Share News

సాయంత్రమైతే వాన

ABN , Publish Date - Apr 06 , 2025 | 11:22 PM

ఏజెన్సీలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని దాదాపుగా ఏజెన్సీలోని అన్ని మండలాల్లోనూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

సాయంత్రమైతే వాన
పాడేరు- విశాఖపట్నం మెయిన్‌రోడ్డులో ఆదివారం భారీ వర్షం

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత

ఆ తరువాత భారీ వర్షం

మూడు రోజులుగా ఇదే పరిస్థితి

పాడేరు, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని దాదాపుగా ఏజెన్సీలోని అన్ని మండలాల్లోనూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పాడేరులో ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సాధారణ వాతావరణం నెలకొంది. పగటి పూట ఎండ ఒక మోస్తరుగా కాసింది. మధ్యాహ్నం మూడు గంటల తరువాత వాతావరణం మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. పాడేరు, పరిసర ప్రాంతాలతో పాటు ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, అనంతగిరి ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. గత మూడు రోజులుగా ఏజెన్సీలో ఇదే పరిస్థితి ఉంది. కాగా తాజా వాతావరణంతో జనం ఊరట చెందారు.

కొయ్యూరులో 35.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

ఏజెన్సీలో గత మూడు రోజులుగా భారీ వర్షం కురుస్తున్నప్పటికీ గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులేదు. ఆదివారం కొయ్యూరులో 35.6, పాడేరులో 34.3, ముంచంగిపుట్టులో 33.5, పెదబయలులో 33.1, చింతపల్లిలో 32.7, జీకేవీధిలో 32.3, అరకులోయలో 31.7, జి.మాడుగులలో 28.3, అనంతగిరిలో 27.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

చింతపల్లిలో...

చింతపల్లి: మండలంలో భారీ వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు, పంట పొలాల్లో వర్షపు నీరు చేరింది. జర్రెల, కోరుకొండ వారపు సంతలో వర్తకులు, వినియోగదారులు వర్షం వల్ల ఇబ్బంది పడ్డారు.

హుకుంపేటలో...

హుకుంపేట: మండలంలో ఆదివారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం 9 గంటల వరకు మంచు దట్టంగా కురిసింది. ఆ తరువాత మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.

Updated Date - Apr 06 , 2025 | 11:22 PM