10th Exams: పదో తరగతి పరీక్షలు ప్రారంభం
ABN , Publish Date - Mar 17 , 2025 | 11:55 PM
Examinations Start పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 149 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు ఉరుకులు, పరుగులతో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.

తొలిరోజు 217 మంది విద్యార్థుల గైర్హాజరు
గుజరాతీపేట, మార్చి 17(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 149 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు ఉరుకులు, పరుగులతో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లావ్యాప్తంగా తొలిరోజు తెలుగు పరీక్షకు 28,189 మంది రెగ్యులర్ విద్యార్థులకుగానూ 28,071 మంది హాజరయ్యారు. 118 మంది గైర్హాజరయ్యారు. ఓపెన్ విధానం పరీక్షలకు సంబంధించి 168 మందికిగాను 69 మంది హాజరయ్యారు. 99 మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా తొలిరోజు 217 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఈవో ఎస్.తిరుమల చైతన్య తెలిపారు.
శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మునిసిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు. అక్కడ సదుపాయాల కోసం ఆరా తీశారు. విద్యార్థులకు తాగునీరు సమస్య లేకుండా చూడాలని సూచించారు.
తల్లిదండ్రులు మందలించారని.. విద్యార్థి అదృశ్యం
కోటబొమ్మాళి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): కోటబొమ్మాళి మేజర్ పంచాయతీ పరిధి జగనన్న కాలనీకి చెందిన పదో తరగతి విద్యార్థి సంపతిరావు విక్రాంత్ అదృశ్యమయ్యాడని స్థానిక ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు. విక్రాంత్ సోమవారం నుంచి పదోతరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. కాగా ఆదివారం చదువు విషయంలో తల్లిదండ్రులు సంపతిరావు రమేష్, రేవతి మందలించారు. బయట తిరగకుండా బాగా చదువుకుని పరీక్షలు రాయాలని చెప్పారు. దీంతో మధ్యాహ్నం ఇంటి నుంచి విక్రాంత్ బయటకు వెళ్లిపోయాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది గాలించారు. బంధువుల ఇంట్లో కూడా లేకపోవడంతో తమ కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.