ఉపాధి హామీలో అగ్రస్థానం
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:23 AM
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లో రాష్ట్రంలోనే జిల్లా టాప్‌లో నిలిచింది. 2024- 25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పథకంలో చేపట్టిన అనేక పనులు లక్ష్యాన్ని అధిగమించడంతో పాటు మంజూరైన నిధుల వ్యయంలోనూ జిల్లా ముందంజలో ఉండడంతో రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. దీనికి సంబంధించిన వివరాలను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల అధికారులకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

- అనేక అంశాల్లో టాప్‌లో నిలిచిన జిల్లా
- అత్యధికంగా 69 వేల 62 కుటుంబాలకు వంద రోజుల పని కల్పన
- 10,939 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు
- లక్ష్యం లక్షా 48 వేల పని దినాలు.. కల్పించింది లక్షా 61 వేలు
- 2024- 25 ఆర్థిక సంవత్సరంలో రూ.737 కోట్ల 32 లక్షలు వ్యయం
- అధికారులకు అభినందనలు తెలిపిన కలెక్టర్
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లో రాష్ట్రంలోనే జిల్లా టాప్‌లో నిలిచింది. 2024- 25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పథకంలో చేపట్టిన అనేక పనులు లక్ష్యాన్ని అధిగమించడంతో పాటు మంజూరైన నిధుల వ్యయంలోనూ జిల్లా ముందంజలో ఉండడంతో రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. దీనికి సంబంధించిన వివరాలను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల అధికారులకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
జిల్లాలో ఉపాధి హామీ పథకంలో 69 వేల 62 కుటుంబాలకు వంద రోజుల పనిని కల్పించారు. దీంతో రాష్ట్రంలోనే అత్యధిక కుటుంబాలకు 100 రోజుల పని దినాలు, ప్రతి కూలీకి సగటున 75 రోజులు పని కల్పించినందుకు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. గిరిజన రైతులకు ఆదాయానిచ్చే ఉద్యానవన పంటల సాగు సైతం అత్యధికంగా 10 వేల 939 ఎకరాల్లో చేపట్టడంతో రాష్ట్రంలో తొలి స్థానం సాధించింది. అలాగే నిర్దేశించిన లక్షా 48 వేల పని దినాలకు గానూ లక్ష్యాన్ని మించి లక్షా 61 వేల పని దినాలను కల్పించారు. ఈ విభాగంలో రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. అలాగే సగటు రోజు కూలీ సైతం రూ.263 చెల్లించి రాష్ట్రంలో 8వ స్థానంలో ఉంది. 2024- 25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.737 కోట్ల 32 లక్షలు వ్యయం చేయగా, దానిలో రూ.421 కోట్ల 94 లక్షలు వేతన రూపంలో, రూ.301 కోట్ల 30 లక్షలు మెటీరియల్ రూపంలో, మరో రూ.14 కోట్లు అడ్మినిస్ట్రేషన్‌కు వ్యయం చేశారు.
ప్రభుత్వ ప్రాధాన్యతా పనుల్లో ప్రగతి
ఉపాధి హామీ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతగా భావించే పలు పనుల్లో జిల్లాలో చక్కని ప్రగతి సాధించారు. ముఖ్యంగా పంట సంజీవనిలో భాగంగా జిల్లాలో 2,451 పంట కుంటలు, 13 వేల 609 ఇంకుడు గుంతలను నిర్మించడంతో ఈ రెండు విభాగాల్లో రాష్ట్రంలో జిల్లాకు మొదటి స్థానం దక్కింది. అలాగే పల్లె పండుగ కార్యక్రమంలో 55 పశువుల షెడ్‌లు, రూ.250 కోట్ల వ్యయంతో సిమెంట్ కాంక్రీట్ రోడ్లు, తారురోడ్లు, మెటల్ రోడ్లు నిర్మించారు. కాగా 2025- 26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో 500 పశువుల నీటి తొట్టెలు, వాన నీటి సంరక్షణ, వ్యవసాయానికి అనువుగా ఉండే పంట కుంటలను 8 వేలు నిర్మిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఉపాధి కూలీల వేతనం సైతం రూ.307లకు పెరిగేలా ప్రయత్నాలు చేస్తామని, ప్రభుత్వ ప్రాధాన్యతా పనులకు ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉపాధి హామీ పథఽకంలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచేందుకు కృషి చేసిన అందరికీ ఆయన అభినందనలు తెలిపారు.