Ambedkar: బహుజనులు స్వేచ్ఛగా బతకాలి
ABN , Publish Date - Apr 15 , 2025 | 12:12 AM
Equality and freedom ‘స్వేచ్ఛ, ధైర్యంతో బహుజనులు బతకాలి. అంబేడ్కర్ ఆశయాల సాధనకు అదే మార్గమ’ని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జంక్షన్‌లో తొమ్మిదిన్నర అడుగుల అంబేడ్కర్ కాంస్యవిగ్రహాన్నిఆవిష్కరించారు.

అంబేడ్కర్ ఆశయ సాధనే టీడీపీ లక్ష్యం
ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత వైసీపీది
రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేద్దాం
కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
ఘనంగా అంబేడ్కర్ కాంస్య విగ్రహావిష్కరణ
అరసవల్లి, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): ‘స్వేచ్ఛ, ధైర్యంతో బహుజనులు బతకాలి. అంబేడ్కర్ ఆశయాల సాధనకు అదే మార్గమ’ని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జంక్షన్‌లో తొమ్మిదిన్నర అడుగుల అంబేడ్కర్ కాంస్యవిగ్రహాన్ని కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆవిష్కరించారు. గజమాల, పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల రోడ్డులోని అంబేడ్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంతో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడారు. ‘అంబేడ్కర్ జీవితాశయాలను అనుసరించి ప్రజలు నిజమైన నివాళులర్పించాలి. అంబేడ్కర్ ఒక మతానికో, కులానికో చెందిన వ్యక్తి కాదు. ఆయన ఒక సంఘ సంస్కర్త. రాజ్యాంగ కర్త. ఆయన రచించిన రాజ్యాంగం ఒక భగవద్గీత, బైబిలు, ఖురాను వలే ఎంతో పవిత్రంగా విలసిల్లుతోంది. సమాజంలో అసమానతలు తొలగించేలా.. విద్య మాత్రమే జీవితాలను మార్చగలదని నమ్మి, ఉన్నత చదువులు అభ్యసించి, దేశ రాజ్యాంగాన్ని రచించి, నేటికీ పూజలందుకునే గొప్పస్థాయికి ఎదిగిన మహానుభావుడు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా టీడీపీ పనిచేస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. గత వైసీపీ పాలనలో ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టిన దౌర్భాగ్యపు పరిస్థితి సృష్టించారు. నేడు కూటమి ప్రభుత్వ హయాంలో ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా వేలాది మందికి స్వయం ఉపాధి కల్పనకు వేలకోట్ల రుణాలను మంజూరు చేస్తున్నాం. అందరం రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేద్దాం. అంబేడ్కర్ ఆశయాలను గౌరవిద్దాం. ఆయన బాటలో పయనిద్దాం’ అని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు.
అణగారిన వర్గాలకు పూర్తిస్థాయి న్యాయం: రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు
అణగారిన వర్గాలకు పూర్తిస్థాయి న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని, తద్వారా అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ‘ఈ ఏడాది అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు ఎప్పటికీ ప్రత్యేకం. తొమ్మిదిన్నర అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని.. ఆ మహానుభావుడి జయంతి రోజునే ఏర్పాటు చేయడం ఎన్నటికీ మరచిపోలేని అనుభూతి. మా ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధికి ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది. జస్టిస్ పున్నయ్య కమిషన్ ప్రతిపాదించిన 29 సూత్రాలను ఒకేసారి అమలు చేసిన ఘనత టీడీపీదే. పీ-4 విధానంతో వ్యక్తిగత, సమాజ వికాసం సాధ్యమవుతుంద’ని మంత్రి అచ్చెన్న తెలిపారు. అనంతరం విగ్రహ శిల్పి రాజ్‌కుమార్‌ను కేంద్ర, రాష్ట్ర మంత్రులు సత్కరించారు.
శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. ‘రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఈ దేశపు విలువైన ఆస్తి. ఆయన ఆశయ సాధనలో ముందుకు పయనిద్దామ’ని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ఆర్డీవో సాయిప్రత్యూష, పీఎంజే బాబు, మట్టా పురుషోత్తం, గోర సురేష్, కంఠ వేణు, బోసు మన్మథరావు, తైక్వాండో శ్రీను, బొడ్డేపల్లి నర్సింహులు, సుధాకర్, మాదారపు వెంకటేష్ పాల్గొన్నారు.