Growth 16.12 శాతం వృద్ధికి ప్రణాళికలు
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:17 PM
Plans for 16.12% Growth జిల్లాలో 16.12 శాతం వృద్ధి సాధనకు చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ప్రణాళికను రూపొందిం చినట్లు వెల్లడించారు.

పార్వతీపురం, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 16.12 శాతం వృద్ధి సాధనకు చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ప్రణాళికను రూపొందిం చినట్లు వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లా తలసరి ఆదాయం రూ.1,67,543 కాగా, ఈ ఏడాది రూ.1,94,048 అంచనా వేసినట్లు చెప్పారు. 49.27 శాతం పారిశ్రామిక, 41.64 శాతం సేవా రంగాల పురోగతే లక్ష్యంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వ్యవసాయ, మత్స్య, ఉద్యాన పంటలపై దృష్టి సారిస్తామన్నారు. కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తామని, డ్వాక్రా, స్ర్తీనిధి, ఐటీడీఏల నిధులు నుంచి గొర్రెలు, పశువులు, కోళ్ల పెంపకం చేపట్టనున్నట్లు తెలిపారు. గత మూడేళ్లలో ‘ఉపాధి’ కింద 128.91 లక్షల పనిదినాలు కల్పించినట్లు వెల్లడించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 7,134 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాల్సిందేనని కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. బహిరంగ మలవిసర్జన ఎక్కడా ఉండరాదన్నారు. పీఎం జన్‌మన్ కింద లబ్ధిదారులకు గృహ నిర్మాణ సామగ్రి అందుబాటులో ఉంచాలని, మూడు నెలల్లో నాలుగు వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ ద్వారా ప్రజలకు సేవలు అందించాలని ఆదేశించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పనిచేయించాలన్నారు. జాయింట్ కలెక్టర్ శోభిక మాట్లాడుతూ.. రైతు గుర్తింపు నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. డీఆర్వో కె.హేమలత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డాక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.