Share News

జీఎస్‌టీ సమస్యలు పరిష్కరిస్తాం

ABN , Publish Date - Apr 11 , 2025 | 12:41 AM

వ్యాపారస్తులు ప్రభుత్వానికి సకాలంలో పన్నులు చెల్లిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. జీఎస్‌టీ విధానం అమలులోకి వచ్చిన తర్వాత అంతా పారదర్శకమే. ఇందులో వారికి ఏ విధమైన సందేహాలు వున్నా.. ఇబ్బందులు కలిగినా మా దృష్టికి తీసుకురావచ్చు. వెంటనే స్పందించి వాటికి తగు పరిష్కారాలు చూపిస్తాం’ అని వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంటు కమిషనర్‌ పి.జగదీష్‌బాబు పేర్కొన్నారు.

జీఎస్‌టీ సమస్యలు పరిష్కరిస్తాం

పన్నుల చెల్లింపులపై సందేహాల నివృత్తికి హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశాం

వ్యాపారుల సమస్యలకు వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంటు కమిషనర్‌ జగదీష్‌బాబు స్పందన

జిల్లా నుంచి జీఎస్‌టీలో నమోదైన వ్యాపారులు 16,000. జీఎస్‌టీ రూపంలో జిల్లా నుంచి నెలకు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.25 నుంచి 30 కోట్లు.

వ్యాపారులు జీఎస్‌టీ మాత్రమే చెల్లిస్తూ వృత్తి పన్నును వదిలేస్తున్నారు. వీరు ఏడు వేల మంది ఉన్నారు. ఏడాదికి రూ.1,250 నుంచి రూ.2,500 వరకు చెల్లిస్తే ఈ మొత్తం స్థానిక సంస్థలకు వెళుతుంది. లాయర్లు, డాక్టర్లు, అకౌంటెంట్స్‌ కూడా ఈ వృత్తి పన్ను చెల్లించాలి.

వ్యాపారస్తులు తమ పన్నుల చెల్లింపు విషయంలో నిబంధనలు అతిక్రమించి తక్కువ లెక్కలు చూపించి పన్నుల ఎగవేతకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. అనుమానం ఉన్న ప్రతీ వ్యాపార సంస్థను ఆన్‌లైన్‌ ద్వారా పరిశీలిస్తున్నాం. తేడాలుంటే ఎగవేసిన పన్నుతో పాటు అదనంగా 100 శాతం జరిమానాతో పాటు 18 శాతం వడ్డీ వసూలు చేస్తాం.

భీమవరం టౌన్‌/అర్బన్‌, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి):‘వ్యాపారస్తులు ప్రభుత్వానికి సకాలంలో పన్నులు చెల్లిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. జీఎస్‌టీ విధానం అమలులోకి వచ్చిన తర్వాత అంతా పారదర్శకమే. ఇందులో వారికి ఏ విధమైన సందేహాలు వున్నా.. ఇబ్బందులు కలిగినా మా దృష్టికి తీసుకురావచ్చు. వెంటనే స్పందించి వాటికి తగు పరిష్కారాలు చూపిస్తాం’ అని వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంటు కమిషనర్‌ పి.జగదీష్‌బాబు పేర్కొన్నారు. గురువారం నిర్వహించిన ‘ఆంధ్రజ్యోతి ఫోన్‌ ఇన్‌’ కార్యక్రమంలో పలువురు వ్యాపారులు తమ సమస్యలను కమిషనర్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి ఆయన తగు పరిష్కారాలు సూచించారు.

బంగారు వస్తువు తయారీలో యజమాని సొంత బంగారం కాకుండా మిగిలిన బ ంగారంపై జీఎస్‌టీ చెల్లిస్తే సరిపోతుందా ?

–వబిలిశెట్టి వెంకటేశ్వరరావు, భీమవరం

సమాధానం : వినియోగదారుడు ఇచ్చిన బంగారం విలువ కూడా ఇన్‌వాయిస్‌లో చూపించాలి. అయితే ఆ మేరకు టాక్స్‌ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, షాపు యజమాని ఇచ్చిన బంగారంతోపాటు తరుగు, మజూరీ, వాల్యూషన్‌ మొదలైన వాటిపై పూర్తి ఇన్‌వాయిస్‌ విలువపై టాక్స్‌ చెల్లించాలి.

