Share News

ఇదేం సంత!

ABN , Publish Date - Apr 06 , 2025 | 12:56 AM

నర్సీపట్నం - చింతపల్లి రోడ్డులో డిగ్రీ కాలేజీ దగ్గర ఉన్న కూరగాయల మార్కెట్‌ కారణంగా సామాన్య ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శనివారం సంత రోజు కావడంతో ఆటోలు, బైక్‌లు, లారీలు, కార్లుతో ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమైంది. నేల దుకాణాలు మెయిన్‌ రోడ్డు మీద ఉండడంతో ద్విచక్ర వాహనాల రాకపోకలకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఇదేం సంత!
డిగ్రీ కళాశాల వైపు శనివారం ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనాలు

- నర్సీపట్నం - చింతపల్లి రోడ్డులో శనివారం సంతతో ట్రాఫిక్‌ కష్టాలు

- వాహనచోదకులకు తప్పని ఇబ్బందులు

నర్సీపట్నం, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం - చింతపల్లి రోడ్డులో డిగ్రీ కాలేజీ దగ్గర ఉన్న కూరగాయల మార్కెట్‌ కారణంగా సామాన్య ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శనివారం సంత రోజు కావడంతో ఆటోలు, బైక్‌లు, లారీలు, కార్లుతో ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమైంది. నేల దుకాణాలు మెయిన్‌ రోడ్డు మీద ఉండడంతో ద్విచక్ర వాహనాల రాకపోకలకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కరోనా సమయంలో నర్సీపట్నం ఇందిరా మార్కెట్లోని కూరగాయల వ్యాపారులను కొంతమందిని ఇక్కడకు, పెదబొడ్డేపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ రైతు బజార్‌ ప్రాంగణంలోకి కొంతమందిని తరలించారు. కొవిడ్‌ తరువాత కూరగాయల వ్యాపారులను, రైతులను ఇందిరా మార్కెట్లోకి తీసుకు రాలేదు. దీని వల్ల ఇందిరా మార్కెట్‌ ఆసీలు ఆదాయం పోయింది. మెయిన్‌ రోడ్డులో కూరగాయల దుకాణాలు నిర్వహించడం వల్ల వాహనాల రాకపోకల సమయంలో ట్రాఫిక్‌ నిలిచిపోయి, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడకు సమీపంలోనే కోర్టు సముదాయం ఉంది. ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాలలు, అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలు ఉన్నాయి. ట్రాఫిక్‌ సమస్య వలన వేలాది మంది విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. కోర్టుకి వెళ్లేటప్పుడు న్యాయమూర్తులు, న్యాయవాదులు, క్షక్షిదారులు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. అయ్యన్నకాలనీ, నీలంపేట, గబ్బాడ ప్రజలు ఏ చిన్న అవసరం పడినా నర్సీపట్నం రావలసిందే. డిగ్రీ కాలేజీ దగ్గర రోడ్డుకి ఇరువైపులా ఉన్న కూరగాయల దుకాణాలు వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత నెలలో జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో 9వ వార్డు కౌన్సిలర్‌ అద్దెపల్లి సౌజన్య ఈ విషయంపై అధికారులను నిలదీశారు. కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకొని ఇందిరా మార్కెట్లో ఉన్న కూరగాయల దుకాణాలను తరలించారని, తరువాత యథావిధిగా ఇందిరా మార్కెట్లోకి ఎందుకు తీసుకు రాలేదని ప్రశ్నించారు. అయినా ఎటువంటి మార్పు రాలేదు. ఉన్నతాధికారులు సరైన నిర్ణయం తీసుకొని మెయిన్‌ రోడ్డులో నిర్వహిస్తున్న కూరగాయల మార్కెట్‌ను ఇందిరా మార్కెట్‌లోకి తరలించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Apr 06 , 2025 | 12:56 AM