Share News

రిజిస్ట్రేషన్లకు స్లాట్‌ బుకింగ్‌

ABN , Publish Date - Apr 04 , 2025 | 01:34 AM

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇకపై రిజిస్ట్రేషన్లను స్లాట్‌ బుకింగ్‌ విధానం ద్వారా చేయాలని నిర్ణయించింది.

రిజిస్ట్రేషన్లకు స్లాట్‌ బుకింగ్‌

  • నేటి నుంచి ప్రారంభం

  • పది నిమిషాల్లో ప్రక్రియ పూర్తి

  • మొదట సూపర్‌ బజార్‌ కార్యాలయంలో...

  • దశల వారీగా అన్నిచోట్ల అమలు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి):

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇకపై రిజిస్ట్రేషన్లను స్లాట్‌ బుకింగ్‌ విధానం ద్వారా చేయాలని నిర్ణయించింది. పాస్‌పోర్టు సేవలకు ఎలాగైతే ఆన్‌లైన్‌లో ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకొని నిర్ణీత సమయానికి వెళుతున్నారో డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్లకూ అలాగే చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. దీనిని ప్రాథమికంగా జిల్లాకు ఒక కార్యాలయంలో శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్నారు. విశాఖ జిల్లాలో సూపర్‌ బజార్‌ ఆవరణలో ఉన్న ఆర్‌ఓను ఎంపిక చేశారు.

ఏమి చేయాలి?

డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలనుకునే వారు రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ఏ తేదీన వెళ్లాలనుకుంటున్నారో ఎంపిక చేసుకుంటే ఆ రోజు ఏ టైము అందుబాటులో ఉందో సూచిస్తుంది. దానిని సెలెక్ట్‌ చేసుకొని డాక్యుమెంట్లన్నీ అప్‌లోడ్‌ చేయాలి. ఫీజులన్నీ చెల్లించాలి. వాటిని సబ్‌ రిజిస్ట్రార్‌ పరిశీలించి ఓకే చేస్తారు. ఎంపిక చేసుకున్న తేదీన, సూచించిన సమయానికి సాక్షులతో వెళితే పది నిమిషాల్లో పని పూర్తి చేసేస్తారు. ఇప్పుడైతే గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. ఇకపై ఆ ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు.

స్లాట్‌ లేకుంటే సాయంత్రం 5.30 గంటల తరువాతే

సూపర్‌ బజారు ఆర్‌ఓలో రోజుకు 39 స్లాట్లు ఇస్తారు. స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికే రిజిస్ట్రేషన్లు చేస్తారు. ముందస్తు బుకింగ్‌ లేకుండా ఎవరైనా రిజిస్ట్రేషన్‌ కావాలనుకుంటే సాయంత్రం 5.30 గంటల తరువాతేనని డీఐజీ బాలకృష్ణ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. స్లాట్‌ బుకింగ్‌ కోసం కార్యాలయంలో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశామని చెప్పారు.

దశల వారీగా ఇతర కార్యాలయాల్లో...

ఈ స్లాట్‌ బుకింగ్‌ విధానం విజయవంతమైతే దశల వారీగా అన్ని కార్యాలయాల్లోను అమలు చేయాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ వారం రోజుల తరువాత మధురవాడలో, ఆ తరువాత ఇంకో కార్యాలయంలో ఇలా అన్నిచోట్ల స్లాట్‌ బుకింగ్‌ కిందకు తీసుకువస్తారు.

సర్వర్‌ తట్టుకుంటుందా?

రిజిస్ట్రేషన్ల శాఖకు సర్వర్‌ సమస్య ఉంది. ఇది ఆకస్మికంగా మొండికేస్తుంది. ఆధార్‌ డేటా అప్‌డేట్‌ కాదు. డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ కావు. ఇటువంటి పరిస్థితి వస్తే...స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న వారిని పని ఆ పది నిమిషాల్లో పూర్తి కాదు. అలాంటి వారు మళ్లీ రావాలనుకుంటే స్లాట్‌ రీ షెడ్యూల్‌ చేసుకోవలసి ఉంటుంది. దీనికి రూ.200 ఫీజు చెల్లించాలి. ప్రభుత్వం వల్ల జరిగిన జాప్యానికి తాము ఎందుకు ఫీజు కట్టాలని చాలామంది ప్రశ్నించే అవకాశం ఉంది. పైగా పది నిమిషాల్లో పూర్తవుతుందని హామీ ఇచ్చి, పని పూర్తి చేయకుండా వెనక్కి పంపించారనే విమర్శలు వస్తాయి. ఈ నేపథ్యంలో సర్వర సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఉంది.

Updated Date - Apr 04 , 2025 | 01:34 AM