పాఠశాలల పునర్వ్యవస్థీకరణ
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:54 AM
జిల్లాలో పాఠశాలల పునర్వ్యవస్థీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం 562 స్కూళ్లు (86 ఉన్నత, 29 ప్రాథమికోన్నత, 453 ప్రాథమిక పాఠశాలలు) ఉండగా, కొత్త విధానంలో 568 (28 ఫౌండేషన్ పాఠశాలలు, 242 బేసిక్ ప్రాథమిక పాఠశాలలు, 186 ఆదర్శ పాఠశాలలు, 20 యూపీ పాఠశాలలు, 92 ఉన్నత పాఠశాలలు) కానున్నాయి.

562 నుంచి 568కు పెంపు
28 ఫౌండేషన్ పాఠశాలలు
242 బేసిక్ ప్రాథమిక పాఠశాలలు
186 ఆదర్శ పాఠశాలలు
20 యూపీ పాఠశాలలు
92 ఉన్నత పాఠశాలలు
11 గ్రామాల్లో హైస్కూళ్లలోనే బేసిక్ ప్రాథమిక పాఠశాలలు
పూర్తయిన విద్యా శాఖ కసరత్తు
విశాఖపట్నం, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో పాఠశాలల పునర్వ్యవస్థీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం 562 స్కూళ్లు (86 ఉన్నత, 29 ప్రాథమికోన్నత, 453 ప్రాథమిక పాఠశాలలు) ఉండగా, కొత్త విధానంలో 568 (28 ఫౌండేషన్ పాఠశాలలు, 242 బేసిక్ ప్రాథమిక పాఠశాలలు, 186 ఆదర్శ పాఠశాలలు, 20 యూపీ పాఠశాలలు, 92 ఉన్నత పాఠశాలలు) కానున్నాయి. ఉన్నత పాఠశాలల సంఖ్య 92కు చేరనుండగా, యూపీ పాఠశాలల సంఖ్య ఇరవైకి తగ్గనున్నది. అలాగే ప్రతి పంచాయతీ/వార్డులో ఒకటి అంతకంటే ఎక్కువ ఆదర్శ పాఠశాలలు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు విద్యా శాఖ కసరత్తు పూర్తిచేసింది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం అమలులోకి వస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతులు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత జిల్లాలో 28 ప్రాథమిక పాఠశాలలను ఫౌండేషన్ స్కూళ్లుగా మార్పుచేశారు. ఇక్కడ పూర్వ ప్రాథమిక విద్య (ఎల్‌కేజీ, యూకేజీ), ఒకటి, రెండు తరగతులు ఉంటాయి. 30 మంది వరకూ ఒకరే ఉపాధ్యాయుడు ఉంటారు. అయితే అంగన్‌వాడీ కేంద్రాన్ని ఫౌండేషన్ స్కూలులో విలీనం చేస్తే అంగన్‌వాడీ టీచర్ సేవలు తీసుకుంటారు. ఇంకా 242 బేసిక్ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుకు నిర్ణయించారు. బేసిక్ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ బోధన చేస్తారు. ఈ పాఠశాలల్లో 20 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు, అంతకు మించి ఉంటే రెండో ఉపాధ్యాయుడిని నియమిస్తారు.
ఇక పాఠశాలల పునర్వ్యవస్థీకరణలో కీలకమైనవిగా పేర్కొంటున్న ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు 186 ఏర్పాటుకానున్నాయి. కనీసం 60 మంది విద్యార్థులు ఉండాలన్న నిబంధనను సడలించి 45 మంది ఉన్నా పరిగణనలోకి తీసుకోవాలని యాజమాన్య కమిటీలు కోరాయి. ముందుగా ప్రతి పంచాయతీ/వార్డుకు ఒక ఆదర్శ పాఠశాల ఏర్పాటుచేయాలని భావించారు. జిల్లాలో 79 గ్రామ పంచాయతీలు, జీవీఎంసీలో 98 వార్డులు ఉన్నాయి. దీని ప్రకారం 177 పాఠశాలలు రావాలి గాని నగర పరిధిలో కొన్ని వార్డుల్లో రెండేసి ఆదర్శ పాఠశాలలను ఏర్పాటుచేయనున్నారు. అయితే 45 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న కొన్ని పంచాయతీలల్లో మాత్రం ఏర్పాటుచేయడం వీలుకాలేదు. ఆదర్శ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధన చేస్తారు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటారు. జిల్లాలో ఇప్పటివరకూ 29 యూపీ పాఠశాలలు ఉండగా వాటి సంఖ్య 20కు కుదించారు. పాఠశాలల పునర్వ్యవస్థీకరణలో నిబంధనల ప్రకారం యూపీ పాఠశాలలను రద్దుచేయాలి. ఎక్కడైనా ఉన్నత పాఠశాలలకు దూరంగా ఉంటే మాత్రమే అక్కడ మినహాయింపు ఇవ్వాలి. పద్మనాభం, భీమిలి మండలాల్లో గల 20 యూపీ పాఠశాలల రద్దును ఆయా గ్రామాల ప్రజలు వ్యతిరేకించడంతో వాటిని కొనసాగించాలని నిర్ణయించారు. మరో మూడు యూపీ పాఠశాలలను రద్దు చేసి వాటిని ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా మార్పు చేయగా, ఆరు స్కూళ్లను ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేశారు. నగరంలో బుచ్చిరాజుపాలెం, ముస్లింతాటిచెట్లపాలెం, డాబాగార్డెన్స్‌తోపాటు మరో మూడు యూపీ పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా మారుస్తున్నారు. తాజా నిర్ణయంతో ఉన్నత పాఠశాలల సంఖ్య 86 నుంచి 92కు పెరిగింది. అలాగే గత ప్రభుత్వంలో ఉన్నత పాఠశాలలకు తరలించిన 3,4,5 తరగతులను వెనక్కి తీసుకువచ్చారు. కానీ 11 చోట్ల మాత్రం తరగతుల షిఫ్టింగ్‌ను తల్లిదండ్రులు వ్యతిరేకించారు. ఆ పదకొండుచోట్ల కూడా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం పిల్లల సంఖ్య 30కు అటుఇటుగా ఉండడంతో వాటిని అదే గ్రామంలో ఉన్న హైస్కూలులోనే కొనసాగిస్తారు. వీరి కోసం ప్రత్యేకించి బేసిక్ పాఠశాలలు ఏర్పాటుచేసి ఉన్నత పాఠశాలల టీచర్లతో బోధన అందిస్తారు.
ఒక్క పాఠశాల కూడా మూతపడదు
ఎన్.ప్రేమ్‌కుమార్, డీఈవో, విశాఖ
జిల్లాలో పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ముగిసింది. దీని ప్రకారం పాఠశాలలు 568కు పెరిగాయి. ఈ ప్రక్రియ కోసం పాఠశాల యాజమాన్య కమిటీల అభిప్రాయాలు తీసుకున్నాం. అందుకే ఇరవై చోట్ల యూపీ స్కూళ్లు కొనసాగించాలని నిర్ణయించాం. జిల్లాలో ఒక్క పాఠశాల కూడా మూతపడడం లేదు. తక్కువమంది పిల్లలున్నచోట్ల ఫౌండేషన్ స్కూళ్లు ఏర్పాటుచేస్తున్నాం.