Kakinada: కన్నతండ్రే ప్రొఫెషనల్ కిల్లర్‌లా..!
ABN , Publish Date - Mar 16 , 2025 | 03:44 AM
కాకినాడ జీజీహెచ్‌లో ఇద్దరు చిన్నారులతోపాటు, తండ్రి చంద్రకిశోర్ మృతదేహాలకు వైద్యులు శనివారం పోస్ట్‌మార్టం చేశారు. ఈ సందర్భంగా మార్చురీ వద్ద కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి.

పిల్లలకు భవిష్యత్తు లేదనే చంపేశాడా?!
అధిక ఫీజులతో మొదలైన ఆత్మనూన్యతా భావమా?!
చంపేసిన తీరుపై ఎన్నెన్నో సందేహాలు
కాకినాడ జీజీహెచ్‌లో ఇద్దరు పిల్లలు, తండ్రి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
సర్పవరం జంక్షన్, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ముక్కుపచ్చలారని ఇద్దరు బిడ్డలనూ కన్నతండ్రే.. ఒక ప్రొఫెషనల్ కిల్లర్‌లా.. అతి పాశవికంగా చంపేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఇప్పుడు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడ జీజీహెచ్‌లో ఇద్దరు చిన్నారులతోపాటు, తండ్రి చంద్రకిశోర్ మృతదేహాలకు వైద్యులు శనివారం పోస్ట్‌మార్టం చేశారు. ఈ సందర్భంగా మార్చురీ వద్ద కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి.
విద్యావంతుడు.. ఆపై కేంద్ర ఉద్యోగి..
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్ (37) ఎంకామ్, ఎంబీఏ చేశారు. వాకలపూడిలోని ఓఎన్‌జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్‌గా ఉద్యోగం చేస్తూ.. కాకినాడ తోట సుబ్బారావునగర్ రోడ్డులోని ఓ అపార్టుమెంట్‌లో ఉంటున్నారు. ఆయనకు భార్య తనూజా, జోషిల్(6), నిఖిల్(5) ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడ్ని కాకినాడలోని ప్రముఖ స్కూల్‌లో ఎల్‌కేజీలో చేర్పించగా యూకేజీ వరకు అందులోనే ఉంచారు. ఫీజు లక్షల్లో ఉండడంతో గతేడాది ఏడాదికి రూ.50 వేల ఫీజు(ఒక్కొక్కరికి) ఉండే స్కూల్లోకి ఇద్దరినీ మార్పించారు. అయితే, పెద్దస్కూల్ నుంచి చిన్నస్కూల్‌లోకి మార్చేశాను.. భవిష్యత్తులో లక్షలు కట్టి పిల్లల్ని చదివించగలనా? స్థాయి తగ్గించేశానా? అనే ఆత్మనూన్యతా భావన చంద్రకిశోర్‌కు మొదలైందని.. ఆయన బంధువులు, ఆయన రాసిన సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది.
మరణాలపై వీడని సందేహాలెన్నో!
చంద్రకిశోర్ పిల్లలిద్దరి కాళ్లకూ తాళ్లు కట్టి, చేతులను వెనక్కి విరిచి కట్టి, నీరు నింపిన బకెట్లలో తలలు ముంచి.. ఊపిరాడకుండా చేసి చంపి.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న వైనాన్ని చూస్తే ఎవరికైనా గుండె తరుక్కోకపోదు. ఫీజులు కట్టలేకపోవడం, సరిగా చదవకపోవడం, స్థాయి తగ్గించడం వంటి చిన్న కారణానికే ముక్కుపచ్చలారని పిల్లల్ని పొట్టన పెట్టుకునే కర్కశ మనస్తత్వం తండ్రికి లేదని బంధువులు పేర్కొంటున్నారు. ఏ చిన్న విషయాన్నైనా భార్యతో పంచుకునే వ్యక్తి.. ఇలా ఎలా చేశాడో అర్థం కావడంలేదని కన్నీరమున్నీరవుతున్నారు. మరోవైపు ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలకు భవిష్యత్తు లేదని, అందుకే వారిని చంపి తానూ మరణిస్తున్నానని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నప్పటికీ.. అపార్టుమెంట్లో ఇద్దరు పిల్లల్ని, ఒకేసారి.. ఒక్క వ్యక్తి ఎలా కాళ్లూచేతులకూ తాళ్లు కట్టగలిగాడు?, కళ్లకు గంతలు కట్టి వారిని ఎలా బాత్‌రూమ్ వరకు తీసుకెళ్లి చంపగలిగాడు? పిల్లల్ని బకెట్లలోని నీట్లో ముంచేసే సమయంలో పెద్దగా ఏడుస్తూ అరిచి ఉంటారని, అయినా అంత కర్కశంగా ఎలా చేయగలిగాడనే దానిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆత్మన్యూనత తగదు..
క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ కాదు. ఇతరుల పిల్లలు బాగా చదువుతున్నారు.. మా పిల్లలు చదవడం లేదు.. ఏదో మిస్ అయిపోతున్నామనే ఆత్మన్యూనతా భావానికి లోనై విచక్షణ కోల్పోతున్నారు. దీన్నే ఫోమో (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే భావన) అంటారు. దీంతో క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని విలువైన జీవితం తీసుకోవడమే కాదు, ఇతరుల జీవితాలను పణంగా పెడుతున్నారు. ఇదొక మానసిక రుగ్మత, జ్వరం వస్తే డాక్టర్ల వద్దకు ఎలా వెళ్తామో.. ఇలాంటి వారిని సైకాలజి్‌స్టల వద్దకు తీసుకెళ్తే ఫలితముంటుంది.
-ఏపీజే విను, ప్రముఖ సైకాలజిస్ట్, కాకినాడ