Share News

Forest in danger: నిప్పు.. అడవులకు ముప్పు

ABN , Publish Date - Apr 03 , 2025 | 11:45 PM

Environmental danger ఎత్తయిన వృక్షాలు, గలగల పారే సెలయేళ్లు.. పచ్చక బయళ్లు.. వన్యప్రాణుల సంచారంతో ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలిచే అడవులు క్రమేపీ కనుమరుగవుతున్నాయి. మహేంద్రగిరులు.. జీవ వైవిద్యానికి పుట్టినిల్లు. ప్రకృతి సంపదకు నెలవు. పులులు, ఏనుగులు వంటి తదితర జంతువులు ఇక్కడ నిత్యం సంచరిస్తుంటాయి. ఇంతటి అభయార్యణానికి అగ్నిప్రమాదాల ముప్పు పొంచి ఉంది.

Forest in danger: నిప్పు.. అడవులకు ముప్పు
చినరంగుమఠియా వద్ద అగ్నికి ఆహుతవుతున్న అటవీ ప్రాంతం(ఫైల్‌)

  • - ఆకతాయి చర్యలతో అనర్థాలెన్నో..!

  • - ఏటా వేసవిలో అధికంగా అగ్నిప్రమాదాలు

  • - రూపం కోల్పోతున్న మహేంద్రగిరులు

  • - జనావాసాల్లోకి వన్యప్రాణులు

  • మార్చి 31న మందస మండలం చీపి సమీపంలో హొన్నాళి వద్ద సుమారు ఐదు ఎకరాల్లో రైతులకు చెందిన జీడి, మామిడితోపాటు అటవీశాఖకు చెందిన అనేక ఎకరాల్లో టేకు, వెదురు వనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు వ్యాపించకుండా అదుపు చేయడంతో కొంతమేర నష్టం తగ్గింది. పంట చేతికొచ్చే దశలో జీడి, మామిడి చెట్లు కాలిబూడిదయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ............................

  • మందస మండలం కళింగదల్‌ సమీపంలోని తూర్పుకనుముల్లో గతేడాది ఓ కొండ అగ్నిప్రమాదానికి గురైంది. విలువైన చెట్లు, దట్టంగా ఉండే వెదురు వనాలు అగ్నికి ఆహుతై ఇలా మోడుబారిపోయింది. వన్యప్రాణులకు నెలవైన ఈ ప్రాంతం ఎడారిలా మారింది.

    .................

  • మెళియాపుట్టి మండలం రింపి గ్రామానికి చెందిన డి.బింజయ్య అనే గిరిజనుడు గత ఐదేళ్లుగా సుమారు 8 ఎకరాల్లో జీడి, మామిడి చెట్లు పెంచుతున్నాడు. గతేడాది అగ్నిప్రమాదం వద్ద సుమారు 5 ఎకరాలు కాలిపోవడంతో ఆందోళన చెందాడు. కొంతమంది అడవుల్లో నిప్పు పెట్టడంతో తమకు పంట నష్టం వాటిల్లిందని వాపోతున్నాడు.

    .....................

  • మెళియాపుట్టి మండలంలోని అడ్డివాడ, చందనగిరి, గూడ కొండల్లో గతేడాది నిప్పు అంటుకుంది. సుమారు వారం రోజులపాటు మంటలు అదుపుకాలేదు. దీంతో దాదాపు 8 ఎకరాల్లో చెట్లు కాలిపోయి.. కొండల్లో పచ్చదనం కనుమరుగైందని గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

    ................

  • హరిపురం/ మెళియాపుట్టి, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): ఎత్తయిన వృక్షాలు, గలగల పారే సెలయేళ్లు.. పచ్చక బయళ్లు.. వన్యప్రాణుల సంచారంతో ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలిచే అడవులు క్రమేపీ కనుమరుగవుతున్నాయి. మహేంద్రగిరులు.. జీవ వైవిద్యానికి పుట్టినిల్లు. ప్రకృతి సంపదకు నెలవు. పులులు, ఏనుగులు వంటి తదితర జంతువులు ఇక్కడ నిత్యం సంచరిస్తుంటాయి. ఇంతటి అభయార్యణానికి అగ్నిప్రమాదాల ముప్పు పొంచి ఉంది. ఏటా జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు తరచూ అగ్నికీలలు ఎగిసి పడుతుంటాయి. దీంతో అటవీ సంపద బుగ్గిపాలు కావడంతోపాటు వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. పర్యావరణానికి ముప్పు తలెత్తుతోంది.

