Share News

పింఛన్‌ సొమ్ముతో సర్వేయర్‌ పేకాట

ABN , Publish Date - Apr 04 , 2025 | 10:25 PM

మండలంలోని తాజంగి గ్రామ సర్వేయర్‌ పింఛన్‌ సొమ్ముతో పేకాట ఆడి నగదును పోగొట్టుకున్నాడు. దీంతో వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్‌ నగదు పంపిణీ చేయకుండా రెండు రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఎంపీడీవో శ్రీనివాస్‌ పోలీసులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

పింఛన్‌ సొమ్ముతో సర్వేయర్‌ పేకాట

రెండు రోజులు అజ్ఞాతంలోకి..

40 మంది వృద్ధులు, దివ్యాంగులకు అందని పింఛన్‌

పోలీసులు, కలెక్టర్‌కి ఫిర్యాదు చేసిన ఎంపీడీవో

చింతపల్లి, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తాజంగి గ్రామ సచివాలయం-2లో పనిచేస్తున్న గ్రామ సర్వేయర్‌ సాగిన రవికుమార్‌కు తన పరిధిలో ఉన్న 54మంది లబ్ధిదారులకు సంబంధించిన పింఛన్‌ నగదు రూ.2.46 లక్షలు మార్చి 29న వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ పాంగి చిలకమ్మ అందజేసింది. గ్రామ సర్వేయర్‌ పింఛన్‌ నగదు తీసుకొని ఓ గ్రామదేవత జాతరకు వెళ్లి పేకాట ఆడి నగదును పోగొట్టుకున్నాడు. ఏప్రిల్‌ ఒకటో తేదీన 14 మంది లబ్ధిదారులకు రూ.58 వేల పింఛన్‌ పంపిణీ చేసి, మరో 40 మంది వృద్ధులు, దివ్యాంగులకు పంపిణీ చేయకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో పింఛన్‌దారులు నగదు కోసం ఈనెల రెండో తేదీన పంచాయతీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు. మూడో తేదీ వరకు గ్రామ సర్వేయర్‌ జాడ తెలియకపోవడం, పింఛన్‌దారులకు నగదు పంపిణీ చేయకపోవడంతో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ స్థానిక ఎంపీడీవో యూఎస్‌వీ శ్రీనివాస్‌, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్వేయర్‌ శుక్రవారం ఉదయం వెల్ఫేర్‌ అసిస్టెంట్‌కి రూ.లక్ష నగదుని అందజేశాడు. మరో రూ.88 వేలు నగదు శనివారం అందజేస్తానని పోలీసుల ఎదుట అంగీకరించాడు. గ్రామ సర్వేయర్‌పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాస్‌ జిల్లా కలెక్టర్‌, డీఆర్‌డీఏ పీడీకి ఫిర్యాదు చేశారు. అలాగే గ్రామ సర్వేయర్‌కి షోకాజు నోటీసు జారీ చేశారు.

Updated Date - Apr 04 , 2025 | 10:25 PM