Share News

రోడ్డునపడ్డ ఉక్కు కాంట్రాక్టు కార్మికులు

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:49 AM

స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం ప్రధానంగా సిబ్బందిని తగ్గించడంపైనే దృష్టి కేంద్రీకరించింది.

రోడ్డునపడ్డ ఉక్కు కాంట్రాక్టు కార్మికులు

బ్లాస్ట్‌ ఫర్నేస్‌, స్టీల్‌ మెల్టింగ్‌ షాప్‌, రా మెటీరియల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంటు, వైర్‌ రాడ్‌ మిల్స్‌, విభాగాల్లో 1,503 మంది తొలగింపు

సోమవారం అర్ధరాత్రి తరువాత విభాగాలకు జాబితాలు

సిబ్బందిని తగ్గించడంపైనే యాజమాన్యం దృష్టి

నేడు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్న సంఘ నాయకులు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం ప్రధానంగా సిబ్బందిని తగ్గించడంపైనే దృష్టి కేంద్రీకరించింది. మూడు రోజుల క్రితం 248 మంది కాంట్రాక్టు కార్మికుల పాస్‌లు రద్దు చేసిన యాజమాన్యం తాజాగా 1,503 మందిని తొలగిస్తున్నట్టు ఆయా విభాగాలకు తెలియజేసింది.

ప్లాంటులో సపోర్టింగ్‌ సిబ్బంది పేరుతో కాంట్రాక్టు కార్మికులను తీసుకోవడం ఎప్పటి నుంచో ఉంది. అయితే వారి సంఖ్యను 3,500 తగ్గించాలని ప్రస్తుతం సీఎండీ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా ఇటీవల 700 మంది పాస్‌లు రెన్యువల్‌ చేయలేదు. ఇలా వివిధ కారణాలతో సుమారుగా వేయి మందిని ప్లాంటుకు రాకుండా చేశారు. ఇప్పుడు బ్లాస్ట్‌ ఫర్నేస్‌, స్టీల్‌ మెల్టింగ్‌ షాప్‌, రా మెటీరియల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంటు, వైర్‌ రాడ్‌ మిల్స్‌, జనరల్‌ అడ్మిన్‌ విభాగాల నుంచి మరో 1,503 మందిని తొలగించారు. సోమవారం అర్ధరాత్రి తరువాత తొలగించిన కాంట్రాక్టు కార్మికుల జాబితాను ఆయా కాంట్రాక్టర్లకు యాజమాన్యం పంపించింది. అంటే ఏ విభాగంలో కూడా అధికారులకు సహాయక సిబ్బంది లేకుండా చేస్తున్నారు. ఇంకో వేయి మందిని తగ్గించాలనే ఆలోచనలో ఉన్నారు. యాజమాన్యం చర్యలను నిరసిస్తూ ఇటీవల కార్మికులు ఒక రోజు సమ్మె చేసినా ఫలితం లేకుండా పోయింది. కాగా కాంట్రాక్టు కార్మికుల తొలగింపుపై బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకులు తెలిపారు.

సీఐఎస్‌ఎఫ్‌ను తగ్గించి ఏపీఎస్‌పీఎఫ్‌కు బాధ్యతలు

స్టీల్‌ ప్లాంటు రక్షణలో కీలకంగా వ్యవహరించే సీఐఎస్‌ఎఫ్‌ను ఇటీవల నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని 450 మందిని చెన్నై, హైదరాబాద్‌లకు బదిలీ చేశారు. దాంతో రక్షణ కొరవడిందని ఆలస్యంగా గుర్తించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఏపీఎస్‌పీఎఫ్‌) ద్వారా కొంతమందిని నియమించుకోవాలని యత్నిస్తున్నారు. వారికి లేఖ రాయడంతో స్టీల్‌ ప్లాంటులో పనిచేయడానికి ఆసక్తి కలిగిన కమాండెంట్లు పేర్తు ఇవ్వాలని ఆ సంస్థ మంగళవారం ప్రకటన జారీ చేసింది. ఉన్న వారిని పంపించేసి కొత్త వారిని తెచ్చుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలని అధికారులు ప్రశ్నిస్తున్నారు.

కీలక సమావేశాల నిర్వహణకు పుల్‌స్టాప్‌

స్టీల్‌ప్లాంటులో ఏడాదికి రెండు సార్లు కీలక సమావేశాలు నిర్వహించి ఉద్యోగులలో స్ఫూర్తిని నింపి లక్ష్యం వైపు నడిపించడం ఆనవాయితీ. ప్రతి జనవరి 1, తేదీన, ఆర్థిక సంవత్సరం మొదటి తేదీ (ఏప్రిల్‌ 1)న డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ పైస్థాయి అధికారులతో సీఎండీ, డైరక్టర్లు ఉక్కు నగరం క్లబ్‌లో సమావేశమైన అప్పటివరకు ప్లాంటు సాధించిన ఉత్పత్తి, వచ్చిన లాభనష్టాలు, రాబోయే మూడు నెలలో చేయబోయే కీలక పనులు అన్నింటిపైనా చర్చిస్తారు. ఆ తరువాత వాటి వివరాలను ఆయా అధికారులు విభాగాల్లో సిబ్బందికి చెప్పి లక్ష్యం దిశగా పని చేయిస్తారు. అయితే ఈ సమావేశాలు ఏవీ గత ఏడాది నుంచి నిర్వహించడం లేదు. ముఖ్యంగా ఇన్‌ఛార్జి సీఎండీ అజయ్‌ సక్సేనా వచ్చినప్పటి నుంచి అధికారులతో ఏమీ చర్చించడం లేదు. ఏప్రిల్‌ 1న (మంగళవారం) ఆయన విశాఖపట్నంలోనే లేకుండా వెళ్లిపోయారు. ఫిబ్రవరి 18న ఉక్కు వ్యవస్థాపక దినం. ఆ రోజున బాగా పనిచేసిన వారికి నెహ్రూ అవార్డులు ఇస్తుంటారు. ఈసారి అది కూడా చేయలేదు.

Updated Date - Apr 02 , 2025 | 12:49 AM