బాణసంచా కేంద్రంలో నిబంధనల ఉల్లంఘన
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:26 AM
కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడానికి నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించడమేనని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది.

పరిమితికి మించి మందుగుండు సామగ్రి, రసాయనాలు నిల్వ
అనుమతి ఇచ్చింది 15 కిలోలు.. ప్రమాదం జరిగినప్పుడు ఉన్నది 100 కిలోలు
నైపుణ్యం లేని కార్మికులతో బాణసంచా తయారీ పనులు
పనిచేయని అగ్నిమాపక పరికరాలు
కైలాసపట్నం పేలుడుపై అధికారులు ప్రాథమిక అంచనా
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడానికి నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించడమేనని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. పరిమితికి మించి మందుగుండు సామగ్రి, రసాయనాలు నిల్వ చేయడం, నైపుణ్యంలేని కార్మికులతో బాణసంచా తయారు చేయించడం, సరైన వెంటిలేషన్ లేకపోవడం, అగ్నిమాక పరికరాలు పనిచేయకపోవడం ప్రధాన కారణాలుగా అధికారులు భావిస్తున్నారు.
కైలాసపట్నంలో లక్ష్మీ గణేశ్ ఫైర్‌వర్క్స్ పేరుతో నిర్వహిస్తున్న బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. ఈ కేంద్రానికి 2026 వరకు అనుమతులు మంజూరు చేసిన అధికారులు.. భద్రతా ఏర్పాట్లు విషయంలో పెద్దగా పట్టించుకోకపోవడంతో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించడంతో అధికారులు రంగంలోకి దిగారు. బాణసంచా తయారీలో ఉపయోగించే రసాయనాలు, పాత యంత్రాలు, షెడ్లకు సరైన వెంటిలేషన్ లేకపోవడం, అగ్నిమాక పరికరాలు అందుబాటులో లేకపోవడం ప్రమాదానికి కారణాలని ప్రాథమికంగా అంచనా వేసినట్టు తెలిసింది. బాణసంచాను చిన్నపాటి గదిలో తయారు చేస్తున్నారు. ఇక్కడ అనుమతించిన దానికన్నా ఎక్కువ మొత్తంలో ముడిపదార్థాలు, ప్రమాదకర రసాయనాలు వున్నట్టు ప్రాథమిక విచారణలో అధికారులు గుర్తించారు. అనుమతుల ప్రకారం ఇక్కడ 15 కిలోల మందుగుండు మాత్రమే నిల్వ వుండాలి. కానీ ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 100 కిలోల రసాయనాలు, ముడి పదార్థాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. శిక్షణ పొందిన, నిపుణులైన కార్మికులే బాణసంచా తయారు చేయాలి. కానీ ఫైర్ వర్క్స్ నిర్వాహకులు నైపుణ్యం, సరైన అనుభవం లేని కార్మికులను నియమించుకుని, రోజువారి రూ.300 నుంచి రూ.500 వరకు కూలి చెల్లిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 30 మందికిపైగాపనిలో ఉన్నారని, వీరిలో ఎనిమిది మంది మృతిచెందగా, మరో ఎనిమిది మంది తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. అయితే మరో 14 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారని తెలిసింది.
చాపకింద నీరులా బాణసంచా తయారీ
జిల్లాలో 40కిపైగా అనుమతులు లేని కేంద్రాలు
ఎన్‌వోసీలు ఉన్నవి ఆరు మాత్రమే!
న్యాయస్థానం అనుమతితో కొంతమంది నిర్వహణ
ప్రభుత్వ శాఖల్లో కొరవడిన స్పష్టత
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని పలు మండలాల్లో అనుమతులు లేకుండా బాణసంచా తయారీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. అధికారుల నివేదికల ప్రకారం జిల్లాలో తహసీల్దార్లు, ఆర్డీఓల అనుమతులు పొందిన బాణసంచా తయారీ కేంద్రాలు ఆరు మాత్రమే వున్నాయి. మరో నాలుగు బాణసంచా విక్రయ కేంద్రాలు వున్నాయి. వీటికి 2026 వరకు అధికారులు లైసెన్స్‌లు ఇచ్చారు. ప్రతి బాణసంచా తయారీ కేంద్రానికి ఏటా అగ్నిమాపక, పోలీసు, పర్యావరణ, పంచాయతీ అధికారుల నుంచి నిరభ్యంతర పత్రాలు (ఎన్‌ఓసీ) పొందాలి. కానీ జిల్లాలో ఎటువంటి అనుమతులు పొందకుండా 40కిపైగా బాణసంచా తయారీ కేంద్రాలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. స్థానికంగా జరిగే శుభకార్యాలు, ఉత్సవాలు, అంతిమయాత్రలు వంటి కార్యక్రమాలకు ఆయా కేంద్రాల నిర్వాహకులు బాణసంచా సరఫరా చేస్తుంటారు. ఈ కేంద్రాల వల్ల కనీస భద్రతా ప్రమాణాలు పాటించడంలేదు.
బాణసంచా కేంద్రాలపై కొరవడిన స్పష్టత
కాగా జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలు ఎన్ని ఉన్నాయన్న దానిపై సంబంధిత శాఖల అధికారుల్లో స్పష్టత కొరవడింది. జిలాలో అనుమతులు పొందిన బాణసంచా తయారీ కేంద్రాలు, అమ్మకాల కేంద్రాలు ఎన్ని ఉన్నాయనే వివరాలు అధికారుల వద్ద లేవు. బాణసంచా కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు ఎక్స్‌ప్లోజివ్స్ విభాగం నుంచి వస్తాయిని, వాటిని స్థానిక ఆర్డీవోలు పరిశీలించి అనుమతులు జారీ చేస్తారని అగ్నిమాక శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాల పునర్విభజనకు ముందు 2021లో కొంతమంది బాణసంచా తయారీ కేంద్రాల ఏర్పాటుకు 2026 వరకు అనుమతులు పొంది వాటిని కొనసాగిస్తున్నారు. జిల్లాల పునర్విభజన తరువాత అనకాపల్లి జిల్లా పరిధిలో 22 బాణసంచా తయారీ కేంద్రాలకు అధికారులు ఎన్‌ఓసీలు జారీ చేయలేదు. దీంతో పలువురు కోర్టుకు వెళ్లి స్టేటస్‌కో ఉత్తర్వులు తెచ్చుకొన్నారు. ఈ కారణంగా జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలు ఎన్ని వున్నాయన్న సమాచారం అధికారుల వద్ద లేదు. జిల్లాలో ప్రస్తుతం ఆరు బాణసంచా తయారీ కేంద్రాలకు మాత్రమే అధికారులు ఎన్‌వోసీలు ఇచ్చినట్టు తెలిసింది. మరో 40 కేంద్రాల వరకు కోర్టు ఆదేశాలతో, లేదా ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్టు తెలిసింది.
ఒత్తిడి కారణంగానే పేలుడు
బాణసంచా తయారీ కేంద్రం ఘటనపై ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడి
కోటవురట్ల, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి):
బాణసంచా తయారు చేస్తున్న క్రమంలో ఏర్పడిన ఒత్తిడి కారణంగానే పేలుడు సంభవించినట్టు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందని జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా చెప్పారు. సోమవారం ఆయన స్థానిక పోలీసు స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతూ, షార్ట్ బాక్సులో కార్మికులు కెమికల్స్‌తో మందుగుండు కూరుతుండగా నిప్పురవ్వలు చెలరేగి అక్కడ ఉన్న ముడిసరకు, తయారీ చేసిన బాణసంచాకు అంటుకుని భారీ విస్ఫోటనంం సంభవించిందన్నారు. పెద్దఎత్తున మంటలు రావడంతో తొలుత స్థానికులు ఎవరూ అక్కడకు వెళ్లడానికి సాహసించలేకపోయారన్నారు. పోలీసులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్థు సహకారంతో మంటలను అదుపుచేశారని పేర్కొన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఎస్పీ చెప్పారు. క్షతగాత్రుల్లో ఆరుగురు విశాఖ కేజీహెచ్‌లో, ఇద్దరు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. పేలుడు ఘటనపై విచారణకు వైద్య, ఆరోగ్య, పోలీసు, అగ్నిమాపక, విద్యుత్ శాఖలకు చెందిన అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. విచారణ తరువాత ఇచ్చే నివేదికను ప్రభుత్వానికి ఇస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ దేవానంద్, నర్సీపట్నం డీఎస్‌పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పొట్ట నింపుతున్న వృత్తే ప్రాణాలు తీసింది!
బాణసంచా తయారీ కేంద్రం నిర్వాహకుల ఇంట తీవ్ర విషాదం
ప్రమాదంలో మామ, అల్లుడు మృతి, మరో అల్లుడి పరిస్థితి విషమం
కోటవురట్ల, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి):
బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేయడం ప్రమాదకరమని తెలిసినా.. కుటుంబ పోషణ కోసం వెళ్లకతప్పలేదు. దినదిన గండం నూరేళ్లు ఆయుషు అన్నట్టుగానే.. వారి బతుకులు అర్ధంతరంగా తెల్లారాయి. పొట్ట నింపుతున్న వృత్తే ప్రాణలు తీసింది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం సంభవించిన పెనువిస్ఫోటనంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. చిన్న ఏమరుపాటువల్ల జరిగిన పేలుడు ఎనిమిది కుటుంబాలను దిక్కుతోచని స్థితిలో నెట్టివేసింది. మొత్తం ఎనిమిది మంది మృతుల్లో ఆరుగురు కోటవుటర్ల మండలానికి చెందిన వారు కావడం గమనార్హం. వీరిపైనే ఆధారపడిన కుటుంబ సభ్యులు వీధినపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బాణసంచా కేంద్రాన్ని నిర్వహిస్తుండగా, వీరిలో ఇద్దరు మృతిచెందారు. మరొకరు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. మృతిచెందిన వారిలో మిగిలిన కుటుంబాల పరిస్థితి కూడా దయనీయంగా మారింది.
మావ, అల్లుడు మృతి, చావుబతుల మధ్య మరో అల్లుడు
చౌడువాడ గ్రామానికి చెందిన సేనాపతి బాబురావుకు అప్పికొండ తాతబ్బాయి (పల్లయ్య), జానకిరామ్ అల్లుళ్లు. జానకిరామ్ తన తోడల్లుడు తాతబ్బాయి వ్యవసాయం భూమిలో బాణసంచా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అతని పేరు మీదనే నడుపుతున్నాడు. పేలుడు ప్రమాదంలో బాబురావు, తాతబ్బాయి మృత్యువాతపడగా, జానకిరామ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.
తండ్రి మరణంతో ప్రశ్నార్థకంగా పిల్లల ఉన్నత విద్య
కోటవురట్ల మండలం రాజుపేట గ్రామానికి చెందిన సంగరాతి గోవిందకు భార్య జయలక్ష్మి, కుమార్తె లహరి, కుమారుడు మహేశ్ వున్నారు. పిల్లలను బాగా చదివించాలన్న ఉద్దేశంతో గోవింద బాణసంచా తయారీ కేంద్రంంలో పనిచేస్తుండగా, భార్య అచ్యుతాపురం సెజ్‌లోని అధిస్తాన్ (బ్రాండిక్స్) కంపెనీలో పనిచేస్తున్నది. వచ్చేకొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తూ పిల్లలను చదివిస్తున్నారు. కుమార్తె బీటెక్ మొదటి సంవత్సరం చదువుతుండగా, కుమారుడు సెకండియర్ పరీక్షలు రాసి శనివారం విడుదలైన ఫలితాల్లో 85 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఇతను కూడా ఇంజనీరింగ్ చేయాలనుకున్నాడు. ఇంతలోనే బాణసంచా కేంద్రంలో పేలుడు సంభవించి తండ్రిని కోల్పోయారు. దీంతో పిల్లల ఉన్నత విద్య ప్రశ్నార్థకంగా మారింది.
చేనేతకు ఆదరణ లేక..
మండలంలోని చౌడువాడకు చెందిన గుంపిన వేణుబాబు పదేళ్లుగా బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేస్తున్నాడు. వాస్తవంగా ఇతనిది చేనేత కుటుంబం. కానీ చేనేత వృతికి ఆదారణ లేకపోవడంతో కుటుంబ పోషణకోసం ఇక్కడ పనిలో చేరాడు. భార్య దేవి ఇంటి వద్దనే వుంటుంది. కుమారుడు బాలసాయి కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్ 9వ తరగతి చదువుతున్నాడు. వేణుబాబు ఆకస్మిక మృతి వీరిని ఇబ్బందుల్లోకి నెట్టివేసింది.