దర్జాగా ఇసుక దోపిడీ
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:41 AM
రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన ఇసుకను తక్కువ ధరకు అందరికీ అందుబాటులోకి తెచ్చినప్పటికీ నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. సొంత అవసరాల కోసం సమీపంలోని నదులు, గెడ్డల్లో నుంచి ఉచితంగా ఇసుక తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును కొంతమంది వ్యక్తులు వ్యాపారంగా మార్చుకున్నారు.

లక్కవరం వద్ద శారదా నదిలో అక్రమ తవ్వకాలు
రేయింబవళ్లు లారీలు, ట్రాక్టర్లతో విశాఖ తరలింపు
చోద్యం చూస్తున్న రెవెన్యూ, పోలీసు అధికారులు
అక్రమ ఇసుక తవ్వకాలతో.. ప్రభుత్వ డిపోలో మందకొడిగా అమ్మకాలు
చోడవరం, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన ఇసుకను తక్కువ ధరకు అందరికీ అందుబాటులోకి తెచ్చినప్పటికీ నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. సొంత అవసరాల కోసం సమీపంలోని నదులు, గెడ్డల్లో నుంచి ఉచితంగా ఇసుక తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును కొంతమంది వ్యక్తులు వ్యాపారంగా మార్చుకున్నారు. చోడవరం మండలంలోని నదుల్లో ఇసుక తవ్వి, ట్రాక్టర్ల ద్వారా ఎక్కడో 80 కిలోమీటర్ల దూరంలో వున్న విశాఖపట్నం తరలిస్తున్నారు. మధ్యలో ఒక్కచోట కూడా ఆయా మండలాల అధికారులు పట్టుకున్న దాఖలాలు లేవు. చోడవరం మండలం లక్కవరం పంచాయతీ పరిధిలోని శారదా నదిలో కొద్దిరోజులుగా విశాఖ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఎక్స్‌కవేటర్లతో ఇసుకను తవ్వించి లారీలు, ట్రాక్టర్లతో దర్జాగా తరలించుకుపోతున్నారు. రెవెన్యూ అధికారులుగానీ, పోలీసులుగానీ పట్టించుకోకపోవడం పలు అనుమాలకు తావిస్తున్నది. లక్కవరంతోపాటు పక్కనే వున్న కె.కోటపాడు మండలం చౌడువాడ సరిహద్దుల్లో కొద్దిరోజుల నుంచి పగలు, రాత్రి అన్న తేడాలేకుండా ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. తాము అభ్యంతరం చెప్పినప్పటికీ ఖాతరు చేయకపోవడంతో బుధవారం 16 ట్రాక్టర్లను పట్టుకుని, రెవెన్యూ సిబ్బందికి అప్పగించామని, కానీ కొంతపేపటి తరువాత విడచిపెట్టేశారని వారు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ ఇసుక డిపోలో అరకొరగా అమ్మకాలు
మండలంలోని ముద్దుర్తి జంక్షన్ సమీపంలో ప్రభుత్వం సుమారు నెల రోజుల క్రితం ఇసుక డిపోను ప్రారంభించింది. టన్నుకు రూ.1,100 చొప్పున ఆన్‌లైన్‌లో చెల్లించి, ఇక్కడి నుంచి ఇసుక తీసుకెళ్లవచ్చు. పెద్దమొత్తంలో ఇసుక నిల్వలు వున్నప్పటికీ రోజుకు పది టన్నుల ఇసుక కూడా అమ్ముడు పోవడంలేదు. సమీపంలోని నదులు, గెడ్డల్లో ఇసుక అక్రమ తవ్వకాలే ఇందుకు కారణమని స్థానికులు అంటున్నారు.