Sri Ram Navami: కల్యాణం.. కమనీయం
ABN , Publish Date - Apr 07 , 2025 | 12:25 AM
Sri Ram Navami: రామతీర్థం రామస్వామి దేవస్థానంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

- రామతీర్థంలో వైభవంగా సీతారాముల పరిణయం
- వేలాది మంది భక్తుల హాజరు
- పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
నెల్లిమర్ల, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): రామతీర్థం రామస్వామి దేవస్థానంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేవస్థానం వెనుకవైపు ఉన్న వేదికపై వేలాది మంది భక్తుల సమక్షంలో సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు, ఆయన కుమార్తె, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మధుపర్కాలు సమర్పించారు. సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి క్షేత్రం నుంచి ఈవో సుబ్బారావు తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను మంత్రి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దంపతుల చేతుల మీదుగా సింహాచలం అందజేశారు. అలాగే ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ఝాన్సీలక్ష్మి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాలను వ్యక్తిగతంగా సమర్పించారు. దేవస్థానం ఈవో వై.శ్రీనివాసరావు పర్యవేక్షణలో స్వామివారి కల్యాణాన్ని అర్చకులు ఖండవిల్లి సాయిరామాచార్యులు, కిరణ్‌కుమార్, పవన్‌కుమార్, గొడవర్తి నరసింహాచార్యులు తదితర అర్చక బృందం శాస్త్రోకంగా నిర్వహించింది. రామనామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. జిల్లా నలుమూలల నుంచి సుమారు 30 వేల మంది భక్తులు వచ్చారని అంచనా. పలువురు జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రముఖులు రాములోరి కల్యాణోత్సవాన్ని తిలకించారు. దేవస్థానం ప్రధాన ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్ర స్త్రీశిశుసంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి దంపతులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకరరావు, ఎమ్మెల్సీ సురేష్‌బాబు, దేవాదాయ శాఖ డీసీ సుజాత, ఏసీ శిరీష, ఆర్డీవో డి.కీర్తి, రాష్ట్ర సాధుపరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి, శ్రవణ చైతన్య చిన్నస్వామి తదితరులు పాల్గొన్నారు. విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భోగాపురం రూరల్ సీఐ రామకృష్ణ, నెల్లిమర్ల ఎస్‌ఐ బి.గణేష్ గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
రామతీర్థంలో కల్యాణం తిలకిస్తున్న జిల్లా ప్రజాప్రతినిధులు, భక్తులు
గుళ్లసీతారాంపురంలో..
మంగళసూత్రాన్ని చూపిస్తున్న వేదపండితులు, నమస్కరిస్తున్న భక్తులు
సంతకవిటి, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): గుళ్లసీతారాంపురంలోని పురాతన సీతారాముల దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో ప్రధాన పూజారి భోగాపురపు ప్రసాద్‌రావు, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన సీతారా ముల కల్యాణాన్ని కనులారా తిలకించి భక్తజనం పులకరించిపోయారు. మండలం నుంచి కాకుండా రాజాం, రేగిడిచ వంగర. జి.సిగడాం తదితర మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు, సర్పంచ్ రావు రవీంద్ర ఏర్పాట్లు చేశారు. పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
కల్యాణం నిర్వహిస్తున్న దృశ్యం