నేను చిన్నపాటి వ్యాపారం చేస్తున్నా. జీఎస్టీ కట్టాలా ? నా టర్నవర్‌ తక్కువ.

– వి.వెంకటకృష్ణ, పాలకొల్లు

సమాధానం : సేవల టర్నోవర్‌ రూ.20 లక్షల లోపు ఉంటే ఏ విఽధమైనా పన్నులు చెల్లించనక్కర్లేదు. మీకు వస్తువుల టర్నోవర్‌ రూ.40 లక్షలు దాటితే మాత్రం కచ్చితంగా జీఎస్‌టీలో నమోదు చేసుకుని పన్నులు కట్టాలి.

2017–19 మధ్య జీఎస్‌టీ ఆలస్యంగా చెల్లించా. 2021లో నోటీసులు ఇచ్చారు. అసలు కట్టినా వడ్డీ కట్టాలంటున్నారు. దీనిని తొలగించండి.

– విజయ్‌, మునిసిపల్‌ కాంట్రాక్టర్‌

సమాధానం : గత నిబంధనలకు అనుగుణంగా అవకాశం ఉంటే వడ్డీ తగ్గించడానికి చర్యలు తీసుకుంటాం. ఇలాంటి సమస్యలున్న వారు జిల్లాలో 900 మంది వరకు ఉన్నారు. ఇప్పటి వరకు ఏడుగురు మాత్రమే పరిష్కరించుకున్నారు. దరఖాస్తు చేసుకుంటే వారి సమస్యను పరిష్కరిస్తాం.

జీఎస్‌టీకి ఎలా దరఖాస్తు చేసుకోవాలి.

– నర్సింహరావు, తణుకు

సమాధానం : జీఎస్‌టీ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా నమోదు చేసుకుంటే విజయవాడ సీఆర్‌యు వింగ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ను ఉచితంగా ఇస్తారు.

నేను ఒక కంపోజిషన్‌ టాక్స్‌ పేయర్‌గా రెండు అద్దె షాపుల్లో వ్యాపారం చేస్తున్నా. ఒకషాపు యజమానికి జీఎస్‌టీ రిజిస్ర్టేషన్‌ ఉంది. రెండో షాపు యజమానికి జీఎస్‌టీ ఎలా చెల్లించాలి.

– రమణారావు భీమవరం

సమాధానం : మీరు కంపోజిషన్‌ టాక్స్‌ పేయర్‌ కాబట్టి అద్దెపై జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరంలేదు. అయితే ఏ షాపు యజ మానికి జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ ఉందో వారు పార్వార్డ్‌ ఛార్జీ మెకానిజంలో అద్దెపై జీఎస్‌టీ చెల్లించాలి.

జీఎస్‌టీ చెల్లింపుల విషయంలో కొన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. వాటిని తెలుసుకోవడం ఎలా..

– రాధాకృష్ణ, ఆచంట

సమాధానం : భీమవరంలోని జిల్లా వాణిజ్య పన్ను ల శాఖ కార్యాలయంలో జీఎస్‌టీ హెల్స్‌ డెస్క్‌ను ఏర్పాటుచేశాం. మీ సమస్య ఎటువంటిదైనా తమ అధికారులు తక్షణ పరిష్కరం చూపుతారు.

జీఎస్‌టీ చెల్లింపుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి. వివరించగలరు.

– హనుక్‌బాబు, భీమవరం

సమాధానం : ప్రతీ నెల 20వ తేదీలోపు తమ రిటర్న్‌ ఫైల్‌ చేసేలా చూసుకోవాలి. మీరు చెల్లిచే పన్నును సకాలంలో చెల్లిస్తే ఫెనాల్టీలు పడే అవకాశం ఉండదు. తాను వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నాను. జీఎస్‌టీ పరిధి వివరాలు ఏమిటి..

– వి.రంగారావు, భీమవరం

సమాధానం : ఈ సర్వీస్‌లో 20 లక్షలు, గూడ్స్‌ రూ.40 లక్షలు దాటిన వారు విధిగా జిఎస్‌టి రిజిస్ట్రేషన్‌ తీసుకుని పన్నులు చెల్లించాలి.

Updated Date - Apr 11 , 2025 | 12:41 AM