బీసీలకు ప్రాధాన్యం
ABN , Publish Date - Apr 12 , 2025 | 01:31 AM
‘బీసీలే టీడీపీకి వెన్నెముక.. వారికే అధిక ప్రాధాన్యం. ఇతర వర్గాలనూ అదే తరహాలో పీ–4 విధానం లో పైకి తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తా. నేను ఓట్ల కోసం మీ దగ్గరకు రాలేదు. చరిత్రలో శాశ్వతంగా మంచి చేశానన్న పేరు కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నా. ఇందులో పారిశ్రామిక వేత్తలను భాగస్వామ్యం చేయడమే నా లక్ష్యం’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

ఆగిరిపల్లి పీ 4 సభలో సీఎం చంద్రబాబు నాయుడు
ఇతర వర్గాలను పైకి తీసుకొస్తాం
త్వరలోనే చింతలపూడి ఎత్తిపోతలు పూర్తి
నూజివీడు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
బలహీన వర్గాల కుటుంబాలతో మమేకం
ఆగిరిపల్లి/ఏలూరు/నూజివీడు/టౌన్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి):‘బీసీలే టీడీపీకి వెన్నెముక.. వారికే అధిక ప్రాధాన్యం. ఇతర వర్గాలనూ అదే తరహాలో పీ–4 విధానం లో పైకి తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తా. నేను ఓట్ల కోసం మీ దగ్గరకు రాలేదు. చరిత్రలో శాశ్వతంగా మంచి చేశానన్న పేరు కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నా. ఇందులో పారిశ్రామిక వేత్తలను భాగస్వామ్యం చేయడమే నా లక్ష్యం’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో శుక్రవారం ఆయన పర్యటించి, పీ–4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మార్కెట్‌యార్డులో జరిగిన ప్రజావేదిక వద్ద జరిగిన బహి రంగ సభలో నూజివీడుపై వరాల జల్లు కురిపించారు. తొలుత సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే 198వ జయం త్యుత్సవం సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి కొలుసు పార్థసారఽథి అఽధ్యక్షతన జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ ‘సంఘ సంస్కర్తగా జ్యోతి బాపూలే, సావిత్రి బాయి దంపతులు బడుగు, బల హీనవర్గాల అభ్యున్నతికి అవిరళ కృషి చేశారు. వారు 200 సంవత్సరాలకు పైబడి ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయారు. ఆ తరహా మీకు మంచి చేయడానికి నేనెప్పుడూ ఆలోచిస్తా. చరిత్రలో బీసీలకు మేలు చేసిన తొలి వ్యక్తి ఎన్టీఆర్. బీసీలను ఆదరించే బాధ్యతను నాతోపాటు డిప్యూటీ సీఎం పవన్, ప్రధాని మోదీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుం టాం. బీసీలకు ఆదా యం పెరిగేలా ప్రత్యేక కార్యక్రమాలను ఈ ప్రభుత్వం రూపొందించింది. ఆగిరిపల్లి అభివృద్ధికి నాలుగేళ్లలో చర్యలు తీసుకుని ఓటు అడగడానికి వస్తా. ఇక్కడ 206 కుటుంబాలను పీ–4 కింద గుర్తించాం. వీరిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కావాల్సిన ఆర్థిక, అంగ బలాలను సమకూర్చడానికి ప్రభుత్వంతోపాటు ఈ ప్రాంతానికి చెందిన పారిశ్రామిక వేత్తల సహాయ సహకా రాలను తీసుకుంటున్నాం’ అని సీఎం వివరించారు. వేదికపై ఎంపికైన బంగారు కుటుంబాలకు చెందిన పలువురితో సీఎం ముఖాముఖి మాట్లాడి, వారి స్థితిగతులను అడిగి తెలుసుకుంటున్నారు.
కష్టంగా పిల్లల చదువులు : ప్యారీ రేష్మ
నేను డ్వాక్రా సభ్యురాలిని. నా భర్త డ్రైవర్‌గా పనిచేస్తారు. సొంతిల్లు లేదు. పాప ఇంటర్, ఇద్దరు అబ్బాయిలు 9, 7వ తరగతులు చదువుతున్నారు. వీరి చదువుకు ఇబ్బందులు పడుతున్నాం. సొంతి ల్లు కట్టించి, జీవనోపాధికి మార్గం చూపించండి.
