రుషికొండలో అక్రమ నిర్మాణాలు
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:33 AM
రుషికొండలో ప్రభుత్వ భూములను ఆక్రమించి పలువురు వాణిజ్య సముదాయాలు నిర్మించారు.

నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న జీవీఎంసీ సిబ్బంది
ఏడాదైనా చర్యలు చేపట్టని వైనం
బీచ్‌రోడ్డులో పెరిగిపోతున్న అనధికార కట్టడాలు
విశాఖపట్నం, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి):
రుషికొండలో ప్రభుత్వ భూములను ఆక్రమించి పలువురు వాణిజ్య సముదాయాలు నిర్మించారు. అనుమతులు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మరికొందరు సీఆర్‌జెడ్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వీటిపై స్థానికులు ఫిర్యాదు చేస్తే జీవీఎంసీ అధికారులు గత ఏడాది మే నెలలో నోటీసులు జారీచేసి చేతులు దులుపుకున్నారు. దాంతో ఫిర్యాదీలు నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదును స్వీకరించిన హైకోర్టు...ఆక్రమణదారులపై ఏమి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఈ నెల 11న జీవీఎంసీకి నోటీసులు జారీ చేసింది.
అధికారుల ఉదాసీన వైఖరి వల్ల బీచ్‌రోడ్డులో అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నాయి. రుషికొండ ప్రధాన రహదారి పక్కన జిరాయితీ భూమి కలిగిన కొందరు...వెనుక గల ప్రభుత్వ భూమి (బీచ్)ని ఆక్రమించి అదనపు నిర్మాణాలు చేపట్టారు. వాటికి జీవీఎంసీ అనుమతులు లేవు. ఈ రహదారి ప్రస్తుతం 40 మీటర్ల వెడల్పున ఉంది. వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్‌లో 60 మీటర్లకు విస్తరించాలని మూడేళ్ల క్రితమే నిర్ణయించారు. అలాగే అటు,ఇటు మరో 10 మీటర్ల చొప్పున గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. దాని ప్రకారం రహదారిని అభివృద్ధి చేస్తే ఇప్పుడు అక్కడ నిర్వహిస్తున్న వాణిజ్య సముదాయాలు ఏవీ మిగలవు.
అనధికార నిర్మాణాలు
వాణిజ్య సముదాయం నిర్మించాలంటే తప్పనిసరిగా జీవీఎంసీ నుంచి ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలి. అలా ప్లాన్ కోసం దరఖాస్తు చేస్తే...అది మాస్టర్ ప్లాన్ రహదారి కాబట్టి అనుమతులు ఇవ్వరు. విస్తరణలో పోయే స్థలానికి టీడీఆర్ మాత్రమే వస్తుందని, నిర్మాణం చేయకూడదని చెబుతారు. ఈ విషయం తెలిసే అక్కడ ప్రైవేటు (జిరాయితీ) భూమి ఉన్నవారు ఎవరూ ప్లాన్‌కు దరఖాస్తు చేయకుండా అక్రమంగా కట్టేస్తున్నారు. పనిలో పనిగా వెనుక సీఆర్‌జెడ్‌లోని ప్రభుత్వ భూమి కలిపేసుకుంటున్నారు. ఫిర్యాదు వచ్చిన తరువాత కనీసం వాటిపై చర్యలు చేపట్టాల్సిన యంత్రాంగం మిన్నకుండిపోయింది. దీని వెనుక భారీగా నగదు చేతులు మారిందని, ఎనిమిదో వార్డు జీవీఎంసీ సిబ్బందికి లబ్ధి చేకూరిందని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలె గీతం యూనివర్సిటీని ఆనుకొని కూడా ఇలాగే వాణిజ్య సముదాయం నిర్మించారు. ఎవరూ అనుమతులు తీసుకోవడం లేదు. వీటిని జీవీఎంసీ పట్టించుకోవడం లేదు. అసలు ప్లానింగ్ అధికారులు ఏమి చేస్తున్నారో తెలియడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.