  • ఏటా వేసవి ఆరంభంలోనే కొండలు, గుట్టలపై ఉండే చిట్టడవులతోపాటు గడ్డి మైదానాలు ఎండిపోతాయి. వాటికి కొంతమంది ఆకతాయిలు నిప్పు పెట్టడంతో విలువైన వృక్షాలతోపాటు జీడి, మామిడి తోటలు, పంట పొలాలు అగ్నికి ఆహుతవుతున్నాయి. అగ్నిప్రమాదాలతోపాటు గొడ్డలి వేటు.. అడవులకు ముప్పు తెచ్చిపెడుతున్నాయి. జిల్లాలోని 5.8లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. దీనిలో తూర్పుకనుములుగా పేరొందిన మందస, సోంపేట, పలాస, మెళియాపుట్టి మండలాల పరిధిలో విస్తరించిన మహేంద్రగిరులు అగ్నికి ఆహుతై రూపం కోల్పోతున్నాయి. ఆయా మండలాల పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నాటిన విలువైన టేకు, మామిడి, నీలగిరి, నేరడు వంటి చెట్లతోపాటు వేలాది ఎకరాల్లో వెదురు వనాలు విస్తరించి ఉన్నాయి. డ్వామా, ఉపాధిహామీ పథకంలో అధికారులు కొండలు, గుట్టలపై టేకు, ఏగిసు, ఉసిరి, ఎర్రచందనం వంటి మొక్కలను రూ.లక్షలు వెచ్చించి నాటి పెంచారు. కాగా, ఆకతాయిల చర్యలు.. విలువైన చెట్లను బూడిద చేస్తున్నాయి. అడవులకు సమీపంలో రైతులు సాగు చేస్తున్న జీడి, మామిడి, చెరకు, తెట్టంగి వంటి అరుతడి పంటలకు మంటలు వ్యాపిస్తున్నాయి. చెట్లు ఆకురాల్చిన కాలంలోనే ఎక్కువగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. పశువులు పెంపకందారులు, వ్యవసాయ పనులు, అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం అడవులకు వెళ్లేవారు కొంతమంది చుట్ట, సిగరెట్టు వంటివి కాల్చి.. వాటిని అర్పకుండా నిర్ల్యక్షంగా పడేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అవి ఎండిన ఆకులపై పడి మంటలు రాజుకుంటున్నాయి. కొంతమంది పోడు వ్యవసాయం కోసం పచ్చని చెట్లకు నిప్పుపెడుతున్నారు. మరి కొంతమంది తేనె సేకరణ కోసం చెట్లకు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించి అడవులకు ముప్పు వాటిల్లుతోంది. రోజురోజుకూ పచ్చదనం తగ్గుతోంది. అలాగే అడవుల్లో గ్రానైట్‌తోపాటు మైనింగ్‌కు లీజులు ఇవ్వడంతో అటవీ విస్తీర్ణం తగ్గిపోతోంది. ఫలితంగా ప్రకృతి విపత్తులు దాడి చేస్తున్నాయి. గతంలో కురిసిన వర్షాలకు మెళియాపుట్టి మండలంలో ఎగుబందపల్లి, గూడ, కేరాశింగి, అడ్డివాడ, చందనగిరి ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి రహదారులపైకి వచ్చేశాయి. అటువంటి సమయాల్లో ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • జనావాసాల్లోకి జంతువులు

  • గడ్డితోపాటు చిట్టడవులు తగలబడటంతో జంతువులు గ్రామాల్లోకి వస్తున్నాయి. ఎండవేడిమికి, అగ్నిజ్వాలలకు అటవీప్రాంతంలో నీరు దొరక్క అడవిపందులు, జింకలు, పక్షులు.. తదితర జంతువులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. జీడి, మామిడి, వరి, వేరుశనగ, మినుము వంటి పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణులు బలైపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాద కారణాలు గుర్తించి వనాలకు, పంటలకు, వన్యప్రాణులకు ముప్పు వాటిల్లకుండా అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • నష్ట పరిహారమివ్వాలి

  • అటవీశాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించాలి. ప్రత్యేక నిఘా వేసి కఠినచర్యలు తీసుకోవాలి. అటవీ ప్రాంతంలో నిప్పుపెడితే అడవులతోపాటు పంటలు కాలిపోతున్నాయి. కాలిపోయిన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించి రైతులను ఆదుకోవాలి.

    - డి.చంద్రశేఖరరావు, రైతు, జీఆర్‌పురం

  • చర్యలు తీసుకుంటున్నాం

  • అడవులకు నిప్పుపెట్టే దుశ్చర్యలను రైతులు అడ్డుకోవటంతోపాటు అటవీశాఖాధికారులకు సమాచారం ఇవ్వాలి. ఆకతాయి చర్యలను గుర్తించడానికి ప్రత్యేక నిఘా వేసి.. వారిపై కఠినచర్యలు తీసుకుంటాం. అగ్ని ప్రమాదాల నివారణపై గ్రామాల్లో సదస్సులు, ర్యాలీలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.

    - మురళీకృష్ణంనాయుడు, ఎఫ్‌ఆర్‌వో, కాశీబుగ్గ


forest.gif

Updated Date - Apr 03 , 2025 | 11:45 PM