భారంగా జీవనం : బోణం లక్ష్మీదుర్గ
నా భర్త బోన్‌మారోతో మూడేళ్ల క్రితం చనిపోయారు. మా అమ్మ ఇంట్లో ఉంటున్నా. పాప యూకేజీ, బాబు అంగన్‌వాడీకి వెళుతున్నాడు. నాకు వితంతు పింఛను రావడం లేదు. మా మామయ్యకు పింఛన్ రావడం వల్ల మ్యాపింగ్ కాకపోవడంతో నాకు మంజూరు కాలేదు. నాకు జీవనోపాధికి మార్గం చూపించండి.
సీఎం : రేష్మకు సొంతిల్లు కట్టించే బాఽధ్యతను కలెక్టర్ వెట్రిసెల్వి తీసుకుంటారు. లక్ష్మీదుర్గకు ఈ నెల నుంచే పెన్షన్ ఇవ్వండి అంటూ వేదికపై నుంచి కలెక్టర్‌ను ఆదేశించారు. ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
టీడీపీతోనే బీసీల అభివృద్ధి
టీడీపీతోనే బీసీల అభివృద్ధి సాకారమైందని రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, ఎస్.సవిత అన్నారు. ప్రజావేదికలో వారు
మాట్లాడుతూ బీసీలకు ఆర్థిక,రాజకీయ స్వాతంత్య్రం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీయేనన్నారు. నవ్యాంధ్రలో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలను తిరుగుముఖం పట్టేలా చేసిన ఘనత వైఎస్ జగన్‌దేనని, తరలివెళ్లిన పెట్టుబడులను తిరిగి తీసుకువచ్చి నేడు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లు అశోక్ లైలాండ్ పరిశ్రమను ప్రారంభించారన్నారు. అతి త్వరలో మిట్టల్‌కు సంబంధించిన పరిశ్రమ రాష్ట్రంలో ప్రారంభమవుతుందన్నారు. బీసీల నమ్మక ద్రోహి జగన్ అని, బీసీలకు తీసుకువచ్చిన పథకాలను రద్దు చేశారన్నారు. గత ప్రభుత్వం నిలిపివేసిన విదేశీ విద్యను చంద్రబాబు తిరిగి ప్రవేశపెట్టారని చెప్పారు. ఒక్క ఛాన్స్ అన్న జగన్‌రెడ్డికి రాష్ట్ర ప్రజలు 11 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ఆయన సేవలకు స్వస్తి పలికారని ఆమె ఎద్దేవా చేశారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ మాట్లా డుతూ ఏలూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి జరిగితే ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చింది టీడీపీనే అని దానికి ఉదాహరణ తన తండ్రి సుధాకర్ యాదవ్, తానేనన్నారు.
మీ పని తీరు సంతృప్తికరం :
కార్యకర్తలతో సీఎం
‘నూజివీడు నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే, మంత్రి అయిన పార్థసారథితోపాటు కార్యకర్తల పనితీరు సంతృప్తికరంగా ఉంది. కాని, కొందరు మరింత మెరుగు పరుచుకోవాలి’ అంటూ టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. ఆగిరిపల్లిలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలకు, నియోజకవర్గ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దగ్గర నుంచి క్లస్టర్ ఇన్‌చార్జిల పనితీరుపై పూర్తి సమాచారం తమ వద్ద ఉందని, వాటి మేరకే స్థానిక పదవులు కేటాయింపు జరుగుతుందని స్పష్టంచేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో నాలుగుసార్లు విజయం సాధించాం. కోటగిరి హనుమంతరావు కార్యకర్తలు, ప్రజలతో మమేకమవడం వలనే అనేకసార్లు గెలుపొందారు. మాజీ ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వ్యవహారాన్ని పార్టీ చూసుకుంటుంది. మహిళలకు స్థానిక పదవుల విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలి. పార్టీ కార్య కర్తల పనితీరుకు ర్యాంకులను ఆయన ప్రకటించారు. ముసునూరు మండ లం ఏ–గ్రేడ్‌లో ఉండగా, నూజివీడు రూరల్, నూజివీడు టౌన్‌లు బీ–గ్రేడ్, ఆగిరిపల్లి, చాట్రాయి సీ–గ్రేడ్‌లో ఉన్నాయని ప్రకటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ బూత్ కన్వీనర్లు వారి పరిధిలోని లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలో అందేలా చూడాలని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ గన్ని వీరాంజనేయు లు, మంత్రి పార్థసారథి, ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్, నియోజకవర్గ నాయకులు దేవినేని ఢలారాం, మల్లిశెట్టి జగదీష్, ముసునూరు రాజా, చిట్నేని శివరామకృష్ణ, పామర్తి నర్శయ్య, బొట్టు వరలక్ష్మి, ఆరేపల్లి శ్రీనివాస్, బసవారెడ్డి, మరీడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సీఎం.. ప్రజలతో మమేకం
సీఎం చంద్రబాబునాయుడు ప్రజలతో మమేకమయ్యారు. ఉదయం పదిన్నర గంటలకు ఆగిరిపల్లి మండలం వడ్లమాను హెలీప్యాడ్‌కు చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి ఆగిరిపల్లి చేరుకున్న సీఎం బీసీ వర్గీయులను కలిశారు. నాయీ బ్రాహ్మణుడు బత్తుల జగన్నాథం, గొర్రెల కాపరి కోటయ్య, శివయ్యల దుకాణాలు, ఇళ్ల వద్దకు వెళ్లారు. వారి కుటుంబ సభ్యులతో కాసేపు గడిపారు. పిల్లలతో ముచ్చటించారు. మేకలు, గొర్రెలను ఎత్తుకు న్నారు. పశువులకు పచ్చగడ్డి వేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తమ ఇంటికి వచ్చి యోగ క్షేమాలు తెలుసుకోవడంపై ఆయా కుటుంబాలు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. సీఎం తమ ఆతిథ్యం తీసుకోవడం జీవితంలో మరిచిపోలేమని వారు చెప్పారు. ఒక ముఖ్యమంత్రి నేరుగా ఇలా ప్రజల వద్దకే వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకోవడం ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు.
