Share News

అసంపూర్తి ఇళ్లకు ఆర్థిక సాయం

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:34 AM

గతంలో పక్కా ఇళ్లు మంజూరై, వివిధ కారణాల వల్ల నిర్మాణ పనులు పూర్తిచేయలేకపోయిన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సాయం అందిస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌ బత్తుల తాతయ్యబాబు తెలిపారు. మంగళవారం వడ్డాది సమీపంలోని వీరవల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీసీ ఎస్‌సీలకు రూ.50 వేలు, ఎస్‌టీలకు రూ.75 వేలు, పీవీటీజీలకు రూ.లక్ష చొప్పున ఇస్తున్నదని చెప్పారు.

అసంపూర్తి ఇళ్లకు ఆర్థిక సాయం
మీడియాతో మాట్లాడుతున్న హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బత్తుల తాతయ్యబాబు

13,748 మంది లబ్ధిదారులకు రూ.70 కోట్లు

జూన్‌లో 13,700 గృహప్రవేశాలు

రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్‌ బత్తుల తాతయ్యబాబు

చోడవరం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): గతంలో పక్కా ఇళ్లు మంజూరై, వివిధ కారణాల వల్ల నిర్మాణ పనులు పూర్తిచేయలేకపోయిన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సాయం అందిస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌ బత్తుల తాతయ్యబాబు తెలిపారు. మంగళవారం వడ్డాది సమీపంలోని వీరవల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీసీ ఎస్‌సీలకు రూ.50 వేలు, ఎస్‌టీలకు రూ.75 వేలు, పీవీటీజీలకు రూ.లక్ష చొప్పున ఇస్తున్నదని చెప్పారు. ఈ మేరకు జిల్లాలో 13,748 మందికి సుమారు రూ.70 కోట్లు అదనపు సాయంగా అందుతుందన్నారు. జూన్‌లో 13,700 ఇళ్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చైర్మన్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, జూన్‌లో గృహ ప్రవేశాలు చేయించాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారని ఆయన చెప్పారు. అదనపు సాయం కింద రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షలకుపైగా లబ్ధిదారులకు రూ.3,219 కోట్లు చెల్లిస్తున్నట్టు తాతయ్యబాబు వెల్లడించారు. కాగా కొత్త ఇంటి స్థలాలు, పక్కా ఇళ్ల మంజూరు కోసం రాష్ట్రంలో 7 లక్షల 10 వేల 294 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరందరికీ దశలవారీగా స్థలం, పక్కా ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల చొప్పున స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిదన్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో రాష్ట్రానికి నాలుగు లక్షల ఇళ్లు మంజూరు చేసే అవకాశం ఉందని, అర్బన్‌ అబ్ధిదారులకు రూ.2.9 లక్షలు, రూరల్‌ లబ్ధిదారులకు రూ.2.3 లక్షల చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తాయన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు కూడా గృహ నిర్మాణ పఽథకం అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి పార్థసారథి యోచన చేస్తున్నారని తాతయ్యబాబు చెప్పారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు దొండా నరేశ్‌, సిరిగిరిశెట్టి శ్రీరామమూర్తి పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 12:34 AM