Share News

పెనువిషాదం

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:42 AM

బాణసంచా తయారీ కేంద్రాలు తరచూ కార్మికుల ప్రాణాలు బలిగొంటున్నాయి. అనుమతులు, సరైన భద్రతా చర్యలు లేకుండా నిర్వహించడం, అనుభవం లేని వారితో పనులు చేయించడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో అనకాపల్లి జిల్లాలోని కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఆదివారం సంభవించిన అగ్ని ప్రమాదం ఎనిమిది నిండు ప్రాణాలను బలిగొనగా, మరో ఎనిమిది మందిని తీవ్రగాయాలకు గురిచేసింది.

   పెనువిషాదం
మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సబ్యులు

మృతుల వివరాలివి

కైలాసపట్నం విజయలక్ష్మి గణేష్‌ ఫైర్‌వర్క్స్‌లో ఆదివా రం అగ్ని ప్రమాదం సంభవించే సమయానికి మొత్తం 16 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. వారిలో రాజుపాలేనికి చెందిన దాడి రామలక్ష్మి (35), కైలాసపట్నానికి చెందిన పురం పాప (40), గుంపిన వేణుబాబు (34), సంగరాతి గోవిందు (40), అప్పికొండ పుల్లయ్య (50), చౌడువాడకు చెందిన సేనాపతి బాబూరావు (55), దేవర నిర్మల (38), భీమిలికి చెందిన హేమంత్‌ (20) మృతి చెందారు.

క్షతగాత్రుల వివరాలు...

ఈ ప్రమాదంలో రాట్నాలపాలేనికి చెందిన జల్లూరు నాగరాజు, కైలాసపట్నానికి చెందిన సియాద్రి గోవింద్‌, మడగల జానకిరామ్‌, గంపెన సూరిబాబు, ఎస్‌.శ్రీను, సామర్లకోటకు చెందిన వేలంగి సంతోషి, వేలంగి సారోని, వేలంగి రాజు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కోటవురట్ల మండలం కైలాసపట్నం

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు

ఎనిమిది మంది కార్మికులు దుర్మరణం

మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణం

జిల్లాలో ఆరు బాణసంచా తయారీ కేంద్రాలకు మాత్రమే అనుమతి

అనుమతి లేకుండానే నడుస్తున్నవి ఎన్నో...

ప్రమాదాలు జరిగినప్పుడే అధికారుల హడావిడి

(అనకాపల్లి, కోటవురట్ల-ఆంధ్రజ్యోతి)

బాణసంచా తయారీ కేంద్రాలు తరచూ కార్మికుల ప్రాణాలు బలిగొంటున్నాయి. అనుమతులు, సరైన భద్రతా చర్యలు లేకుండా నిర్వహించడం, అనుభవం లేని వారితో పనులు చేయించడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో అనకాపల్లి జిల్లాలోని కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఆదివారం సంభవించిన అగ్ని ప్రమాదం ఎనిమిది నిండు ప్రాణాలను బలిగొనగా, మరో ఎనిమిది మందిని తీవ్రగాయాలకు గురిచేసింది. మండలంలోని కైలాసపట్నం శివారున ఉన్న విజయలక్ష్మి గణేష్‌ ఫైర్‌ వర్క్స్‌లో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భారీ పేలుళ్లు సంభవించడంతో కార్మికులు హాహాకారాలతో పరుగులు తీశారు. ఎగసిపడిన మంటలు, గ్రామాన్ని కమ్ముకున్న దట్టమైన పొగతో భీతిల్లిన జనం ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