సీఎం ఏ సమయానికి ఎక్కడ ?
10.30కి హెలిప్యాడ్ వద్దకు రావాల్సిన సీఎం చంద్ర బాబు హెలికాప్టర్ 10.45కు చేరుకుంది.
10.52కు ముఖ్యనాయకులతో మాట్లాడి బీసీ సామాజిక వర్గీయులతో మమేకమయ్యేందుకు ఆగిరిపల్లి పయనం.
10.59కు నాయీ బ్రాహ్మణుడు బత్తుల జగన్నాఽథం, గొర్రెల కాపరి నక్కనబోయిన కోటయ్య స్థితిగతులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
11.45కు ప్రజావేదిక సభకు హాజరు.
12.30కు సీఎంకు కంబళి కప్పి, మేకపిల్లను బహుకరిం చిన కృష్ణా జిల్లా గొర్రెల పెంపకందారుల అధ్యక్షుడు వెంకటకృష్ణ
12.40కు సీఎంకు నూజివీడు రసాలను బహుకరించిన బీజేపీ రాష్ట్ర నాయకురాలు శరణాల మాలతిరాణి
1.45కు పీ4 మార్గదర్శులకు సన్మానం
2.25కు టీడీపీ క్యాడర్‌తో ముగిసిన సమావేశం. హెలికాప్టర్‌లో ఒంటిమిట్టకు పయనం.
అనాథలను చదివిస్తా
హీల్ అనే పాఠశాల ద్వారా వెయ్యి మంది అనాఽథ విద్యార్థులకు విద్యను అందిస్తున్నాం. వివిధ ప్రాంతా ల్లోని అనాఽథలను గుర్తించి వారికి చదువు చెబుతాం.
– ధనప్రకాశ్, మోడల్ డెయిరీ డైరెక్టర్
300 మంది విద్యార్థులకు ఉచిత విద్య
నేను స్థాపించిన హ్యాపీ వ్యాలీ స్కూల్‌ను మీరే ప్రారం భించారు. ఈ స్కూల్ కోసం చేసిన రూ.వంద కోట్ల అప్పు తీర్చాను. 300 మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నా. వారు మంచి జీవితాన్ని ప్రారం భించే వరకు బాధ్యత తీసుకుంటా.
– గౌతమ్, ఆగిరిపల్లి హ్యాపీవ్యాలీ స్కూల్ అధినేత
మట్టిలో ఆణిముత్యాలను వెలికితీస్తా
పీ 4 కార్యక్రమం ద్వారా మట్టిలో ఆణిముత్యాలను వెలికి తీసే బాధ్యత తీసుకుంటా. నితిన్ సాయి కన్ స్ట్రక్షన్స్ నుంచి పలువురికి ఉద్యోగాలు కల్పిస్తా.
– నితిన్ కృష్ణ, మంత్రి పార్థసారథి తనయుడు
కుటుంబాలను దత్తత తీసుకుంటా
మీ కార్యక్రమాలే నా ఎదుగుదలకు స్ఫూర్తి. 60మందితో ప్రారంభమైన మా కాలేజీలో ఇప్పుడు ఆరు వేలమంది మూడు బ్రాంచిల్లో చదువుతున్నారు. ఎక్కువ మంది కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ప్రయత్నిస్తా.
– రావి వెంకట్రావు, ఎన్‌ఆర్‌ఐ కాలేజెస్ చైర్మన్