సీలేరులో మొసలి కలకలం
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:04 PM
జీకేవీధి మండలం సీలేరులోని గుంటవాడ జలాశయం నుంచి ఆదివారం అర్ధరాత్రి 12 అడుగుల మొసలి రోడ్డుపైకి వచ్చి కలకలం సృష్టించింది.

గుంటవాడ జలాశయం నుంచి రోడ్డుపైకి వచ్చిన వైనం
సీలేరు, మార్చి 31(ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం సీలేరులోని గుంటవాడ జలాశయం నుంచి ఆదివారం అర్ధరాత్రి 12 అడుగుల మొసలి రోడ్డుపైకి వచ్చి కలకలం సృష్టించింది. సీలేరు జల విద్యుత్ కేంద్రానికి సరఫరా చేసేందుకు గుంటవాడ జలాశయంలో నీటిని నిల్వ చేస్తారు. మండు వేసవిలో కూడా నీటి నిల్వలు అధికంగానే ఉండాయి. ఈ జలాశయంలో మొసళ్లు అధికంగానే ఉంటాయి. అయితే నీటి నిల్వలు తగ్గినప్పుడు అడపాదడపా ఒడ్డుకు వచ్చి కలకలం రేపుతుంటాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఓ మొసలి జలాశయం నుంచి రోడ్డుపైకి వచ్చి సేదతీరింది. ఆ సమయంలో ఒడిశా నుంచి సీలేరు వైపు వెళుతున్న వ్యాన్‌లోని డ్రైవర్ దానిని గమనించి మెయిన్ డ్యాం వద్ద విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఏపీ జెన్‌కో ఏఈ సురేశ్ వెంటనే స్పందించి సిబ్బందితో అక్కడికి వచ్చారు. వాహనాల లైటింగ్‌ను మొసలిపై ఫోకస్ చేయడంతో అది నెమ్మదిగా జలాశయంలోకి వెళ్లిపోయింది. దీంతో జెన్‌కో సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.