‘ఎత్తి’పోతున్నాయి!
ABN , Publish Date - Apr 05 , 2025 | 01:29 AM
రైతు సంక్షేమమే ధ్యేయంగా నాడు టీడీపీ హయాంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాలను వైసీపీ పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చేశారు. పచ్చగా కళకళలాడుతున్న పంట పొలాలకు చుక్కనీరు రాకుండా చేశారు. కనీస మరమ్మతులకు కూడా నిధులు విడుదల చేయకుండా పథకాలను పాడుపెట్టించారు. ఫలితంగా వేలాది ఎకరాల పంట పొలాలు బీడు భూములుగా మారాయి. కూటమి ప్రభుత్వం రాకతో రైతుల్లో ఆశలు చిగురించాయి. శనివారం సీఎం చంద్రబాబు నందిగామ నియోజకవర్గానికి రానుండటంతో నిధులు మంజూరు చేసి ఎత్తపోతల పథకాలకు పూర్వవైభవం తెస్తారని రైతులు ఆశగా చూస్తున్నారు.

-టీడీపీ ప్రభుత్వంలో 50కిపైగా ఎత్తిపోతల పథకాల నిర్మాణం
-వాటిలో వేదాద్రి- కంచల ఎత్తిపోతల పథకం ఓ అద్భుతం
- చంద్రబాబు హయాంలోనే ఈ పథకం నిర్మాణం
- బీడు భూములను సాగులోకి తెచ్చిన ఈ పథకాలకు వైసీపీ హయాంలో గ్రహణం
- మరమ్మతులు కూడా చేయకపోవడంతో ప్రశ్నార్థకంగా సాగు
- కూటమి ప్రభుత్వం రాకతో రైతుల్లో చిగురించిన ఆశలు
- నేడు నందిగామకు సీఎం చంద్రబాబు రాక
రైతు సంక్షేమమే ధ్యేయంగా నాడు టీడీపీ హయాంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాలను వైసీపీ పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చేశారు. పచ్చగా కళకళలాడుతున్న పంట పొలాలకు చుక్కనీరు రాకుండా చేశారు. కనీస మరమ్మతులకు కూడా నిధులు విడుదల చేయకుండా పథకాలను పాడుపెట్టించారు. ఫలితంగా వేలాది ఎకరాల పంట పొలాలు బీడు భూములుగా మారాయి. కూటమి ప్రభుత్వం రాకతో రైతుల్లో ఆశలు చిగురించాయి. శనివారం సీఎం చంద్రబాబు నందిగామ నియోజకవర్గానికి రానుండటంతో నిధులు మంజూరు చేసి ఎత్తపోతల పథకాలకు పూర్వవైభవం తెస్తారని రైతులు ఆశగా చూస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, నందిగామ):
మెట్ట ప్రాంతమైన ఎన్టీఆర్ జిల్లా ఎన్‌ఎస్‌పీ జోన్-2 పరిధిలో ఉంది. ఆయకట్టుకు మూడు దశాబ్దాలుగా సాగర్ జలాలు రావడం లేదు. దీంతో వ్యవసాయంపై రైతులు ఆశలు వదులు కుంటున్న సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కృష్ణా, మునేరు నదులపై ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి వరకూ 70వ దశకంలో డాక్టర్ కేఎల్‌రావు హయాంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో ఒక్క నందిగామ నియోజకవర్గంలోనే 50కిపైగా పథకాల నిర్మాణం జరిగింది. కాంగ్రెస్ హయాంలో కొన్ని పథకాలు నిర్మించగా, వైసీపీ పాలనలో ఒక్క పథకం కూడా నిర్మించలేదు. టీడీపీ ప్రభుత్వంలోనే అప్పటి నందిగామ ఎమ్మెల్యేలు దేవినేని వెంకటరమణ, దేవినేని ఉమామహేశ్వరరావు, తంగిరాల ప్రభాకరరావు పెద్దయెత్తున నిధులు తీసుకువచ్చి కృష్ణా, మునేటి నదులపై ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. ఫలితంగా మెట్ట ప్రాంతంలో రైతులు బంగారు పంటలు పండించారు. గత టీడీపీ ప్రభుత్వంలోనూ జలవనరులశాఖ ద్వారా ఈ పథకాలన్నింటినీ కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. ఆ ఐదేళ్ల కాలంలో ఎన్టీఆర్ జిల్లాలోని పలు పథకాల మరమ్మతులకు రూ.80 కోట్ల నిధులు ఇచ్చి ఆదుకున్నారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో ఎత్తిపోతల పథకాలకు గ్రహణం పట్టింది. కనీస మరమ్మతులకు కూడా నిధులు ఇవ్వకపోగా, పథకాల సొమ్మును నొక్కేసి శిథిలావస్థకు చేర్చారు.
