త్వరలో విద్యుత్ కష్టాలకు చెక్
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:08 AM
ఎట్టకేలకు చోడవరంలో 33 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. నియోజకవర్గ కేంద్ర ప్రజలతో పాటు పరిసర పంచాయతీవాసులు ఎన్నో సంవత్సరాలుగా అనుభవిస్తున్న కరెంటు కష్టాలకు త్వరలో తెరపడనుంది.

- చోడవరంలో 33 కేవీ సబ్ స్టేషన్‌కు లైన్ క్లియర్
- లక్ష్మీపురంలో సమకూరిన స్థలం
- పనులకు శ్రీకారం చుట్టిన ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు
- సుదీర్ఘకాల సమస్యకు ఎట్టకేలకు లభించిన పరిష్కారం
చోడవరం, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు చోడవరంలో 33 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. నియోజకవర్గ కేంద్ర ప్రజలతో పాటు పరిసర పంచాయతీవాసులు ఎన్నో సంవత్సరాలుగా అనుభవిస్తున్న కరెంటు కష్టాలకు త్వరలో తెరపడనుంది.
పట్టణంతో పాటు పరిసర పంచాయతీలైన లక్ష్మీపురం, దామునాపల్లి, మైచర్లపాలెం, ఖండేపల్లి, అంకుపాలెం, శ్రీరాంపట్నం, గౌరీపట్నం, గాంధీగ్రామం, నరసయ్యపేట పంచాయతీలకు చోడవరం- చీడికాడ రోడ్డులోని 33 కేవీ సబ్‌స్టేషన్ ఒక్కటే ఆధారం. దీంతో ఈ పంచాయతీల్లో ఎక్కడ లైను ఆగినా, మొత్తం టౌన్‌తో పాటు పరిసర పంచాయతీలకు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో అయితే ఈ కరెంటు కష్టాలు మరింత దారుణంగా ఉండి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో లోవోల్టేజి సమస్యలు ఎదురుకావడానికి ఒక్క 33 కేవీ సబ్ స్టేషన్‌పై ఉన్న భారమే కారణమని చెప్పాలి. వాస్తవానికి చోడవరానికి విద్యుత్ సబ్ స్టేషన్ పదేళ్ల క్రితమే మంజూరైంది. అయితే నరసయ్యపేట వద్ద ఎంపిక చేసిన స్థలం వల్ల సబ్‌స్టేషన్ నిర్మాణం వాయిదాలు పడుతూ వచ్చింది. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు చొరవ వల్ల విద్యుత్ సబ్ స్టేషన్ స్థల సమస్య పరిష్కారమైంది. విద్యుత్ సబ్ స్టేషన్‌కు చోడవరం- లక్ష్మీపురం మార్గంలో స్థలాన్ని కేటాయించడంతో ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఏపీ ఈపీడీసీఎల్ ఏడీఈ కుమార గౌరీ వరప్రసాద్, లైన్ ఇన్‌స్పెక్టర్ రవి, తదితరులు దగ్గరుండి స్థలాన్ని చదును చేయించే పనులకు శ్రీకారం చుట్టారు. సబ్ స్టేషన్ నిర్మాణ పనులు చేపట్టే ఇంజనీరింగ్ అధికారులు కూడా స్థలాన్ని ఇప్పటికే పరిశీలించి వెళ్లారు. వేగంగా నిర్మాణ పనులు పూర్తయి మరో మూడు నెలల్లో ఈ కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్ చోడవరం వాసులకు అందుబాటులోకి రానుందని ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు తెలిపారు.