పల్లెల్లో సౌర కాంతులు
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:58 AM
పర్యావరణ హితమైన సౌర విద్యుత్‌ను పల్లెల్లోనూ అందరికీ అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా జిల్లాలో తొలి విడతలో 5,708 ఇళ్లకు సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా చర్యలు చేపట్టింది.

- సౌర విద్యుత్ వినియోగం దిశగా ప్రభుత్వం అడుగులు
- జిల్లాలో తొలి దశలో ఐదు మోడల్ గ్రామాలు ఎంపిక
- తొలి విడత 5,708 ఇళ్లకు యూనిట్లు ఏర్పాటు
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
పర్యావరణ హితమైన సౌర విద్యుత్‌ను పల్లెల్లోనూ అందరికీ అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా జిల్లాలో తొలి విడతలో 5,708 ఇళ్లకు సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా చర్యలు చేపట్టింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆధ్వర్యంలో సౌర విద్యుత్‌ను గ్రామాలకు చేరువ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ముందుగా జిల్లాలో తొలిదశ కింద కశింకోట మండలం బయ్యవరం, సబ్బవరం మండలం గుల్లేపల్లి, మునగపాక మండలం తోటాడ, ఎస్.రాయవరం మండలం గుడివాడ, గొలుగొండ మండల కేంద్రాన్ని మోడల్ గ్రామాలుగా అధికారులు ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో సౌర విద్యుత్ వినియోగం, ఉత్పత్తిలో ఆదర్శంగా తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే గ్రామాలను ఎంపిక చేసిన జిల్లా ఏపీఈపీడీసీఎల్ అధికారులు ఆయా గ్రామాల్లో గృహాలు ఎన్ని?, సోలార్ విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేసేందుకు రూఫ్‌టాప్‌లు అనుకూలంగా ఉన్నాయా?, తదితర వివరాలను సేకరించి గ్రామాల్లో సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో ఎంపిక చేసిన ఐదు మోడల్ సౌర వినియోగ గ్రామాల్లో అధికారులు 5,708 గృహాలకు ముందుగా సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయా గ్రామాల్లో ఆన్‌లైన్ ద్వారా ఇప్పటి వరకు 1,814 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇప్పటి వరకు గుల్లుపల్లిలో 4, తోటాడలో 10, గుడివాడలో 1, గొలుగొండలో 1 చొప్పున మొత్తం 20 మంది గృహ లబ్ధిదారుల ఇళ్లపై వన్ కేవీ సౌర విద్యుత్ పలకలు అమర్చారు. మోడల్ గ్రామాల్లో మిగిలిన వారి రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వాలున్న మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేయనున్నారు. మిగిలిన లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు, సబ్సిడీలు అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. త్వరలో గృహ, ప్రభుత్వ కార్యాలయం, వ్యవసాయ బోర్లు సహా అన్నిటికీ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. గృహాలపై సోలార్ రూఫ్‌టాప్‌లు, వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. మోడల్ గ్రామాల్లో ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణ సదుపాయాన్ని కల్పించనున్నది. ఉదయం సమయంలో సౌర విద్యుత్, రాత్రి సమయంలో సాధారణ విద్యుత్‌ను వినియోగించేలా లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా మిగులు విద్యుత్‌ను యజమానులు ఏపీఈపీడీసీఎల్‌కు అమ్ముకొనే వెసులుబాటు కల్పించనున్నారు.
మోడల్ గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణ
పీఎం సూర్యఘర్ పథకాన్ని కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో ముందుగా ఐదు గ్రామాల్లో అమలు చేస్తున్నామని ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ జి.ప్రసాద్ ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు. ఆయా గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, దరఖాస్తులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో సంబంధిత గ్రామ సచివాలయాల ద్వారా అందజేయవచ్చని తెలిపారు. గృహావసరాలకు ఒక కిలోవాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున బ్యాంకు లింకేజీ రుణంతో పాటు రాయితీ వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.