ఫిల్మ్ క్లబ్ ఎన్నికలు వాయిదా
ABN , Publish Date - Apr 08 , 2025 | 01:25 AM
వైజాగ్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి.

నామినేషన్ల స్వీకరణ కోసం ఏర్పాటుచేసిన బాక్స్‌ను ఉద్యోగి ఓపెన్ చేయడమే కారణం
అందులో ఒక నామినేషన్ పత్రాన్ని తీస్తున్నట్టు వీడియోలో రికార్డింగ్
అధ్యక్ష పదవికి రేస్‌లో ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు
విశాఖపట్నం, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి):
వైజాగ్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ ఎన్నికల అధికారి ప్రకటించలేదు. క్లబ్ అధ్యక్షుడు, సెక్రటరీలు రాజీనామా చేసి నెలలు గడిచినా కార్యవర్గం సరైన చర్యలు చేపట్టలేదు. అనేక వివాదాల అనంతరం ఈ క్లబ్‌కు ఇటీవల ఎన్నికల ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 3, 4 తేదీల్లో నామినేషన్లు స్వీకరించారు. వాటిని ఏడో తేదీన అంటే సోమవారం పరిశీలించాల్సి ఉంది. పోటీకి అర్హులైన వారి జాబితా సాయంత్రం ఆరు గంటల తరువాత ప్రకటించాల్సి ఉండగా, ఎన్నికలను వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ఉపసంహరణకు 12వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అవకాశం ఇచ్చి, అదే రోజు తుది జాబితాను ప్రకటించాలి. ప్రచారానికి వారం రోజులు గడువు ఇచ్చి, ఈ నెల 20వ తేదీన ఎన్నికలు నిర్వహించి అదేరోజు ఫలితాలు ప్రకటించాలి. కానీ ఆకస్మికంగా ఎన్నికలు వాయిదా వేసినట్టు ప్రకటించారు.
అదే కారణమా?
ఈ ఎన్నికలకు నామినేషన్ల గడువు నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటలతో ముగిసింది. ఎన్నికల అధికారి నామినేషన్లను పెట్టెలో పెట్టి, సీజ్ చేసి, ఏడో తేదీన పరిశీలించాలి. అయితే నాలుగో తేదీ మధ్యాహ్నం 12.12 గంటల సమయంలో క్లబ్ ఉద్యోగి (జీఎం) ఒకరు ఆ పెట్టె తాళం తెరిచి అందులో ఒక నామినేషన్ కవరును బయటకు తీశారు. దానిని సెక్రటరీ పోస్టుకు నామినేషన్ వేసిన సురేందర్‌రెడ్డి అనే వ్యక్తికి ఇచ్చారు. ఆయన గత కార్యవర్గంలో కోశాధికారిగా పనిచేశారు. ఆ తరువాత ఆ నామినేషన్‌లో మార్పులు, చేర్పులు చేసి తిరిగి తీసుకువచ్చి ఆ బాక్సులో పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో నామినేషన్ల పెట్టె తెరుస్తున్న దృశ్యం, కవరు తీసి ఇంకొకరికి ఇవ్వడం స్పష్టంగా ఉంది. ఆ సమయంలో అక్కడ ఇంకో నలుగురు కూడా ఉన్నారు. ఈ వీడియో చూసిన తరువాత విచారణ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని క్లబ్ సభ్యులు కొందరు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు వాయిదా వేసినట్టు భావిస్తున్నారు.
బరిలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
భీమిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఫిల్మ్ క్లబ్ ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు పోటీ చేస్తుండడం గమనార్హం. క్లబ్ అధ్యక్ష పదవికి ఆయన నామినేషన్ వేశారు. ఆయనకు పోటీగా సినీ నిర్మాత (హైదరాబాద్) కేఎస్ రామారావు బరిలో ఉన్నారు. ఉపాధ్యక్ష పదవికి ఇద్దరు, సెక్రటరీ పదవికి ముగ్గురు పోటీ పడుతున్నారు. జాయింట్ సెక్రటరీ పదవికి ముగ్గురు నామినేషన్లు వేశారు. కోశాధికారి పోస్టుకు ఎన్‌ఆర్‌కే రెడ్డి ఒక్కరే నామినేషన్ వేసినట్టు తెలిసింది. కార్యవర్గంలో సభ్యుల పదవులు పది ఉండగా 23 మంది నామినేషన్లు వేశారు. మొత్తం 32 నామినేషన్లు వచ్చినట్టు తెలిసింది. ఎన్నికల వాయిదాకు కారణాలు తెలుసుకోవడానికి ప్రస్తుత సెక్రటరీ శ్రీనివాసరాజుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి ఫోన్ చేయగా స్పందించలేదు. ఎన్నికల వాయిదా నిజమేనా? అని మెసేజ్ పెట్టినా సమాధానం ఇవ్వలేదు. క్లబ్ సభ్యులైతే ఎన్నికలు వాయిదా పడ్డాయని స్పష్టంచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా ఇంకా ఈ క్లబ్‌పై వైసీపీ నాయకుల పెత్తనమే నడవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్లబ్‌లో అన్నీ సవ్యంగా జరిగేటట్టు చూస్తామని నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గతంలో ప్రకటించారు. ఇప్పుడైనా ఆయన స్పందిస్తారో లేదో చూడాలి.