DMHO meeting: వైద్య సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలి
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:49 PM
DMHO meeting: వైద్య సిబ్బంది అంకితభావంతో పని చేసి, ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తూ మంచి ఫలితాలు సాధించాలని జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి ఎస్.భాస్కరరావు సూచించారు.

- డీఎంహెచ్‌వో భాస్కరరావు
పార్వతీపురం, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): వైద్య సిబ్బంది అంకితభావంతో పని చేసి, ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తూ మంచి ఫలితాలు సాధించాలని జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి ఎస్.భాస్కరరావు సూచించారు. గురువారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో ప్రోగ్రాం అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజారోగ్యం దృష్ట్యా జిల్లాలో చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి సంబంధించి ప్రగతి నివేదికలను ఎప్పటికప్పుడు సిద్ధం చేసి సకాలంలో అందించాలని ఆదేశించారు. దీనిద్వారా వెనుకంజలో ఉన్న ఆరోగ్య కేం ద్రాలను గుర్తించి, అందుకు ఉన్న కారణాలపై విశ్లేషణ చేపట్టి పనితీరును మెరుగుపర్చుకునేందుకు వీలుంటుందన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు నమోదును పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. జిల్లాలో మాతా, శిశు వైద్య సేవల నిర్వహణ, అసంక్రమిత వ్యాధుల సర్వే, టీబీ, లె ప్రసీ, స్కూల్ హెల్త్, స్వచ్ఛాంద్ర తదితర ఆరోగ్య కార్యక్రమాలు పగడ్బందీగా అమలు చేయాలన్నారు. సంబంధిత పోర్టల్స్, యాప్ నమోదు తీరును పరిశీలించాలని ఆదేశించారు. ఎక్కడైనా వ్యాధులు గుర్తిస్తే ఎపిడమిక్ సెల్ వైద్య సిబ్బందిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. అందరూ సమయపాలన పాటిస్తూ మెరుగైన పనితీరును చూపించాలని అన్నారు. ఈ సమావేశంలో డీఐవో ఎం.నారాయణరావు, జిల్లా ప్రోగ్రాం అధికారులు టి.జగన్మోహన్‌రావు, పీఎల్.రఘుకుమార్, ఎం.వినోద్‌కుమార్, సూపరింటెండెంట్ కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.