ప్రభుత్వాస్పత్రుల్లో సేవలపై ఆరా
ABN , Publish Date - Apr 16 , 2025 | 01:08 AM
ఆస్పత్రుల్లో సేవలు మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది.

గడిచిన నాలుగు నెలల నుంచి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న సర్కారు
వైద్యులు, సిబ్బంది పనితీరు, మందుల సరఫరా, అవినీతి, పరిశుభ్రతపై ఐవీఆర్‌ఎస్ ద్వారా సమాచారం సేకరణ
జిల్లాలోని ఆస్పత్రుల్లో పారిశుధ్వ నిర్వహణపై పెదవివిరుపు
అవినీతి ఉందన్న 41 శాతం మంది...
ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించేలా ఆదేశాలు
విశాఖపట్నం, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి):
ఆస్పత్రుల్లో సేవలు మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇందుకోసం ప్రభుత్వం ఆస్పత్రుల్లో ప్రధానంగా నెలకొన్న సమస్యలు, అందుతున్న సేవలపై ప్రజలకు ఫోన్ చేసి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. గడిచిన నాలుగు నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతి నెలా ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తోంది. జిల్లాలో ప్రధానంగా కేజీహెచ్, ఈఎన్‌టీ, మానసిక వైద్యశాల, ఘోషా ఆస్పత్రి, ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రి, విమ్స్ ఉన్నాయి. ఆయా ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవల గురించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. నెలవారీ నివేదికల ఆధారంగా చేసుకుని ఆయా ఆస్పత్రుల అధికారులను అప్రమత్తం చేస్తోంది.
ప్రజాభిప్రాయ సేకరణ ప్రశ్నలు ఇవే..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలకు సంబంధించి ఐవీఆర్‌ఎస్ ద్వారా కొన్ని అంశాలపై ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడుతున్నారు. వీటిలో ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా?, డాక్టర్ ప్రవర్తన ఎలా ఉంటోంది?, సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంటుంది?, మీకు ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ రాసిన మందులు ఇస్తున్నారా?, అవినీతి ఉందా?, పరిశుభ్రత ఎలా ఉందన్న...ప్రశ్నలు వేసి సమాధానాలను రాబడుతున్నారు.
కొన్నింటిపై ప్రజల్లో అసంతృప్తి
ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా? అనే ప్రశ్నకు జనవరిలో 66 శాతం మంది ప్రజలు అవును అని సమాధానం చెప్పగా, 34 శాతం మంది ఉండడం లేదన్నారు. ఫిబ్రవరిలో 79.44 మంది ఉంటున్నారని, 20.56 శాతం మంది ఉండడం లేదని, మార్చిలో 72.4 శాతం మంది అందుబాటులో ఉన్నారని చెప్పగా, 27.6 శాతం మంది ఉండడం లేదని, ఏప్రిల్‌లో 10వ తేదీ వరకు 74 శాతం మంది ఉంటున్నారని చెప్పగా, 26 శాతం మంది ఉండడం లేదని స్పష్టం చేశారు. డాక్టర్ ప్రవర్తన ఎలా ఉందన్న ప్రశ్నకు...జనవరిలో 65.39 శాతం మంది బాగుందని సమాధానం చెప్పగా, 34.01 శాతం సరిగా లేదన్నారు. ఫిబ్రవరిలో 68 శాతం మంది బాగుందని, 32 శాతం మంది బాగాలేదని, మార్చిలో 72 శాతం మంది బాగుందని, 28 శాతం మంది బాగాలేదని చెప్పారు. ఏప్రిల్‌లో 71 శాతం మంది బాగుందని, 29 శాతం మంది బాగాలేదన్నారు. సిబ్బంది ప్రవర్తన ఎలా ఉందన్న ప్రశ్నకు జనవరిలో 63.91 శాతం మంది బాగుందని చెప్పగా, 36.09 శాతం బాలేదని సమాధానమిచ్చారు. ఫిబ్రవరిలో 64.36 శాతం మంది బాగుందని, 35.64 శాతం మంది బాగాలేదని, మార్చిలో 62.28 శాతం మంది బాగుందనగా, 37.72 శాతం మంది బాలేదని, ఏప్రిల్‌లో 64 శాతం మంది బాగుందని చెబితే...36 శాతం మంది బాగుండడం లేదని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ రాసిన మందులు ఇస్తున్నారా.? అన్న ప్రశ్నకు జనవరిలో 57 శాతం మంది ఇచ్చారని చెప్పగా, 43 శాతం మంది ఇవ్వలేదన్నారు. ఫిబ్రవరిలో 61.77 శాతం మంది ఇచ్చారని, 38.23 శాతం మంది ఇవ్వలేదన్నారు. మార్చిలో 60.85 శాతం మంది ఇచ్చారని, 39.15 శాతం మంది ఇవ్వలేదని, ఏప్రిల్‌లో 68 శాతం మంది ఇచ్చారంటే, 32 శాతం మంది ఇవ్వలేదని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఏదైనా అవినీతిని గమనించారా?...అన్న ప్రశ్నకు జనవరిలో 63 శాతం మంది ఉందని చెప్పగా, 37 శాతం మంది లేదన్నారు. ఫిబ్రవరిలో 60 శాతం మంది అవినీతి ఉందంటే, 40 శాతం మంది లేదని, మార్చిలో 49 శాతం మంది ఉందని, 51 శాతం మంది లేదని, మార్చిలో 41 శాతం మంది ఉందని చెప్పగా, 59 శాతం మంది లేదని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పరిశుభ్రత ఎలా ఉందన్న ప్రశ్నకు జనవరిలో 60 శాతం బాగుందని చెప్పగా, 40 శాతం మంది బాగాలేదని, ఫిబ్రవరిలో 46 శాతం మంది బాగుందని, 54 శాతం మంది బాగాలేదని, మార్చిలో 43 శాతం మంది బాగుందని, 57 శాతం మంది బాగాలేదని, ఏప్రిల్‌లో 49 శాతం మంది బాగుందంటే, 51 శాతం మంది బాగుండడం లేదని చెప్పారు.
ఇదీ యాక్షన్..
ఆయా ప్రశ్నలకు వచ్చిన సమాధానాలను బట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆస్పత్రి అధికారులు ఎప్పటికప్పుడు సేవలు అందుతున్న తీరును పరిశీలించాలని ఆదేశించింది. విజిలెన్స్ తనిఖీలు నిర్వహించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. డ్యూటీలకు హాజరుకాని వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చారు. ఉత్తమ పనితీరు కనబరిచే వైద్యులు, స్టాఫ్ నర్సులకు అవార్డులు ఇవ్వాలని సూచించింది. మందులు సరఫరా తగినంత ఉండేలా సెంట్రల్ మెడిసిన్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసుకోవాలని ఆస్పత్రులకు సూచించారు. అవినీతిని నిర్మూలించేందుకు విజిలెన్స్ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, ఇంకా ఆస్పత్రుల్లో ఫిర్యాదులు బాక్సులు ఏర్పాటుచేయాలని, ఎక్కడికక్కడ పోస్టర్స్ ఏర్పాటుచేయాలని ఆస్పత్రి అధికారులకు ఉన్నతాధికారులకు సూచించారు.