Health Department : నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషలపై శిక్షణ
ABN , Publish Date - Feb 27 , 2025 | 04:11 AM
నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషలపై శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ సిద్ధమైంది. తద్వారా వారు విదేశాల్లో సైతం ఉద్యోగ అవకాశాలు పొందేందుకు మార్గం...

ప్రతిపాదనలు పంపాలని డీఎంఈకి మంత్రి ఆదేశం
అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషలపై శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ సిద్ధమైంది. తద్వారా వారు విదేశాల్లో సైతం ఉద్యోగ అవకాశాలు పొందేందుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో విదేశీ భాషలపై శిక్షణకు సంబంధించి సమగ్ర ప్రతిపాదనలు పంపాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)ను ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. తొలుత 13 ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో ఇలాంటి కోర్సులను ప్రవేశ పెట్టాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి నర్సింగ్ విద్యార్థుల భాష, కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థతో కలిసి ఈ శిక్షణ ఇవ్వాలని ఆరోగ్యశాఖ ఆలోచిస్తోంది. ఈ విషయంపై మంత్రి సత్యకుమార్ సంబంధిత సీనియర్ అధికారులతో ఇటీవల చర్చించారు. సమగ్ర ప్రతిపాదనలు సమర్పించాలని డీఎంఈని ఆదేశించారు. కాగా, దీనిపై డీఎంఈ ఇప్పటికే 7 వేల మందికి పైగా నర్సింగ్ విద్యార్థుల అభిప్రాయాలు, భాషా ప్రాధాన్యతల గురించి అభిప్రాయాలు తీసుకుంది. ఎక్కువ మంది నర్సింగ్ విద్యార్థులు జర్మన్, జపనీస్, ఇంగ్లిష్, ఫ్రెంచ్ వంటి భాషలను నేర్చుకునేందుకు ఉత్సాహంగా ఉన్నట్టు తెలిసింది.