పాడుబడ్డ వేదాద్రి- కంచల ఎత్తిపోతల పథకం
మూడు దశాబ్దాల క్రితం ఊహకు కూడా అందని విధంగా వేదాద్రి వద్ద టీడీపీ హయాంలో ఎత్తిపోతల పథకం నిర్మించారు. కృష్ణానది నుంచి 130 మీటర్ల ఎత్తుకు నీటిని తోడి అక్కడి నుంచి గ్రావిటీపై 4300 మీటర్లు పైపుల ద్వారా కొండలు, గుట్టలు దాటుకుంటూ కృష్ణా జలాలు పంట పొలాలకు పారించారు. ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా అందరూ కొనియాడారు. రెండు విడతలుగా జరిగిన ఈ పథకం నిర్మాణం ద్వారా 17 వేల ఎకరాలు స్థిరీకరించబడింది. 2300 అశ్వసామర్థ్యం గల మోటార్ల ద్వారా సుమారు 350 క్యూసెక్కు నీటిని నిరంతరం అందించారు. అటువంటి మహోన్నతమైన ఈ పథకాన్ని వైసీపీ పాలకులు నాశనం చేశారని విమర్శలు ఉన్నాయి. మోటార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో 17 వేల ఎకరాలు బీడువారుతున్నాయి.
సీఎం చంద్రబాబు పర్యటనపై రైతుల ఆశలు
జిల్లా వ్యాప్తంగా వేదాద్రితో పాటు జిల్లాలో మొత్తం 74 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటి ఆయకట్టులో సుమారు 70 వేల ఎకరాల భూమి సాగవుతోంది. ఈ పథకాల్లో చాలా వరకూ మరమ్మతులకు గురై ఉన్నాయి. కొన్ని పథకాలను రైతులు అతికష్టం మీద నడుపుతుండగా, కొన్ని పథకాలు పూర్తిగా పాడయ్యాయి. ఇటీవల ఐడీసీ అధికారులు నిర్వహించిన సర్వేలో ఈ పథకాలన్నీ మరమ్మతులు చేయించాలంటే వంద కోట్ల వరకూ అవసరం ఉంటుందని అంచనా వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్నదాతల ఆశలు చిగురించాయి. నిధుల కోసం ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ఇప్పటికే పలు మార్లు సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తులు చేశారు. ఈ నేపథ్యంలో నందిగామ పర్యటనకు సీఎం చంద్రబాబు వస్తున్నారని తెలిసి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాలకు నిధులు ఇచ్చి ఆదుకుంటారని ఆశిస్తున్నారు.
సుబాబుల్ రైతులకు చేయూత అవసరం
నందిగామ నియోజకవర్గంలో యాభైశాతానికిపైగా రైతులు సుబాబుల్ సాగు చేస్తున్నారు. పేపర్ కంపెనీలు, దళారులు దశాబ్దాలుగా రైతులను దోచుకుంటున్నారు. ఇటీవల విస్తీర్ణం తగ్గడంతో కంపెనీలు ధర పెంచాయి. ఖర్చులు పోను ఏడు వేల రూపాయలు రైతులకు అందాయి. ఆశించిన ధర వస్తుండటంతో రైతులు తిరిగి సాగు ప్రారంభించారు. విస్తీర్ణం పెరగడంతో కంపెనీలు ధర తగ్గించాయి. కేవలం 4,500 మాత్రమే ఇస్తున్నాయి. దీంతో రైతులు నష్టపోతున్నారు. ధర స్థిరీకరణతో పాటు గత టీడీపీ హయాంలో ప్రకాశం జిల్లాలో నిర్మించ తలపెట్టిన ఏషియన్ పేపర్ మిల్లు నిర్మాణానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది.
పరిశ్రమల ఏర్పాటుతోనే యువతకు ఉపాధి
నియోజకవర్గంలో వనరులు ఉన్నప్పటికీ పెద్దగా పారిశ్రామికీకరణ జరగలేదు. రెండు, మూడు పరిశ్రమలు మాత్రమే ఏర్పడ్డాయి. యువతకు ఉపాధి కరువైంది. గత టీడీపీ ప్రభుత్వంలో నందిగామ మండలం పెద్దవరం వద్ద 1,080 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీకి అప్పగించి అభివృద్ధి పరిచారు. ఆ భూముల్లో పరిశ్రమల స్థాపనకు పెద్దయెత్తున దరఖాస్తులు అందుతున్న తరుణంలో ప్రభుత్వం మారింది. పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లిపోయారు. తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టి ఆ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించాల్సి అవసరం ఉంది. కరోనా సమయంలో నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల పరిధిలో బల్క్‌డ్రగ్ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం రెడ్‌కార్పెట్ వేసింది. ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా పరిశ్రమల ఏర్పాటుకు లైసెన్స్‌లు జారీ చేసింది. చాలా మంది లైసెన్స్‌లు కూడా పొందారు. వారందరినీ ఆహ్వానించి ఆ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాల్సి అవసరం ఉంది.