అనుభవం లేని కార్మికులతో విజయలక్ష్మి గణేష్‌ ఫైర్‌ వర్క్స్‌లో బాణసంచా తయారు చేయించడమే ప్రమాదానికి కారణమని తెలిసింది. ఒక వివాహానికి తారాజువ్వలు, బాంబుల సరఫరాకు భారీగా ఆర్డరు తీసుకున్న నిర్వాహకుడు అనుభవం లేని వారితో వాటిని తయారు చేయిస్తుండగా, మందులు కలపడంలో జరిగిన పొరపాటు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదించారు. కాగా ఫైర్‌ వర్క్స్‌ యాజమాని నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కైలాసపట్నం శివారున ఉన్న బాణసంచా కేంద్రానికి 2026 వరకు అనుమతులు న్నాయని అధికారులు చెబుతున్నా, అగ్నిమాపక శాఖ నుంచి 2024 తరువాత రెన్యువల్‌ కోసం నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) పొందలేదని తెలుస్తోంది. ప్రమాదకరమైన పేలుడు సామగ్రి తయారుచేసే ఈ కేంద్రంలో పరిశ్రమల శాఖ నిబంధనల ప్రకారం కార్మికులకు తగిన రక్షణ చర్యలు లేవని అక్కడి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. భారీగా పేలుడు పదార్థాలు నిల్వ చేసి, సామగ్రి తయారు చేస్తున్నా కనీసం బోర్డు కూడా ఏర్పాటుచేయలేదు. ఈ కేంద్రంలో ఫైర్‌ ఎక్విప్‌మెంట్‌ ఉందా, కార్మికులకు మందుగుండు సామగ్రి తయారీపై శిక్షణ ఇచ్చారా..? ముడి పదార్థాల నిల్వలు సురక్షితంగా ఉన్నాయా... అనే ప్రశ్నలకు జవాబు దొరకడం లేదు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు కూడా బాణసంచా కేంద్రానికి అనుమతులున్నాయా లేదా అనేది స్పష్టం చేయలేకపోతున్నారు.

మొక్కుబడి తనిఖీలు

వాస్తవానికి బాణసంచా కేంద్రాలను మండల రెవెన్యూ అధికారి సందర్శించి, ఇచ్చిన నివేదిక మేరకు ఆర్డీఓ స్థాయి అధికారి అనుమతులు జారీచేస్తారు. దీంతోపాటు పరిశ్రమలు, పర్యావరణ, అగ్నిమాపక శాఖలు ఏటా తనిఖీ చేసిన తరువాత మాత్రమే నిరభ్యంతర పత్రాలు ఇవ్వాలి. కాగా ఎలాంటి తనిఖీ చేయకుండానే నివేదికలు సమర్పించి మమ అనిపిస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రమాదం సంభవించిన గంటల తరువాత జిల్లా యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుంది. అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌సిన్హా, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి వెంకటరమణ తదితరులు ప్రమాద స్థలిని పరిశీలించారు.

కనిపించని పర్యవేక్షణ

జిల్లాలోని బాణసంచా తయారీకేంద్రాల్లో తరచూ ప్రమాదాలు జరగుతున్నా అధికారుల పర్యవేక్షణ కనిపించడం లేదు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారిక రికార్డుల ప్రకారం కోటవురట్ల మండలం కైలాసపట్నం, ఎండపల్లి, నర్సీపట్నం మండలం వేములపూడి, మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం, చోడవరం మండలం ఎంకేపాలెం, అచ్యుతాపురంలో మాత్రమే బాణసంచా తయారీ కేంద్రాలకు అనుమతులున్నాయి. అయితే అనధికారికంగా ప్రతి మండలంలో బాణసంచా తయారీ జరుగుతోంది.

ఉమ్మడి జిల్లాలోనూ సంఘటనలు

ఉమ్మడి విశాఖ జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాల్లో అనేక ప్రమాదాలు సంభవించాయి. 2011లో మొగలిపురంలో అనధికార బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన పేలుడులో ఇద్దరు మృతి చెందారు. 2019లో సబ్బవరం మండలం గుల్లిపల్లిలో అనధికార బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. జిల్లా పునర్విభజన తరువాత 2022 జూన్‌లో సబ్బవరం మండలం ఆరిపాకలో అనధికార బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి నలుగురు మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అనుమతులున్న వాటితో పాటు, అనధికార బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా చర్యలు శూన్యమనేది బహిరంగ రహస్యం. వీటిలో ప్రమాదాలు సంభవిస్తున్నా బయటకు పొక్కనీయడం లేదు.

విచారణకు ఆదేశం....

బాణసంచా ప్రమాద సంఘటనపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్‌, పలువురు మంత్రులు జిల్లా అధికారులతో మాట్లాడారు. ఎనిమిది మంది మృతిపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Apr 14 , 2025 | 12:42 AM