుకున్న జగన్.. జనసేన పార్టీని, పవన్‌కల్యాణ్‌ను విమర్శిస్తారా అని మనోహర్ ధ్వజమెత్తారు.
వైసీపీ క్యాన్సర్ వంటిది: సత్యకుమార్
‘ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్... అబద్ధాలు చెప్పడం అలవాటైన జీవితాంతం అబద్ధాలు చెబుతూనే ఉంటాడు... ఈ నానుడి జగన్‌కు 100 శాతం వర్తిస్తుంది’ అని మంత్రి సత్యకుమార్ అన్నారు. ‘ఐదేళ్ల పాటు సీఎంగా పనిచేసి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టుపట్టించిన జగన్... మీడియా సమావేశంలో ఎప్పటిలానే అబద్ధాల్ని నిర్లజ్జగా వండి వార్చారు. రాష్ట్రంలో యుద్ధప్రాతిపదికన వైద్య కళాశాలలను చేపట్టామని జగన్ అనడం అతి పెద్ద అబద్ధం. వైసీపీ, క్యాన్సర్ వంటిది. ఇటీవల ఎన్నికల ఫలితాల ద్వారా జరిగిన తాత్కాలిక వైద్యంతో ఆ క్యాన్సర్ నయం కాలేదు. ఈ క్యాన్సర్‌కు ప్రజలు శాశ్వత బహిష్కరణ విధించాలి’ అని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఇక, వైసీపీకి 11 సీట్లే వచ్చాయన్న సంగతిని పక్కనబెట్టి.. కావాలనే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదనే భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని బీజేఎల్పీనేత విష్ణుకుమార్‌రాజు విమర్శించారు.