శ్రమదానంతో రహదారి పనులు
ABN , Publish Date - Apr 14 , 2025 | 11:16 PM
మండలంలోని మూలపేట పంచాయతీ జాజులబంధ గ్రామస్థులు తమ గ్రామానికి రహదారి కోసం శ్రమదానం చేశారు. కిలోమీటరు మేర మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అధికారులు పట్టించుకోకపోయినా గ్రామస్థులంతా ఏకమై తాత్కాలికంగా రోడ్డు పనులు చేసుకున్నారు.

అధికారులు పట్టించుకోకపోయినా నడుంకట్టిన జాజులబంధ గ్రామస్థులు
కొయ్యూరు, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): మండలంలోని మూలపేట పంచాయతీ జాజులబంధ గ్రామస్థులు తమ గ్రామానికి రహదారి కోసం శ్రమదానం చేశారు. కిలోమీటరు మేర మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అధికారులు పట్టించుకోకపోయినా గ్రామస్థులంతా ఏకమై తాత్కాలికంగా రోడ్డు పనులు చేసుకున్నారు.
కొండపై ఉన్న జాజులబంధ గ్రామంలో కోందు జాతికి చెందిన 30 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ గ్రామానికి చేరుకోవాలంటే అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అర్ల గ్రామం నుంచి పిత్రిగెడ్డ మీదుగా రావాలి. ఈ గ్రామానికి 2023లో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగ పర్యవేక్షణలో రహదారి నిర్మాణానికి ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం కింద కోటి రూపాయలు మంజూరయ్యాయి. అయితే కేవలం రూ.28 లక్షల వ్యయంతో నాలుగు కల్వర్టులు నిర్మించి పనులు నిలిపివేశారు. గత డిసెంబరు నెలలో అనకాపల్లి కలెక్టర్ ఈ ప్రాంతంలో పర్యటించి అర్ల నుంచి పిత్రిగెడ్డకు రహదారి నిర్మాణానికి వీలుగా రూ.4.10 కోట్లు మంజూరు చేయగా, మట్టి పనులు పూర్తయ్యాయి. అయితే పిత్రిగెడ్డ నుంచి జాజులబంధకు కనీసం మట్టి పనులు సైతం నిర్వహించకపోవడంతో కిలోమీటరు మేర ప్రయాణం నరకంగా మారింది. దీంతో జాజులబంధకు చెందిన 30 కుటుంబాల వారు మూడు రోజుల పాటు శ్రమదానం చేసి రహదారి మరమ్మతులు చేసుకున్నారు. దీనిపై గ్రామస్థులు తాంబేలి వెంకటరావు, కొర్ర కామేశ్, తదితరులు మాట్లాడుతూ జాజులబంధకు శాశ్వత రహదారి నిర్మాణానికి కలెక్టర్, ఐటీడీఏ పీవో చర్యలు తీసుకోవాలని కోరారు.