Tirupati Court: ఏఆర్ డెయిరీ ఎండీకి చుక్కెదురు
ABN , Publish Date - Feb 25 , 2025 | 06:24 AM
కల్తీ నెయ్యి కేసులో రెండో ప్రధాన నిందితుడు, ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్‌కు కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరుపతి 2వ ఏడీఎం కోర్టు సోమవారం డిస్మిస్ చేసింది.

కల్తీ నెయ్యి కేసులో బెయిల్ పిటిషన్ డిస్మిస్
తీర్పు వెలువరించిన తిరుపతి కోర్టు
తిరుపతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): కల్తీ నెయ్యి కేసులో రెండో ప్రధాన నిందితుడు, ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్‌కు కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరుపతి 2వ ఏడీఎం కోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. మిగిలిన ముగ్గురు నిందితులకు సంబంధించిన బెయిల్ పిటిషన్‌తో పాటు ఇద్దరు నిందితులను కస్టడీకి తీసుకునే విషయమై సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం వాదనలు జరగనున్నాయి. కల్తీ నెయ్యి కేసులో ఈనెల 9న సిట్ బృందం అరెస్టు చేసిన నలుగురు నిందితులకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆ మరుసటి రోజు తిరుపతి కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఏ2, ఏఆర్ డెయిరీ ఎండీ సంబంధించిన పిటిషన్‌పై గురువారం కోర్టులో వాదనలు జరిగాయి. రాజశేఖరన్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారని కాబట్టి బెయిల్ మంజూరు చేయాలంటూ అతడి తరఫు న్యాయవాది వాణి కోర్టును కోరారు. కల్తీ నెయ్యి కేసులో రాజశేఖరన్ కీలక నిందితుడని, ఆయనకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలేవీ లేవని సిట్ తరఫున ఏపీపీ జయశేఖర్ వాదించారు. వైద్యులు ఇచ్చిన నివేదికలను కూడా కోర్టు దృష్టికి తెచ్చారు. కీలక నిందితుడైనందున అతన్ని బెయిల్‌పై విడుదల చేస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశముందన్నారు. వాదనలు ముగిశాక తీర్పును కోర్టు రిజర్వు చేసింది. రాజశేఖరన్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ సోమవారం తీర్పును వెల్లడించింది. కాగా ఈ కేసులో మిగిలిన నిందితులైన పొమిల్ జైన్, విపిన్ జైన్, అపూర్వ వినయ్‌కాంత్ చావడాల తరఫున న్యాయవాది అర్చన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగనుంది. అలాగే ఇదివరకూ నిందితులు నలుగురినీ ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించిన సందర్భంలో పొమిల్ జైన్, అపూర్వ వినయ్‌కాంత్ చావడాలు విచారణకు సహకరించలేదని, ఆ కారణంగా వారిని తిరిగి కస్టడీకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా వాదనలు జరగనున్నాయి.