Share News

రెచ్చిపోయారు!

ABN , Publish Date - Apr 16 , 2025 | 01:14 AM

నియోజకవర్గంలోని నందివాడ, పెదపారుపూడి మండలాల్లో మట్టి మాఫియా మరింత రెచ్చిపోతోంది. గత శనివారం నుంచి సోమవారం వరకు వరుస సెలవు దినాలు రావడంతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా అక్రమ తవ్వకాలు జరిపింది. దూరాన్ని బట్టి ట్రాక్టర్‌ ట్రక్కు మట్టి రూ.1000 నుంచి 1200 వరకు వసూలు చేసింది. అనుమతుల్లేకుండా సాగుతున్న ఈ దందాను ఎవరైనా అడ్డుకుంటే బెదిరింపులకు దిగుతోంది. అధికార పార్టీ నాయకులు, వైసీపీ నాయకులు కుమ్మక్కై ఈ వ్యవహారం నడపటంపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన రెవెన్యూ, డ్రైనేజీ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రెచ్చిపోయారు!

- నందివాడ, పెదపారుపూడి మండలాల్లో మట్టి మాఫియా బరితెగింపు

- గత శనివారం నుంచి సోమవారం వరకు సెలవులు రావడంతో యథేచ్ఛగా తోలకాలు

- అనుమతుల్లేవ్‌.. అడిగితే బెదిరింపులు

- అక్రమార్కుల్లో అధికార పార్టీ, వైసీపీ నాయకులు

- పట్టించుకోని రెవెన్యూ, డ్రైనేజీ శాఖ అధికారులు

- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆయా మండలాల ప్రజలు

నియోజకవర్గంలోని నందివాడ, పెదపారుపూడి మండలాల్లో మట్టి మాఫియా మరింత రెచ్చిపోతోంది. గత శనివారం నుంచి సోమవారం వరకు వరుస సెలవు దినాలు రావడంతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా అక్రమ తవ్వకాలు జరిపింది. దూరాన్ని బట్టి ట్రాక్టర్‌ ట్రక్కు మట్టి రూ.1000 నుంచి 1200 వరకు వసూలు చేసింది. అనుమతుల్లేకుండా సాగుతున్న ఈ దందాను ఎవరైనా అడ్డుకుంటే బెదిరింపులకు దిగుతోంది. అధికార పార్టీ నాయకులు, వైసీపీ నాయకులు కుమ్మక్కై ఈ వ్యవహారం నడపటంపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన రెవెన్యూ, డ్రైనేజీ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆంధ్రజ్యోతి - గుడివాడ:

నందివాడ మండలం పెదలింగాల వద్ద ఆత్కూరు డ్రెయిన్‌ నుంచి మట్టిని యథేచ్ఛగా తరలించుకుపోయారు. గ్రామంలోని పలు ప్రైవేటు స్థలాలకు మెరక తోలుకున్నారు. టీడీపీ నాయకుడి కనుసన్నల్లో రామాపురంలోని చెరువు నుంచి మూడు రోజులుగా మట్టిని బయటకు తరలిస్తున్నారు. వెన్ననపూడి గ్రామ పంచాయతీ చెరువు నుంచి మట్టిదోపిడీ భారీస్థాయిలో సాగింది. చేదుర్తిపాడు పరిధిలో బుడమేరు నుంచి మట్టిని రాత్రి వేళ తరలించేస్తున్నారు. ఇంత జరుగుతుంటే అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు అందినా రెవెన్యూ శాఖ, డ్రైనేజీ శాఖ అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలు తావిస్తోంది.

ఆత్కూరు డ్రెయిన్‌ నుంచి వైసీపీ నాయకుడి కనుసన్నల్లో..

గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు మట్టిని దోచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వారి హవానే సాగుతుందని టీడీపీ మండల నాయకులు ఆరోపిస్తున్నారు. నందివాడ మండలం పెదలింగాల వద్ద ఆత్కూరు డ్రెయిన్‌ నుంచి ఇష్టారాజ్యంగా మట్టిని తవ్వేస్తున్నారు. వైసీపీ ముఖ్య నాయకుడు దగ్గరుండి మట్టిని అక్రమంగా తరలించుకు పోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పొలం గట్ల పటిష్ట్టత పేరుతో వైసీపీ నాయకుడి ఆధ్వర్యంలో ఈ తతంగమంతా జరుగుతోంది.

ట్రాక్టర్‌ మట్టి రూ.1000

ట్రాక్టర్‌ ట్రక్కు మట్టి రూ.1000 నుంచి రూ.1200 వరకు విక్రయిస్తున్నారు. మట్టిని తరలించే క్రమంలో దూరాన్ని బట్టి ధర పెంచుతున్నారు. అడ్డగోలుగా తవ్వుకుని అమ్ముకుంటుంటే అడ్డుకునే దమ్ము ఏ అధికారికీ లేదని అక్రమార్కులు సవాల్‌ విసురుతున్నారు.

పెదపారుపూడిలోనూ ఇదే తంతు!

పెదపారుపూడి మండలం వానపాముల-వెంట్రప్రగడ పొలిమేరలోని ప్రభుత్వ పోరంబోకు పంట బోదె గట్లను రాత్రి వేళ అక్రమంగా తవ్వేస్తున్నారు. పంట బోదెలను అక్రమంగా తవ్వేయడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వింజరంపాడులో విద్యుత టవర్ల నిర్మాణం కోసం తీసిన మట్టిని కొందరు అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. మోపర్రు వద్ద బుడమేరులో నుంచి యథేచ్ఛగా మట్టిని తరలించేస్తున్నారు.

వరుస సెలవుల నేపథ్యంలో కుమ్మేశారు..

రెండో శనివారం, ఆదివారం, అంబేడ్కర్‌ జయంతి(సోమవారం)తో వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అక్రమార్కులకు తిరుగే లేకుండా పోయింది. పగలు, రాత్రి తేడా లేకుండా మట్టి దోపిడీ చేసి సొమ్ము చేసుకున్నారు.

మట్టి తోలకాలకు అనుమతులు లేవు : తహసీల్దార్‌

నందివాడ మండలంలోని ఏ గ్రామంలోనూ మట్టి తోలకాలకు అనుమతులు లేవని, తహసీల్దార్‌ కార్యాలయం నుంచి అనుమతులున్నట్లు ఎవరైన చెబితే రికార్డు చూపించమని అడగాలని నందివాడ తహసీల్దార్‌ గురుమూర్తి రెడ్డి వాట్సప్‌లో సందేశం పెట్టారు. ఇరిగేషన్‌, డ్రైనేజీ భూముల్లో కూడా మట్టి తవ్వకాలు జరుగకుండా ముందస్తుగానే వారికి తెలిపినట్లు పేర్కొన్నారు.

క్షేత్రస్థాయిలో పరిశీలన ఏది?

మండలంలో మట్టి తవ్వకాలు, తోలకాలకు అనుమతులు లేవని నందివాడ తహసీల్దార్‌ వాట్సప్‌ సందేశాలను పంపడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయా గ్రామస్తులు ఫొటోలతో సహ తహసీల్దార్‌కు సందేశాలు పంపితే, కనీసం క్షేత్రస్థాయిలో ఆర్‌.ఐ, వీఆర్‌వోలతో కలిసి దాడులు చేసి ప్రొక్లెయిన్‌, ట్రాక్టర్లు, టిప్పర్‌లను సీజ్‌ చేయాల్సి ఉంది. కానీ దానికి భిన్నంగా కార్యాలయంలో కూర్చొని సందేశాలు పంపడంపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 16 , 2025 | 01:14 AM