ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TTD: ఆగని రచ్చ!

ABN, Publish Date - Jan 11 , 2025 | 04:39 AM

తొక్కిసలాట ఘటనపై టీటీడీలో రచ్చ కొనసాగుతూనే ఉంది. గురువారం ముఖ్యమంత్రి ముందే ఈవో శ్యామలరావు,

టీటీడీలో రగులుతున్న ‘తొక్కిసలాట’

వాడీవేడిగా పాలకమండలి భేటీ

అధికారులపై ధ్వజమెత్తిన సభ్యులు

‘అంతా మీవల్లే’ అంటూ మండిపాటు

గళమెత్తిన చైర్మన్‌, ఇతర సభ్యులు

ఈవో వ్యవహార శైలిపై అభ్యంతరాలు

సమన్వయం లేనందునే విషాదమని వెల్లడి

ఒక బృందంగా పనిచేయాల్సిన చోట ఎవరి తీరున వారు పనిచేస్తున్నారు. దీనివల్లే తిరుపతిలో దుర్ఘటన జరిగింది. మీ (అధికారుల) వల్ల మేం అందరం మాటపడాల్సి వచ్చింది.

- చైర్మన్‌ బీఆర్‌ నాయుడు

టోకెన్లు జారీ చేసే కేంద్రాల వద్ద పాలక మండలి సభ్యులకు డ్యూటీ వేసినా ఆనందంగా చేసేవాళ్లం. నలుగురు బాధ్యత తీసుకొని పనిచేస్తే ఇప్పుడు తల దించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు.

- బోర్డు సభ్యుల్లో ఒకరు

‘సామాన్య భక్తులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. సీఎం చంద్రబాబు స్వయంగా వచ్చి తప్పు జరిగిందని క్షమాపణలు కోరాల్సి వచ్చింది. ఇంత పెద్ద వ్యవస్థను పెట్టుకొని.. ఎన్నో కార్యక్రమాలు చేసిన అనుభవం ఉంచుకొని కూడా చివరికి మాటపడాల్సి వచ్చింది. తప్పులు దాచుకోవాలని ప్రయత్నించొద్దు. అహం ప్రదర్శించడమే దీనికి కారణం. ఇకనైనా అందరం కలిసి పనిచేద్దాం!

- బోర్డులో సభ్యుడైన ఒక సీనియర్‌ నేత

అమరావతి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): తొక్కిసలాట ఘటనపై టీటీడీలో రచ్చ కొనసాగుతూనే ఉంది. గురువారం ముఖ్యమంత్రి ముందే ఈవో శ్యామలరావు, చైర్మన్‌ బీఆర్‌ నాయుడు మధ్య వాగ్యుద్ధం జరగగా... శుక్రవారం, వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశం కూడా రచ్చ రచ్చగా మారింది. తిరుమల ఆలయ పాలనా వ్యవహారాల్లో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పాలక మండలి సభ్యులు నిప్పులు చెరిగారు. అధికారుల ఏకపక్ష తీరు వల్లే టీటీడీ చరిత్రలోనే మొదటిసారిగా సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగిందని విమర్శించారు. అధికారుల తీరుతో తాము తల దించుకోవాల్సి వచ్చిందని పలువురు సభ్యులు ధ్వజమెత్తారు. ప్రధానంగా ఈవో శ్యామలరావు వ్యవహార శైలిని పాలక మండలి సభ్యులు తప్పుబట్టినట్లు సమాచారం! తొక్కిసలాట బాధిత కుటుంబాలకు చేయాల్సిన సహాయంపై తీర్మానాలు చేసేందుకు వీలుగా తక్షణం బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీంతో... శుక్రవారం టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన శుక్రవారం తిరుమలలో పాలక మండలి భేటీ అయ్యింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముగ్గురు సభ్యులు మినహా మిగిలిన సభ్యులు... ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. సీఎం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ భేటీ కూడా ‘అధికారులు వర్సెస్‌ పాలకమండలి’గా మారింది. సమావేశ ప్రారంభంలోనే చైౖర్మన్‌ నాయుడు టీటీడీ అధికారుల తీరుపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అధికారులు తమ ఇష్టానుసారం పనిచేస్తున్నారు.

