Share News

గ్యాస్‌పై బాదుడు

ABN , Publish Date - Apr 08 , 2025 | 01:18 AM

కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచింది. గృహ అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్‌ ధరను రూ.50 మేర పెంచుతున్నట్టు సోమవారం ప్రకటించింది.

గ్యాస్‌పై బాదుడు

సిలిండర్‌ ధర రూ.50 పెంపు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి):

కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచింది. గృహ అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్‌ ధరను రూ.50 మేర పెంచుతున్నట్టు సోమవారం ప్రకటించింది. విశాఖపట్నంలో గ్యాస్‌ సిలిండర్‌ ధర ప్రస్తుతం రూ.811. ఇందులో గ్యాస్‌ ధర రూ.772.38 కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 5 శాతం జీఎస్‌టీగా రూ.38.62 వసూలు చేస్తున్నాయి. మొత్తం రూ.811 అవుతోంది. ఇప్పుడు అదనంగా మరో రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

జిల్లాలోని 53 గ్యాస్‌ ఏజెన్సీల పరిధిలో మొత్తం గ్యాస్‌ కనెక్షన్లు 9,39,821 ఉన్నాయి. వీటిలో దీపం కనెక్షన్లు 96,578. వీరికి రాష్ట్ర ప్రభుత్వం ఏడాది మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది. ప్రధాన మంత్రి ఉజ్వల్‌ యోజన కింద రూ.20,608 కనెక్షన్లు ఉన్నాయి.

వారిపైనే భారం

ఎటువంటి రాయితీ లేకుండా గ్యాస్‌ తీసుకుంటున్న వారి సంఖ్య 8,22,635. వీరు ఈ నెల నుంచి గ్యాస్‌కు సుమారు రూ.861 చెల్లించాలి. ప్రభుత్వం పెంచిన రూ.50 లెక్క చూసుకుంటే జిల్లా వినియోగదారులపై అదనంగా రూ.4.11 కోట్లు భారం పడుతోంది.

ఇక ప్రతి పక్షం రోజులకు...

ఇకపై ఇంతకు ముందులాగే గ్యాస్‌ సిలిండర్‌ ధరను ప్రతి పదిహేను రోజులకు ఓసారి సవరిస్తామని, పెరిగితే పెంపు, తగ్గితే తగ్గింపు ఉంటుందని కేంద్రం తెలిపింది. ఇదిలావుండగా మోదీ ప్రభుత్వం గ్యాస్‌ రాయితీని పూర్తిగా తగ్గించేసింది. గతంలో గ్యాస్‌ సిలిండర్‌కు రూ.900 చెల్లిస్తే, రాయితీ కింద రూ.400 బ్యాంకు ఖాతాలో పడేది. ఆ మొత్తాన్ని దశల వారీగా తగ్గించుకుంటూ వచ్చి ఇప్పుడు దానిని కేవలం రూ.3.25కు పరిమితం చేసింది.

డీజిల్‌, పెట్రోల్‌పై లీటరుకు రెండు రూపాయలు

ఇదే సమయంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను కూడా లీటరుకు రెండు రూపాయలు పెంచుతున్నట్టు కేంద్రం వెల్లడించింది. అయితే ఈ భారం వినియోగదారులపై పడదని స్పష్టంచేసింది. ఈ సవరించిన ధరలన్నీ సోమవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయి.


మలేషియాకు కూటమి కార్పొరేటర్లు

ప్రత్యేక విమానంలో రేపు ప్రయాణం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ రాజకీయం వేడెక్కుతోంది. మేయర్‌ గొలగాని హరివెంకటకుమారిపై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం కోరుతూ నోటీసు ఇచ్చారు. దీనిపై ఈనెల 19న కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటు కానున్న నేపథ్యంలో కార్పొరేటర్లను కాపాడుకునేందుకు నేతలు తంటాలు పడుతున్నారు. వైసీపీ కార్పొరేటర్లను ఇప్పటికే బెంగళూరు, శ్రీలంక, థాయ్‌లాండ్‌ తదితర దేశాలకు తరలించిన నేపథ్యంలో కూటమి నేతలు కూడా తమ కార్పొరేటర్లను మలేషియా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. కార్పొరేటర్లతోపాటు వారి కుటుంబ సభ్యులను కూడా పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే అందరి పాస్‌పోర్టులు సేకరించారు. నలుగురు కార్పొరేటర్ల పాస్‌పోర్టులు వివిధ కారణాలతో రెన్యువల్‌ కాకపోవడంతో వారిని మినహాయించారు. కార్పొరేటర్లతోపాటు వారి కుటుంబసభ్యులు కూడా వస్తుండడంతో ప్రత్యేక విమానం బుక్‌ చేసినట్టు సమాచారం. ప్రత్యేక విమానంలో బుధవారం రాత్రి అందరినీ మలేషియా తరలించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.


‘ఎన్టీఆర్‌ వైద్య సేవ’కు అంతరాయం

జిల్లాలోని 27 ఆస్పత్రుల్లో నిలిచిన సేవలు

ముందస్తు సమాచారంతో ప్రత్యామ్నాయ ఆస్పత్రులకు రోగులు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి):

ఎన్టీఆర్‌ వైద్య సేవ నెట్‌వర్క్‌ పరిధిలోని కొన్ని ఆస్పత్రులు సోమవారం నుంచి సేవలను నిలిపివేశాయి. ప్రభుత్వం నుంచి బిల్లులు విడుదల కాకపోవడంతో సేవలను నిలిపివేయాలని అసోసియేషన్‌ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలోని 27 ఆస్పత్రులు ఐపీ సేవలను నిలిపివేశాయి. కాగా ఓపీతోపాటు అత్యవసర వైద్య సేవలను యథావిధిగా అందించాయి. ఎన్టీఆర్‌ వైద్య సేవ నెట్‌వర్క్‌ పరిధిలో జిల్లాలో 108 ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో 26 ప్రభుత్వ ఆస్పత్రులు కాగా, 82 ప్రైవేటు ఆస్పత్రులు. అసోసియేషన్‌ పిలుపు మేరకు సోమవారం నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో 27 మాత్రమే ఐపీ సేవలను నిలిపివేయగా, మిగిలిన ఆస్పత్రుల్లో యథావిధిగా సేవలందుతున్నాయి. కాగా ఈ పథకంలో భాగంగా ఇప్పటికే చికిత్స పొందుతున్న రోగులకు వైద్య సేవలు కొనసాగిస్తామని ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. కొత్తగా రోగులను చేర్చుకోవడం లేదని కొన్ని ఆస్పత్రులు ముందుగానే సమాచారాన్ని ఇవ్వడంతోపాటు ఆరోగ్యమిత్రల ద్వారా ఇన్‌పేషెంట్‌గా చేరి వైద్య సేవలు పొందాల్సిన రోగులను మిగిలిన ఆస్పత్రులకు తరలించేలా చర్యలు చేపట్టాయి. కాగా రోగులకు సమస్యలు ఎదురవకుండా చర్యలు తీసుకున్నామని ఎన్టీఆర్‌ వైద్య సేవ జిల్లా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.అప్పారావు తెలిపారు. ఆరోగ్య శాఖ అధికారులతో నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారని, అవి సఫలమైతే ఆ 27 ఆస్పత్రుల్లోనూ యథావిధిగా సేవలను ప్రారంభించే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

Updated Date - Apr 08 , 2025 | 01:18 AM