లక్ష్యాన్ని మించి ‘ఉపాధి’
ABN , Publish Date - Apr 08 , 2025 | 01:41 AM
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్ర స్థాయిలో అనకాపల్లి జిల్లా పలు విభాగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించింది.

120 లక్షల పని దినాలకుగాను 124.67 లక్షల పనిదినాలు..
రాష్ట్రస్థాయిలో ఆరో స్థానంలో జిల్లా
సగటు వేతనంలో నాలుగో స్థానం..
పనిదినాల కల్పనలో ఐదో స్థానం
పల్లె పండుగలో రూ.181.22 కోట్లతో 229.09 కి.మీ.ల రోడ్లు
745 గోకులం షెడ్లు, 308 స్కూళ్లకు ప్రహరీ గోడలు
ఈ ఏడాది 127 లక్షల పనిదినాలు లక్ష్యం
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్ర స్థాయిలో అనకాపల్లి జిల్లా పలు విభాగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో జిల్లాలో సాధించిన ప్రగతిపై చర్చకు వచ్చింది. కలెక్టర్ విజయకృష్ణన్ నేతృత్వంలో ఉపాధి కల్పనలో జరిగిన అభివృద్ధిని ఈ సందర్భంగా చర్చించి జిల్లా అధికారులను అభినందించారు. జిల్లాకు 120 లక్షల పని దినాలు లక్ష్యంకాగా మార్చి చివరినాటికి 124.67 లక్షల పనిదినాలు కల్పించారు. తద్వారా రాష్ట్ర స్థాయిలో అనకాపల్లి జిల్లా 6వ స్థానంలో నిలిచింది. కూలీలకు మొత్తం రూ.350 కోట్లు వేతనాల రూపంలో అందాయి. ఒక కూలీకి సగటున రూ.281 రోజువారీ వేతనం లభించింది. ఈ విషయంలో జిల్లా రాష్ట్ర స్థాయిలో 4వ స్థానంలో నిలిచింది. ఉపాధి కూలీలకు సగటున 59 రోజులు పని కల్పించి రాష్ట్ర స్థాయిలో 5వ స్థానాన్ని, 29,740 కుటుంబాలకు 100 రోజులు పని కల్పించి 5వ స్థానంలో నిలిచింది. జాబ్ కార్డులున్న వారిలో 74 శాతం మందికి పని కల్పించి 6వ స్థానంలో నిలిచింది. రహదారులు లేని 17 మారుమూల గిరిజన గ్రామాలకు రూ.21.89 కోట్లతో 22.18 కిలోమీటర్ల మేర రోడ్లు వేశారు. ఉపాధి హామీ పథకంలో 1,648 మంది రైతులకు చెందిన భూముల్లో పండ్ల తోటల పెంపకం చేపట్టారు. 120 ఎకరాల ప్రభుత్వ భూముల్లో కొబ్బరి మొక్కలు నాటించారు.
పల్లె పండుగలో భాగంగా..
ప్రభుత్వం గ్రామాల్లో అధ్వాన రోడ్లకు మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణానికి ‘పల్లె పండుగ’ కార్యక్రమం కింద పెద్దఎత్తున నిధులు మంజూరు చేసింది. ఉపాధి కన్వర్జెన్సీ నిధులు రూ.181.22 కోట్లతో 229.09 కిలో మీటర్ల పొడవున సిమెంట్, బీటీ రోడ్లు వేశారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో 745 గోకులం షెడ్లు నిర్మించారు. రూ.24.95 కోట్లతో 308 పాఠశాలలకు ప్రహరీ గోడలు నిర్మిస్తున్నారు. రూ.1.67 కోట్ల వ్యయంతో 89 నర్సరీల్లో మొక్కలు పెంచి, సామాజిక వనాలు, రోడ్ల పక్కన నాటుతారు.
ఈ ఏడాది 127 లక్షల పనిదినాలు లక్ష్యం
జిల్లాలో ప్రస్తుత (2025-26) ఆర్థిక సంవత్సరంలో 127 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. గ్రామాల్లో 215 పశువుల నీటి తొట్టెలు, 7,200 పంట కుంటలు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలో 451.5 కిలో మీటర్ల పంట కాలువల పునరుద్ధరణ, 977 చెరువుల అభివృద్ధి పనులు మంజూరయ్యాయని తెలిపారు.