Share News

ఘాట్‌ మలుపుల వద్ద రక్షణేది?

ABN , Publish Date - Mar 14 , 2025 | 10:35 PM

పాడేరు ఘాట్‌లో మలుపుల వద్ద రక్షణ లేకుండా పోయింది. ఈ మార్గంలో రక్షణ గోడలు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో ఘాట్‌లో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదం జరుగుతునే ఉంది.

ఘాట్‌ మలుపుల వద్ద రక్షణేది?
వంట్లమామిడిపైన మలుపు వద్ద శిథిలమైన రక్షణ గోడ

పాడేరు ఘాట్‌లో శిథిలమైన గోడలు

ఏళ్ల తరబడి మరమ్మతులు శూన్యం!

కార్యాచరణకు నోచుకోని రూ.8.5 కోట్ల ప్రతిపాదన

కనీస మరమ్మతులు చేయని గత వైసీపీ సర్కార్‌

వాహనం అదుపు తప్పితే లోయలోకే..

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

పాడేరు ఘాట్‌లో మలుపుల వద్ద రక్షణ లేకుండా పోయింది. ఈ మార్గంలో రక్షణ గోడలు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో ఘాట్‌లో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదం జరుగుతునే ఉంది. గిరిజన ప్రాంతంలో రాకపోకలకు ప్రధానమైన ఘాట్‌ రోడ్డును మరింతగా అభివృద్ధి చేయాల్సి ఉండగా పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.

పాడేరు ఘాట్‌ మార్గంలోని రక్షణ గోడలు చాలా కాలంగా కనీసం మరమ్మతులకు నోచుకోక శిథిల స్థితి చేరుకున్నాయి. 2023 ఆగస్టు 20న ఘాట్‌లోని ఆర్‌టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా 31 మంది గాయపడిన ఘటన నేపథ్యంలో అప్పటి కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ రక్షణ గోడలు మరమ్మతులు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. దీంతో ఘాట్‌లోని అన్ని మలుపు వద్ద ఉన్న రక్షణ గోడలకు మరమ్మతులు జరుగుతాయని భావించినప్పటికీ, అందుకు భిన్నంగా రెండు, మూడు మలుపుల్లో మాత్రమే రక్షణ మరమ్మతులు చేసి మిన్నకున్నారు. ఆ పనులు సైతం నాణ్యత లేకపోవడంతో ప్రస్తుతం అవన్నీ శిథిలమైపోయాయి. ఇదిలా ఉండగా ఇన్నాళ్లు డివిజన్‌ కేంద్రంగా ఉన్న పాడేరు జిల్లా కేంద్రం కావడంతో ఘాట్‌ మార్గంలో రాకపోకలు పెరిగాయి. ఈక్రమంలో స్థానిక ఘాట్‌ రక్షణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి అవసరం ఉంది. కాని గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. పాడేరు నుంచి చోడవరం, అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాలకు రాకపోకలు సాగించాలన్నా.. ఆయా ప్రాంతాల నుంచి పాడేరుతోపాటు ఒడిశా రాష్ట్రానికి వెళ్లాలన్నా.. ఘాట్‌ ప్రయాణం తప్పనిసరి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ఘాట్‌ రక్షణపై పాలకులు దృష్టిసారించకపోవడం ఘోరమని ప్రయాణికులు అంటున్నారు. ముఖ్యంగా ఘాట్‌లోని వ్యూపాయింట్‌కు సమీపంలో, రాజాపురం సమీపంలో, ఏసుప్రభు బొమ్మ మలుపులకు అటూ, ఇటూ, వంట్లమామిడి నుంచి గరికిబంద వరకు ఉన్న మలుపుల్లో రక్షణ గోడలు శిథిలమైపోయాయి. పొరపాటున వాహనాలు అదుపు తప్పితే లోయలోకి దూసుకుపోవాల్సిందే. గతంలో నిర్మించి రక్షణ గోడలు శిథిలం కాగా, చాలా ఏళ్లుగా కొత్త రక్షణ గోడలు నిర్మించకపోవడంతో ఘాట్‌ ప్రయాణం ప్రమాదకరంగా మారింది.

కార్యాచరణకు నోచుకోని రూ.8.5 కోట్ల ప్రతిపాదన

పాడేరు ఘాట్‌ మార్గంలో ప్రమాదకరంగా ఉన్న మలుపుల వద్ద ఐరన్‌ గడ్డర్లను ఏర్పాటు చేయాలని చాలా కాలంగా రోడ్ల, భవనాల శాఖాధికారులు ప్రతిపాదిస్తున్నప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. 2022లో అప్పటి ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ సైతం ఘాట్‌ మార్గంలో అవసరమైన చోట్ల మరమ్మతులు చేపట్టాలని రోడ్ల, భవనాల శాఖ ఉన్నతాధికారులను కోరారు. ఈ మేరకు ఆర్‌అండ్‌బీ అధికారులు రూ.8.5కోట్లతో ప్రతిపాదనలు చేశారు. ఆ నిధులు మంజూరైతే ఘాట్‌లోని ప్రమాదకర మలుపులను సరి చేయడంతోపాటు పటిష్టమైన ఐరన్‌ గడ్డర్లను ఏర్పాటు చేయాలని భావించారు. కాని ఆ ప్రతిపాదన నేటికీ కార్యాచరణకు నోచుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వమైన ఘాట్‌ మార్గంలోని రక్షణ గోడలకు మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు, డ్రైవర్లు, ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Mar 14 , 2025 | 10:35 PM