Share News

గిరిజన విద్యార్థుల ప్రతిభ అమోఘం

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:44 AM

గిరిజన విద్యార్థుల ప్రతిభ అమోఘమని, 108 సూర్య నమస్కారాల కార్యక్రమం ప్రపంచ రికార్డుగా నమోదు కావడం గర్వ కారణమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు.

గిరిజన విద్యార్థుల ప్రతిభ అమోఘం
ప్రపంచ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ అందిస్తున్న ప్రపంచ రికార్డు యూనియన్‌ మేనేజర్‌ అలీస్‌ రేనాడ్‌

108 సూర్య నమస్కారాలు కార్యక్రమం ప్రపంచ రికార్డుగా నమోదు కావడం గర్వకారణం

మంత్రి గుమ్మడి సంధ్యారాణి

అరకులోయ, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): గిరిజన విద్యార్థుల ప్రతిభ అమోఘమని, 108 సూర్య నమస్కారాల కార్యక్రమం ప్రపంచ రికార్డుగా నమోదు కావడం గర్వ కారణమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. అరకులోయ డిగ్రీ కళాశాల మైదానంలో కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 108 సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐదు మండలాల నుంచి సుమారు 60 పాఠశాలల నుంచి 21,850 మంది విద్యార్థిని, విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం రాత్రి 7.30 గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు ఎందులోనూ తీసిపోరని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ మాట్లాడుతూ యోగ సాధన ద్వారా విద్యార్థుల్లో పఠనాశక్తి, శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడతాయన్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులను ప్రత్యేక బస్సుల్లో వసతి గృహాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌, ఆర్టీసీ విజయనగరం జోన్‌ రీజియన్‌ చైర్మన్‌ సివేరి దొన్నుదొర, జేసీ అభిషేక్‌గౌడ్‌, సబ్‌ కలెక్టర్‌ శౌర్యమన్‌పటేల్‌, ఎస్పీ అమిత్‌బర్ధార్‌, జిల్లా రెవెన్యూ అధికారి పద్మాలత, గిరిజన సంక్షేమశాఖ డీడీ రజిని, గురుకులం సెల్‌ ఇన్‌చార్జి మూర్తి, జనసేన అరకు పార్లమెంట్‌ ఇన్‌చార్జి గంగులయ్య, ట్రైకార్‌ డైరెక్టర్‌ కూడ కృష్ణారావు, కాఫీబోర్డు డైరెక్టర్‌ కురసా ఉమామహేశ్వరావు, సర్పంచ్‌ దాసుబాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 12:44 AM