పాలక మండలి చైర్మన్‌కుగానీ, సభ్యులకుగానీ ఏ సమాచారం ఇవ్వడం లేదు. కలుపుకొని పోవడం లేదు. తిరుపతిలో కేవలం రెండు మూడు వేల మందిని ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టి టోకెన్లు ఇవ్వలేకపోయాం. ఇంతకంటే ఎక్కువమంది జనం హాజరైన కార్యక్రమాలను నిర్వహించిన అనుభవం ఉన్నవాళ్లమే. కానీ, ఆ అనుభవాన్ని ఉపయోగించుకోలేదు. ఇప్పటికైనా అధికారులు మారాలి’’ అని బీఆర్‌ నాయుడు అన్నారు. ఆ తర్వాత వరుసగా పాలక మండలి సభ్యులు భాను ప్రకాశ్‌ రెడ్డి, పనబాక లక్ష్మి, జ్యోతుల నెహ్రూ, ఎంఎస్‌ రాజు, ఆనంద సాయి, మహేందర్‌ రెడ్డి తదితరులు కూడా ఈవో వ్యవహార శైలిపై ధ్వజమెత్తారు. ‘జరిగిన సంఘటనలో మన పొరపాట్లు ఉన్నాయి. ఆత్మ విమర్శ చేసుకోకపోతే ఇవి ఇంకా కొనసాగుతాయి. ఎక్కడ పొరపాటు జరిగిందో చర్చించి... ఎవరి వల్ల అవి జరిగాయో నిర్దిష్టంగా తేల్చితే అవి ఆగుతాయి’ అని భాను ప్రకాశ్‌ రెడ్డి అన్నారు. అయితే... అవన్నీ ఇప్పుడు వద్దని, తర్వాత మాట్లాడుకొందామని ఈవో అన్నారు. ‘ఫర్వాలేదు. మాట్లాడనివ్వండి’ అని చైర్మన్‌ చెప్పారు. ‘ఎందుకు మాట్లాడ కూడదు?’ అని భాను ప్రకాశ్‌ కూడా స్వరం రెట్టించారు. జరిగిన విషాదంపై కనీసం ఇంట్లో భార్యాబిడ్డలకు కూడా సమాధానం చెప్పుకోలేకపోతున్నామన్నారు. ‘తమాషాలు చేస్తున్నారు’ అని అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించినప్పుడు ఈవో దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అటువంటి మాటలు మాట్లాడవద్దని గట్టిగా చెప్పారు. తొక్కిసలాటలో చనిపోయిన ఒక మహిళకు ఉన్న ఇద్దరు పిల్లల చదువు బాధ్యతను టీటీడీ తీసుకుంటుందని ప్రకటిద్దామని భాను ప్రకాశ్‌ రెడ్డి ప్రతిపాదించినప్పుడు... ఈ ప్రకటనలు ఇప్పుడు వద్దని, అన్నీ చూసి తర్వాత చెబుదామని ఈవో అన్నారు. దీనిపైనా కొంత వాదోపవాదాలు జరిగాయి.


ఎంఎస్‌ రాజు ధ్వజం..

అధికారులు తీసుకునే తప్పుడు నిర్ణయాలకు తాము రాజకీయంగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని బోర్డు సభ్యుడు, టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. అధికారులు ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకుంటారని... ప్రజా క్షేత్రంలో తాము సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలని సూచించారు. ‘‘పాలక మండలి సభ్యులకు అధికారులు కనీస గౌరవం ఇవ్వడం లేదు. మమ్మల్ని తిరుమలలో గదులు అమ్ముకొనే వారిని చూసినట్లు చూస్తున్నారు. మా ఫోన్లు తీయరు. ఏం జరుగుతోందో... ఏ నిర్ణయాలు తీసుకున్నారో మాకు చెప్పరు. పాలక మండలి ఎందుకు ఉందో మాకు అర్థం కావడం లేదు’’ అని ఆయన ధ్వజమెత్తారు. వైకుంఠ ఏకాదశికి భక్తులు భారీగా వస్తారని అందరికీ తెలిసిందేనని... ఈ విషయంలో అధికారుల ప్రణాళిక ఏమిటో, దీనిని ఏ రకంగా నిర్వహించదల్చుకున్నారో తమకు సమాచారం లేదని ఒక సభ్యుడు చెప్పారు. పాలక మండలిని కలుపుకొని పనిచేయడానికి అధికారులు కనీస శ్రద్ధ చూపించలేదని, అధికారం మొత్తం తమ గుప్పిట్లో ఉందని ప్రదర్శించుకొనే తత్వమే వారిలో కనిపిస్తోందని మరో సభ్యుడు ఆరోపించారు. అధికారులు పనిచేయడానికి పాలక మండలి అడ్డంగా ఉందని భావిస్తే ప్రభుత్వానికి చెప్పి తమను తొలగించినా తాము బాధపడబోమని, ఉన్నప్పుడు మాత్రం కలుపుకొని వెళ్లాలని మరో సభ్యుడు వ్యాఖ్యానించారు. పాలక మండలి సభ్యుల విమర్శలను ఈవో సహా అధికారులంతా మౌనంగా విన్నారు. అవసరం అయిన చోట మాత్రమే తమ అభిప్రాయం చెప్పారు. ప్రస్తుత పాలక మండలి ఏర్పాటైన తర్వాత అధికారుల వ్యవహార శైలిపై ఇంత స్థాయులో చర్చ జరగడం ఇదే మొదటిసారి అని అంటున్నారు.

Updated Date - Jan 11 , 2025 | 04:39 AM