నగరంలో మంత్రి లోకేశ్
ABN , Publish Date - Mar 31 , 2025 | 01:02 AM
రాష్ట్ర ఐటీ, మానవవనరుల అభివృద్ధి శాఖామంత్రి నారా లోకేశ్ ఆదివారం మధ్యాహ్నం నగరానికి చేరుకున్నారు.

విశాఖపట్నం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ఐటీ, మానవవనరుల అభివృద్ధి శాఖామంత్రి నారా లోకేశ్ ఆదివారం మధ్యాహ్నం నగరానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు ఎంపీ శ్రీభరత్, ఎమ్యెల్యేలు పి.గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, విశాఖ, అనకాపల్లి పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ, బత్తుల తాతయ్యబాబు, బుద్దా నాగజగదీశ్వరరావు తదితరులు స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి పీఎం.పాలెం క్రికెట్ స్టేడియంనకు చేరుకుని కుటుంబంతో కలిసి ఐపీఎల్ మ్యాచ్‌ను తిలకించారు. తరువాత బంధువుల ఇంట్లో విందుకు హాజరైన లోకేశ్, రాత్రి పార్టీ కార్యాలయానికి చేరుకుని బస చేశారు.
నేడు అచ్యుతాపురంలో మంత్రి లోకేశ్ పర్యటన
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి నారా లోకేశ్ సోమవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో పర్యటించనున్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఉదయం 9.30 గంటలకు బయలుదేరి బీచ్‌రోడ్డులోని హోటల్ నోవాటెల్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం నిర్వహించే కార్యక్రమంలో ప్రసంగిస్తారు. ఉదయం 11.30 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం చేరుకుంటారు. అక్కడి లేపాక్షి కల్యాణమండపంలో ఎలమంచిలి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. పార్టీ సభ్యత్వ నమోదులో ప్రతిభ చూపిన కార్యకర్తలకు అవార్డులు ప్రదానం చేస్తారు. సాయంత్రం 4.30 గంటలకు అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి ఎయిర్‌పోర్టుకు చేరుకుని రాత్రి 7.15 గంటలకు విజయవాడ వెళతారు.