నాగంగారూ.. ఎలా ఉన్నారు?
ABN , Publish Date - Mar 14 , 2025 | 04:51 AM
తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన తెలంగాణ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి... సీఎం చంద్రబాబును కలిశారు.

జనార్దన్ రెడ్డికి బాబు ఆప్యాయ పలకరింపు
సీఎంతో తెలంగాణ సీనియర్ నేత భేటీ
‘ఓబుళాపురం’ కేసులో బెజవాడ కోర్టుకు నాగం
అమరావతి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన తెలంగాణ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి... సీఎం చంద్రబాబును కలిశారు. ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు ఉండటంతో గురువారం విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు నాగం వచ్చారు. అనంతరం అసెంబ్లీకి చేరుకుని చంద్రబాబుతో భేటీ అయ్యారు. చాలాకాలం తర్వాత తనను కలిసిన నాగంను చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. తన సీట్లో నుంచి లేచి ఆయన్ను ఆహ్వానించారు. ‘నాగం గారూ ఎలా ఉన్నారు.. ఆరోగ్యం ఎలా ఉంది’ అంటూ ఆప్యాయంగా పరామర్శించారు. తాము కలసి చాలా రోజులైందని గుర్తు చేస్తూ, పిల్లలు ఎలా ఉన్నారంటూ ఆరా తీశారు. నాగం కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్నారు.
ఓబులాపురం మైనింగ్ విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ చేసిన ఉద్యమాలపై నాడు కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల విచారణలో భాగంగా విజయవాడ వచ్చానని నాగం తెలిపారు. ఈ కేసులను సుదీర్ఘకాలం తర్వాత కొట్టివేయడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 20 నిమిషాల పాటు భేటీ అయిన ఇద్దరు నేతలు పాత ఘటనలను గుర్తు చేసుకున్నారు. నాగం ఫైర్ బ్రాండ్‌గా ఉండేవారని, పార్టీ ఆదేశిస్తే దూసుకుపోయేవారని సీఎం గుర్తు చేసుకున్నారు. 4వ సారి బాబును సీఎం గా చూడటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని నాగం అన్నారు.