Shikhaparuvu Waterfall శిఖపరువు జలపాతం అభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:51 AM
Steps Taken for the Development of Shikhaparuvu Waterfall సాలూరు మండలంలో ఉన్న శిఖపరువు జలపాతం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ షిప్) పద్ధతిలో పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు సాధ్యాసాధ్యాలను పరి శీలిస్తామన్నారు.

సాలూరు రూరల్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): సాలూరు మండలంలో ఉన్న శిఖపరువు జలపాతం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ షిప్) పద్ధతిలో పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు సాధ్యాసాధ్యాలను పరి శీలిస్తామన్నారు. శనివారం సాయంత్రం శిఖపరువు జలపాతాన్ని ఆయన పరిశీలించారు. జలపాతంలో దిగి స్నానం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయన్ను కలసి అభివృద్ధి విషయమై ప్రస్తావించారు. స్థానికులు సహకరిస్తే అభివృద్ధికి తగిన ప్రణాళికలు రూపొందిస్తామని కలెక్టర్ తెలిపారు. జలపాతం వద్ద ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. మెట్ల నిర్మాణం, హెచ్చరిక బోర్డులు, భద్రత తదితర అంశాలపై అభిప్రాయాలను సేకరించారు. ఆయన వెంట సాలూరు తహసీల్దార్ ఎన్వీ రమణ, వీఆర్వో శ్రీనివాసరావు, ఎస్‌ఐ నర్సింహమూర్తి, వెలుగు ఏపీఎం జయమ్మ తదితరులు ఉన్నారు.
స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం
పార్వతీపురం, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): షెడ్యూల్డ్ కులాల కార్యచరణ ప్రణాళిక కింద ఎస్సీ యువత నుంచి స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 266 యూనిట్లను రూ.11.03 కోట్లతో ఏర్పాటు చేయడానికి అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఇందులో సబ్సిడీ రూ.4.34 కోట్లు కాగా బ్యాంకు లోన్ రూ.6.14 కోట్లు, లబ్ధిదారుని వాటా రూ.55.14 లక్షలుగా ఉంటుందని వివరించారు. అర్హులైన ఔత్సాహిక షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతీ యువకులు వచ్చేనెల పదో తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. హెచ్‌టీటీపీఎస్// ఏపీవోబీఎంఎంఎస్. ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ వెబ్‌సైట్ ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చన్నారు. ఈ నెంబర్ల 96424 60838, 98499 05958కు కూడా ఫోన్ చేయొచ్చని సూచించారు.