Share News

వెలుగు వీవో దారుణ హత్య

ABN , Publish Date - Apr 14 , 2025 | 11:18 PM

మండలంలోని గన్నెల పంచాయతీ డప్పుగుడ గ్రామంలో డీఆర్‌డీఏ వెలుగు వీవో గడబంటు భీమన్న సోమవారం దారుణ హత్యకు గురయ్యారు. ఉదయం గ్రామస్థులతో సమావేశం నిర్వహించడానికి వేచి ఉండగా ఈ సంఘటన జరిగింది.

వెలుగు వీవో దారుణ హత్య
హత్యకు గురైన గడబంటు భీమన్న (ఫైల్‌ ఫొటో)

ముగ్గురు కలిసి కత్తితో దాడి చేసి హతమార్చిన వైనం

డప్పుగుడ గ్రామంలో ఘటన

భీతిల్లిన గిరిజనులు

చిల్లంగి పెడుతున్నాడన్న అనుమానంతో హత్య చేశారని మృతుని భార్య ఆరోపణ

ఆర్థిక లావాదేవీలే కారణమని పాడేరు డీఎస్పీ వెల్లడి

అరకులోయ, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): మండలంలోని గన్నెల పంచాయతీ డప్పుగుడ గ్రామంలో డీఆర్‌డీఏ వెలుగు వీవో గడబంటు భీమన్న సోమవారం దారుణ హత్యకు గురయ్యారు. ఉదయం గ్రామస్థులతో సమావేశం నిర్వహించడానికి వేచి ఉండగా ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. దీనికి సంబంధించి మృతుని భార్య బృంద, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. డప్పుగుడ గ్రామంలో గడబంటు భీమన్న(40) వెలుగు వీవోగా పని చేస్తున్నారు. సోమవారం ఉదయం గ్రామస్థులతో సమావేశం నిర్వహించడానికి తన సోదరుడి ఇంటి బయట వాకిట్లో కూర్చొని గ్రామస్థుల రాక కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామానికి సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలిస్తున్నారు. సరిగ్గా ఉదయం 9 గంటల సమయంలో ఆ ఇంటి పక్కనే ఉంటున్న చిట్టుపూరు పొల్లు(55), అతని కుమారుడు మత్స్యరాజు, కుమార్తె మచ్చాలమ్మ అక్కడికి వచ్చి అకస్మాత్తుగా కత్తితో భీమన్న గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటనతో స్థానికులు హడలిపోయారు. క్లూస్‌ బృందానికి ఆధారాలు దొరకకుండా నిందితులు సంఘటన స్థలంలో కారం చల్లారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానిక గిరిజనులు డిమాండ్‌ చేశారు.

రెండేళ్లుగా గొడవ పడుతున్నారు

ఈ సంఘటనపై మృతుని భార్య బృంద.. విలేకరులతో మాట్లాడుతూ చిట్టుపూరు పొల్లు, అతని కుమారుడు రెండేళ్లుగా తమతో గొడవ పడుతూ ఇబ్బంది పెట్టేవారని చెప్పారు. వారి కుటుంబానికి తన భర్త చెడుపు, చిల్లంగి పెడుతున్నాడంటూ గొడవ పడేవారన్నారు. నెల రోజుల క్రితం పొల్లు సోదరుడు రాములు(50) కడుపునొప్పితో మృతి చెందాడని, అంతకు ముందు కొన్నాళ్ల క్రితం పొల్లు తల్లి మృతి చెందిందని, పొల్లుకు సంబంధించిన పశువు అనారోగ్యంతో బలహీనపడిందని, వీటన్నిటికి భీమన్న కారకుడని వారు అనుమానించారని చెప్పారు. ఈ క్రమంలోనే తన భర్తను పొట్టన పెట్టుకున్నారని ఆమె విలపించారు. కాగా భీమన్నకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.

ఆర్థిక పరమైన లావాదేవీలే కారణం

సంఘటన స్థలాన్ని పాడేరు డీఎస్పీ షేక్‌ సహబాజ్‌ అహ్మద్‌ సందర్శించి అరకులోయ ఎస్‌ఐ గోపాలరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. భీమన్న మృతదేహాన్ని, పరిసరాలను నిశితంగా పరిశీలించారు. అనంతరం పాడేరు డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ ఇరు కుటుంబాల మధ్య ఆర్థిక పరమైన లావాదేవీలు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించామని, భీమన్న హత్యకు గురికావడానికి ఇదే కారణమని భావిస్తున్నామన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేస్తామని, ఈ కేసును లోతుగా విచారణ జరుపుతామన్నారు. క్లూస్‌ బృందం సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది.

Updated Date - Apr 14 , 2025 | 11:18 PM