Share News

Uttam Kumar Reddy: పేదలకు మూడు రంగుల కార్డులు

ABN , Publish Date - Apr 11 , 2025 | 04:14 AM

ధాన్యంలో తేమ 17 శాతం పైన ఉంటే కొనుగోలు చేయబోమని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ ఏడాది 30 లక్షల టన్నుల సన్నబియ్యం సిద్ధంగా ఉంచామని, 3.10 కోట్ల మందికి రేషన్ అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు

Uttam Kumar Reddy: పేదలకు మూడు రంగుల కార్డులు

  • ఆపై వర్గాలకు ఆకుపచ్చ కార్డులు

  • త్వరలోనే కొత్త రేషన్‌ కార్డుల జారీ

  • కేంద్రం ఇచ్చేది దొడ్డు బియ్యమే

  • మేం సన్న బియ్యం ఇస్తున్నాం: మంత్రి ఉత్తమ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): దారిద్య్ర రేఖకు దిగువన ఉండే వర్గాల(బీపీఎల్‌)కు మూడు రంగుల కార్డులు, ఎగువన ఉండేవారి(ఏపీఎల్‌)కి ఆకుపచ్చ రంగు రేషన్‌ కార్డులు ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. కార్డుల ముద్రణ కోసం టెండర్లు పిలిచామని, త్వరలోనే కొత్త కార్డులు ఇస్తామని తెలిపారు. రాష్ట్ర జనాభాలో 84 శాతం మందికి సన్న బియ్యం ఇవ్వడం దేశ చరిత్రలోనే గొప్ప కార్యక్రమమని అన్నారు. చేశారు. కేంద్రం మనిషికి 5 కిలోల దొడ్డు బియ్యం ఇస్తుండగా.. తాము 6 కిలోల సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో దొడ్డు బియ్యం ఇవ్వడానికి రూ.10,600 కోట్లు ఖర్చుకాగా.. 3.10 కోట్ల మందికి సన్న బియ్యం కోసం రూ.13 వేల కోట్లను వెచ్చించనున్నామని ప్రకటించారు. గురువారం జల సౌధ నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల ఛైర్మన్లతో ఉత్తమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మార్కెట్‌లో రూ.40కి కిలో సన్న బియ్యం కొనుగోలు చేసి, పేదలకు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. గతంలో ఇచ్చిన బియ్యం 80-90 శాతం దాకా పక్కదారి పట్టిందని.. ప్రస్తుతం ఇస్తున్న బియ్యం వంద శాతం సద్వినియోగం అవుతుందని చెప్పారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఇక ఏ రాష్ట్రంలో పండనంత వరి ప్రస్తుతం రాష్ట్రంలో పండుతోందని.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ హయాంలో, ఉమ్మడి ఏపీలో కూడా ఈ స్థాయిలో ఉత్పత్తి రాలేదని ఉత్తమ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో వడ్ల సేకరణ కోసం 8,209 కేంద్రాలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటిదాకా 2,573 కేంద్రాలు తెరిచామని వెల్లడించారు.


ధాన్యంలో తేమ 17 శాతం పైన ఉంటే కొనుగోలు చేయబోమని చెప్పారు. రాష్ట్రంలో ఈ ఏడాది సన్నబియ్యం పంపిణీ కోసం 30 లక్షల టన్నుల ధాన్యం సిద్ధంగా ఉంచామని ఉత్తమ్‌ ప్రకటించారు. తెలంగాణ ఏర్పడే నాటికి 90 లక్షల మందికి తెల్లకార్డులు ఉండగా.. పదేళ్లలో కొన్ని రద్దు కాగా.. కొత్తగా ఇచ్చింది 49 వేల కార్డులేనని చెప్పారు. ప్రస్తుతం 2.81 కోట్ల మందికి సన్నం బియ్యం అందుతుండగా.. కొత్తగా రేషన్‌కార్డుల దరఖాస్తుల వెరిఫికేషన్‌ పూర్తయితే ఆ సంఖ్య 3.10 కోట్ల మందికి చేరే అవకాశం ఉందన్నారు. ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇవ్వనందున హైదరాబాద్‌లో సన్న బియ్యం ఇవ్వడం లేదని, ఎన్నికలు పూర్తికాగానే ఇస్తామని తెలిపారు.

వాలంతరికి పూర్వ వైభవం తెస్తా: ఉత్తమ్‌

వాటర్‌ అండ్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(వాలంతరి)కి పూర్వ వైభవం తీసుకువస్తానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్‌లోని వాలంతరిని గురువారం ఆయన సందర్శించారు. ఈ నెల 14న సీఎం రేవంత్‌రె డ్డి చేతుల మీదుగా 199 మంది జూనియర్‌ టెక్నికల్‌ అధికారులు(జేటీవో), 224 మంది అసిస్టెంట్‌ ఇంజనీర్ల(ఏఈ)కు నియామక పత్రాలు అందించే కార్యక్రమం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్‌తో కలిసి ఉత్తమ్‌ ఏర్పాట్లను పరిశీలించారు.

Updated Date - Apr 11 , 2025 | 04:16 AM