సచివాలయానికి వస్తేనే పింఛన్
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:22 AM
మండలంలోని శివారు గ్రామాల ఆదివాసీ వృద్ధులు పింఛన్ తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయం ఉద్యోగులు పింఛన్ నగదు ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయడం లేదు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు మండుటెండలో 10 కిలోమీటర్లు కాలినడకన గ్రామ సచివాలయానికి వెళ్లి పింఛన్ సొమ్ము తీసుకుంటున్నారు.

- ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయని ఉద్యోగులు
- వృద్ధులు, దివ్యాంగులు మండుటెండలో 10 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన దుస్థితి
- ఇదీ మండలంలోని శివారు గ్రామాల ప్రజల పరిస్థితి
గూడెంకొత్తవీధి, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని శివారు గ్రామాల ఆదివాసీ వృద్ధులు పింఛన్ తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయం ఉద్యోగులు పింఛన్ నగదు ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయడం లేదు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు మండుటెండలో 10 కిలోమీటర్లు కాలినడకన గ్రామ సచివాలయానికి వెళ్లి పింఛన్ సొమ్ము తీసుకుంటున్నారు.
గూడెంకొత్తవీధి పంచాయతీ పరిధిలోని కుండలాయిగొంది, దారాలబయలు, చుక్కగొంది గ్రామాలు పంచాయతీ కేంద్రానికి 10- 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ గ్రామాల పరిధిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు ప్రతి నెలా ఒకటి, రెండు తేదీల్లో గ్రామ సచివాలయాలకు వెళ్లి పింఛన్ నగదు తీసుకుంటున్నారు. గ్రామ సచివాలయం ఉద్యోగులు ఇప్పటి వరకు ఒక్క నెలలో కూడా ఇళ్లకు వెళ్లి పింఛన్ నగదు పంపిణీ చేయలేదు. మంగళవారం కుండలాయిగొంది గ్రామానికి చెందిన వృద్ధులు దిప్పల సున్నో, సుందరమ్మ, జిమ్మెలు పింఛన్ కోసం గ్రామాల నుంచి పది కిలోమీటర్లు నడుచుకుంటూ గ్రామ సచివాలయానికి వచ్చి ఏప్రిల్ నెల పింఛన్ తీసుకున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ సచివాలయం ఉద్యోగులు సచివాలయంలో మాత్రమే పింఛన్ నగదు ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంత రోజు మాత్రమే తమ గ్రామాలకు ప్రైవేటు వాహనాలు వస్తాయని, మిగిలిన రోజుల్లో కాలినడకన తప్ప పొరుగు గ్రామాలకు వెళ్లే మార్గంలేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి లబ్ధిదారుల ఇళ్లకు వచ్చి పింఛన్ నగదు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.