Share News

వర్షం...సేదతీరిన జనం

ABN , Publish Date - Apr 09 , 2025 | 01:05 AM

నగరంలోని అనేక ప్రాంతాల్లో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

వర్షం...సేదతీరిన జనం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని అనేక ప్రాంతాల్లో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మద్దిలపాలెం, అక్కయ్యపాలెం, ఇసుకతోట, బీచ్‌ రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్‌ తదితర ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. గడిచిన కొద్దిరోజులుగా ఎండ, ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు ఈ వర్షం సాంత్వన చేకూర్చింది. వర్షం తరువాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.


ఎన్‌టిఆర్‌ వైద్య సేవలు పునఃప్రారంభం

సమ్మె విరమించిన నెట్‌వర్క్‌ ఆస్పత్రులు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి):

నెట్‌వర్క్‌ ఆస్పత్రులు మంగళవారం నుంచి యథావిధిగా ‘ఎన్‌టీఆర్‌ వైద్య సేవ’లు అందించాయి. నెట్‌వర్క్‌ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు 108 ఉండగా...వాటిలో 27 ఆస్పత్రులు బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం సేవలు నిలిపివేశాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లోని ఆస్పత్రులు సేవలను నిలిపివేయడంతో సోమవారం రాత్రి ఆస్పత్రుల అసోసియేషన్‌ ప్రతినిధులతో ఆరోగ్య శాఖ అధికారులు చర్చలు జరిపారు. ఈ మేరకు ఆస్పత్రులకు బకాయిల నిమిత్తం ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల చేసింది. అందులో జిల్లాలోని ఆస్పత్రులకు సుమారు రూ.50 నుంచి 80 కోట్లు వరకూ వస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి అన్ని ఆస్పత్రులు ఎన్‌టీఆర్‌ వైద్య సేవ పథకంలో భాగంగా సేవలను అందించాయి.


కి‘లేడీ’

తక్కువ ధరకే స్థలాల పేరుతో మోసం

నగరంలోని వివిధ ప్రాంతాల్లో బాధితులు

భీమిలి వాసి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

ఎంవీపీ కాలనీ, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి):

ఆదాయ పన్ను అధికారినని, చాలా ధనవంతురాలినని, తన సొమ్ము రూ.వంద కోట్లు సీబీఐ స్వాధీనం చేసుకుందని కథలు అల్లుతూ ఓ కి‘లేడీ’ జనాన్ని మోసగించింది. భీమిలి, పెందుర్తి, తగరపువలస, మద్దిలపాలెం తదితర ప్రాంతాల్లో ఈమె పలువురిని మోసం చేసినట్టు తెలిసింది. భీమిలి సంగివలస కాలనీకి చెందిన అత్తిలి తరుణ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు ఆమెపై ఎంవీపీ పోలీసులు కేసు నమోదుచేశారు. సీఐ మురళి తెలిపిన వివరాలిలా ఉన్నాయి...

భీమిలిలోని తరుణ్‌కుమార్‌ ఇంటి పక్కన 2020లో దేవీరావు అనే మహిళ ఇంటిని అద్దెకు తీసుకుంది. ఆమెకు గేదెల సన్యాసప్పడు అనే సహాయకుడు ఉండేవాడు. అతడితో కలిసి తక్కువ ధరకు స్థలాలు ఇస్తానంటూ ఆమె ప్రచారం చేసుకుంది. ఈ మేరకు భూములకు చెందిన నకిలీ డాక్యుమెంట్లు చూపించింది. ఆమె మాటలను నమ్మిన తరుణ్‌కుమార్‌ 2021, 2023 మధ్య కాలంలో ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లలో రూ.15 లక్షలు చెల్లించాడు. గత ఏడాది ఏడాది జనవరి ఒకటో తేదీన ఎంవీపీ కాలనీ టీటీడీ సర్కిల్‌ సమీపానున్న ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద కొంత సొమ్ము ముట్టజెప్పాడు. అయినప్పటికీ స్థలం రిజిస్ట్రేషన్‌ చేయకపోవడంతో, తన డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో తన సొమ్ము రూ.100 కోట్లు సీబీఐ ఆధీనంలో ఉండిపోయిందని, అది విడుదలైన తర్వాత సొమ్ముకు రెట్టింపు ఇస్తానని, మరో రూ.3 లక్షలు ఇవ్వాలని అడిగింది. దీంతో తనను మోసం చేసిందని గ్రహించిన తరుణ్‌ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా దేవీరావు పెందుర్తిలోని ఎం.సతీష్‌ అనే వ్యక్తి నుంచి, తగరపువలసలో వెంకటలక్ష్మి, మద్దిలపాలెం వాసి శ్యామ్‌కుమార్‌ నుంచి కూడా కొంత మొత్తాన్ని వసూలు చేసినట్టు బయటపడింది. దీంతో ఆమె బాధితులు మరింత మంది ఉండవచ్చునని భావించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 09 , 2025 | 01:05 AM