Vivekananda Murder Twist: గుండెపోటు కథనంలో ఉదయ్ పాత్ర
ABN , Publish Date - Apr 16 , 2025 | 05:27 AM
వివేకానందరెడ్డి హత్యను గుండెపోటుగా చిత్రీకరించేందుకు ఉదయ్‌కుమార్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని సీబీఐ ఆరోపించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఉదయ్‌కు నోటీసులు జారీ చేసింది

వివేకా గాయాలు కనపడకుండా దాచిపెట్టడంలోనూ: సీబీఐ
ఉదయ్‌కుమార్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
బెయిల్ రద్దు పిటిషన్లపై 29న విచారణ?
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యను గుండెపోటుగా చిత్రీకరించిన వ్యవహారంలో నిందితుడు గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి(ఏ-7) పాత్ర కూడా ఉందని సీబీఐ పేర్కొంది. ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 27న దర్యాప్తు సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వివేకా కుమార్తె సునీతారెడ్డి మార్చి 7న మరో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. వివేకా హత్య కేసులో ఉదయ్‌కుమార్‌రెడ్డి పాత్ర ఏమిటని సీజేఐ ప్రశ్నించారు. సీబీఐ తరఫున స్పెషల్ కౌన్సెల్ జోహెబ్ హుస్సేన్ బదులిస్తూ.. ‘హత్యను గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. ఆ గాయాలు కనపడకుండా కట్లు కట్టి సాధారణ మరణంగా నమ్మించే ప్రయత్నం చేశారు. ఇందులో ఉదయ్‌కుమార్‌రెడ్డి పాత్ర కూడా ఉంది’ అని నివేదించారు. ఈ క్రమంలో ఉదయ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. వివేకా హత్య కేసులో మరికొందరు నిందితుల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లతో కలిపి సీబీఐ వ్యాజ్యాన్ని విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. సునీత తరఫున న్యాయవాది జైసల్ వాహి వాదనలు వినిపించేందుకు సిద్ధం కాగా.. సునీత పిటిషన్‌కూ తమ ఆదేశాలు వర్తిస్తాయని ధర్మాసనం పేర్కొంది. ఆయా పిటిషన్లు 29న సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశముంది.