Share News

సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:14 AM

బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకు సాగు, తాగునీటి సమస్యలు లేకుండా చూస్తానని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు.

సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి
వేగావతి నదిలో అధికారులతో కలిసి నడుస్తున్న ఎమ్మెల్యే బేబీనాయన

  • బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన

  • వేగావతి నదీతీర ప్రాంతాల్లో పర్యటన

బొబ్బిలి, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకు సాగు, తాగునీటి సమస్యలు లేకుండా చూస్తానని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. నియోజకవర్గ పరిధిలో తాగు, సాగునీటి కష్టాలపై అధ్యయనం చేసేందుకు శుక్రవారం ఆయన సర్వే చేశారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు ఆయన వేగావతి నదీ తీరంలో అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమారు మూడు కిలోమీటర్ల దూరం పర్యటించారు. తమ పొలాలకు సాగునీరు అందడం లేదని పారాది చానెల్‌ పరిధిలో గల రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఏఈ హరిని ఎమ్మెల్యే వివరణ కోరగా, నది లోతట్టు ప్రాంతంలో ఉండడం, భీమవరానికి వెళ్లే చానల్‌ ఎత్తు ప్రాంతంలో ఉండడంతో సమస్య ఏర్పడిందని తెలిపారు. అనంతరం భోజరాజపురంలో గల మున్సిపల్‌ ప్రధాన వాటర్‌ వర్క్స్‌లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే పరిశీలించారు. టీడీపీ కౌన్సిలర్ల ద్వారా తాగునీటి సరఫరాకు ఏర్పడ్డ సమస్యలు తెలుసుకున్నారు. మున్సిపల్‌ డీఈఈ కిరణ్‌కుమార్‌, ఏఈ గుప్తాలు దీనిపై కూలంకుషంగా ఎమ్మెల్యేకు వివరించారు. మెట్టవలస దగ్గర రైతులకు ఇబ్బందులు కలగకుండా లీకేజీ సమస్యను పరిష్కరించాలన్నారు. అదనంగా ఇన్‌ఫిలే్ట్రషన్‌ బావి మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కొత్తగా రెండు బావుల పనులను ఆయన ప్రారంభించారు.

భోజరాజపురం బ్రిడ్జి, రోడ్డు పనులు పూర్తి చేస్తాం

అనంతరం ఎమ్మెల్యే విలేకర్లతో మాట్లాడారు. భోజరాజపురం బ్రిడ్జిని, రోడ్డు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. వాటర్‌వర్క్స్‌లో గతంలో తలెత్తిన సమస్యలను సరిచేస్తామని చెప్పారు. ఇన్‌ఫిల్ర్టేషన్‌ బావులను పటిష్టపరుస్తామని, కొత్తగా ఒక బావిని మంజూరు చేయిస్తానని తెలిపారు. పట్టణంలో, గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు రాంబార్కి, గెంబలి, బొత్స అప్పులు, వెలగాడ హైమావతి తదితరులు ఉన్నారు.

పారాది వంతెన పనుల పరిశీలన

బొబ్బిలి రూరల్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): పారాది గ్రామంలో చేపడుతున్న వంతెన పనులను ఎమ్మెల్యే బేబీనాయన శుక్రవారం పరిశీలించారు. అక్కడ ఉన్న ఇంజనీరింగ్‌ అధికారులతో మాట్లాడి వంతెన ప్రస్తుత స్థితిని అడిగి తెలుసుకున్నారు. వంతెన పనులు వేగవం తం చేయాలని, కావలసిన నిధులు సమకూరుస్తామని అధికారులకు, గుత్తేదారుకు తెలిపారు. ఈ వంతెన నిర్మాణంతో తమ రాజ కుటుంబానికి ఎంతో అవినాభావ సంబంధం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ గెంబలి శ్రీనివాసరావు, కౌన్సిలర్‌ ఆర్‌.శరత్‌, టీడీపీ నాయకుడు ఎ.భాస్కరరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 12:14 AM