పంచాయతీలకు ఊపిరి
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:56 AM
వైసీపీ ప్రభుత్వంలో ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొన్న గ్రామ పంచాయతీలు కూటమి పాలనలో తేరుకుంటున్నాయి.

15వ ఆర్ధిక సంఘం నిధులు విడుదల
ఖాతాల్లో జమచేసిన ప్రభుత్వం
సాధారణ నిధుల ఖర్చుపై ఫ్రీజింగ్ ఇబ్బందుల్లేవ్
విశాఖపట్నం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి):
వైసీపీ ప్రభుత్వంలో ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొన్న గ్రామ పంచాయతీలు కూటమి పాలనలో తేరుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సాధారణ నిధులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీల ఖాతాలకు జమకావడంతో సర్పంచులు ఊపిరిపీల్చుకుంటున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం విడుదలచేసే 15వ ఆర్థిక సంఘం నుంచి జిల్లాలోని 79 గ్రామ పంచాయతీలకు టైడ్ గ్రాంట్ రూ.2.26 కోట్లు, అన్‌టైడ్ గ్రాంట్ రూ. 1.51 కోట్లు వెరసి రూ.3.77 కోట్లు ఆయా పంచాయతీ ఖాతాల్లో జమయ్యాయి. సోమవారంతో ముగియనున్న ఆర్థిక సంవత్సరానికి మరో విడత కేంద్రం నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది.
వైసీపీ హయాంలో నరకం
వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021 మార్చిలో ఎన్నికలు జరిగిన తరువాత బాధ్యతలు స్వీకరించిన సర్పంచులకు సంబంధిత పంచాయతీ ఖాతాల నుంచి నిధులు డ్రాచేసే వెసులుబాటు తొలగించారు. అప్పట్లో 14వ ఆర్థిక సంఘం చివరి ఏడాది నిధులు, తరువాత మొదలైన 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదలచేసినా వాటిని పంచాయతీలకు నేరుగా ఇవ్వకుండా ప్రభుత్వం మళ్లించింది. పంచాయతీలు విద్యుత్ బిల్లులు బకాయిల కింద కేంద్రం ఇచ్చే నిధులు జమచేసిన రాష్ట్ర ప్రభుత్వం వాటికి ఏనాడూ లెక్కలు చెప్పలేదు. పంచాయతీల వారీగా విద్యుత్ బకాయిలు ఎంత? ఎంత చెల్లించారు? మిగిలిన బకాయి ఎంత అనేది గ్రామ సర్పంచులకు చెప్పకపోవడంతో టీడీపీ, వైసీపీ సర్పంచ్‌ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చివరకు సాధారణ నిధులు ఖర్చుపై ఆంక్షలు విఽధించింది. దీంతో గ్రామ పంచాయతీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని తాగునీరు, పారిశుధ్యం, ఇతర మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టలేదు. సుమారు మూడేళ్లపాటు పంచాయతీలకు రావాల్సిన నిధులు కోసం సర్పంచ్‌లు పోరాటంచేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధుల పంపిణీ కోసం పీఎంఎఫ్‌ఎస్ ఖాతాలకు కొత్తగా పంచాయతీల వారీగా ప్రారంభించాల్సి వచ్చింది. అదే సమయంలో సాధారణ నిధుల ఖర్చుపై వైసీపీ ఆంక్షలు కొనసాగించింది.
ముఖ్యమంత్రి జోక్యంతో...
ఇదిలావుండగా గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రత్యేకించి పంచాయతీల పాలనపై దృష్టిసారించారు. కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ట్రం విడుదల చేసే సాధారణ నిధులు నేరుగా పంచాయతీ ఖాతాలకు జమచేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనులకు 24 గంటల్లో బిల్లులు మంజూరవుతున్నాయి. సాధారణ నిధులతో చేపట్టే పనులకు రెండుమూడు రోజుల్లో బిల్లులు విడుదల కావడాన్ని సర్పంచులు స్వాగతిస్తున్నారు. మూడేళ్లకుపైగా అనేక ఇబ్బందులుపడ్డామని, ప్రస్తుతం గ్రామాల్లో పనులు చేపట్టడానికి అడ్డంకులు లేవని గంభీరం గ్రామ సర్పంచి వానపల్లి లక్ష్మి పేర్కొన్నారు. నిధుల విషయంలో గత ప్రభుత్వంపై అనేక పోరాటాలు చేశామన్నారు. అయితే టైడ్ గ్రాంట్, అన్‌టైడ్ గ్రాంట్ నిధుల ఖర్చుపై ఉన్న ఆంక్షలు సడలించాలని కోరారు. పారిశుధ్యం, తాగునీటితో సమానంగా పనులు చేపట్టేందుకు నిధులు ఖర్చుచేసేలా మార్పులు చేయాలన్నారు. లేకపోతే గ్రామాల్లో పనులు చేపట్టడానికి అవరోధం ఎదురవుతుందన్నారు. కాగా గ్రామ పంచాయతీ తీర్మానాల మేరకు చేపట్టే పనులకు బిల్లుల మంజూరు చేస్తున్నామని జిల్లా పంచాయతీ అఽధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సంరలో మరో విడత కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలకావాల్సి ఉందన్నారు.
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు
విశాఖపట్నం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రంజాన్ సందర్భంగా ఈనెల 31వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సెలవు దినం కావడంతో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండరని, ఫిర్యాదుదారులు ఈ విషయం గమనించాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కమిషనర్ కార్యాలయంలో కార్యక్రమం రద్దు చేశామని సీపీ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీలోనూ కార్యక్రమం నిర్వహించడం లేదని అదనపు కమిషనర్ రమణమూర్తి తెలిపారు.
రేపు సామాజిక పింఛన్లు పంపిణీ
విశాఖపట్నం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీని ఏప్రిల్ ఒకటోతేదీ మంగళవారం చేపట్టనున్నారు. ఇప్పటికే 1,59,903 మంది పింఛన్‌దారులకు రూ.69.79 కోట్లు విడుదలయ్యాయి. ఆది, సోమవారాలు సెలవు కావడంతో పింఛన్ సొమ్ము శనివారమే సచివాలయాల సిబ్బంది డ్రా చేశారు. నాలుగు గ్రామీణ మండలాల్లో 26,457 మందికి రూ.11.11 కోట్లు, నగరంలో 1,33,446 మందికి రూ.58.67 కోట్లు విడుదల చేశారు.
రిజిస్టే్ట్రషన్ల ఆదాయం రూ.82 లక్షలు
ఉగాది రోజున కార్యాలయాల్లో సందడి
విశాఖపట్నం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం జిల్లాలో తొమ్మిది స్టాంపు అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 47 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రూ.82లక్షల ఆదాయం సమకూరింది. సూపర్‌బజార్ ఆవరణలో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రూ.40లక్షల ఆదాయం వచ్చింది. ఉగాది రోజున భూములు, ఇళ్లు కొనుగోలు చేయాలన్న సెంటిమెంట్‌తో రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. ఆర్థిక సంవత్సరం చివరిరోజు సోమవారం రంజాన్ అయినప్పటికీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిర్వహిస్తారు.